అడవి బిడ్డలను పొమ్మంటున్నారు 

Adivasis face eviction from forest lands - Sakshi

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో దేశంలోని 16 రాష్ట్రాల్లోని ఆదివాసీలు, గిరిజనులు, అడవిపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది తక్షణమే అడవి వదలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి ముందు ఆదివాసీల అటవీ హక్కుల చట్టానికి భిన్నమైన తీర్పు రావడం బీజేపీకి నష్టం చేకూరుస్తుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రాధాన్యాన్ని కోర్టులో సరిగ్గా వివరించని కారణంగానే ఆదివాసీలు నష్టపోవాల్సి వస్తుందని అపవాదును ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

అటవీ హక్కుల చట్టం–2006 చెల్లుబాటుకు సంబంధించిన ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌పై పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన వాజ్యంపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. పిటిషన్‌ దారుల్లో ఒకరైన నేచర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ స్వచ్ఛంద సంస్థ 2006 అటవీ హక్కుల చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. అడవి విధ్వంసానికి, వన్యప్రాణులకు నష్టం చేస్తుందని పేర్కొంది. అటవీ హక్కుల చట్టంలో వాడిన అదర్‌ ట్రెడిషనల్‌ ఫారెస్ట్‌ డ్యుయెల్లర్స్‌ అనే కోవలోనికి ఎవరొస్తారన్న విషయంలో రాజ్యాంగంలోనే అస్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్‌ ఆధారంగా ఇచ్చిన కోర్టు ఆదేశాల ప్రకారం అటవీ హక్కుల చట్టం పరిధిలో భూ యాజ మాన్య హక్కు దరఖాస్తుల తిరస్కరణకు గురైన దాదాపు 11 లక్షల మంది ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి జూలై 27లోగా ఖాళీ చేయించాలని కోర్టు స్పష్టం చేసింది.

నిర్దాక్షిణ్యంగా తరిమికొడతారా? 
ఆదివాసీలపై అటవీశాఖ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివాసీల హక్కులు హరణకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఆ శాఖ ఎదుర్కొంటోంది. ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌ కింద భూయాజమాన్య హక్కుల దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను అడవి నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టే ప్రయత్నం జరుగుతోంది. అటవీ ఉత్పత్తుల ద్వారా అటవీ శాఖకు వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడంతో ఆదివాసీలపై ఒత్తిడి పెరుగుతోందని ఆదివాసీల హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

2శాతం మందికే అనుమతి
ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖ గణాంకాల ప్రకారం దేశం మొత్తం 42.19 లక్షల మంది భూ యాజమాన్య హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే 18.89 లక్షల మందినే అనుమతించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారిని కూడా కలుపుకుంటే అడవి నుంచి నిర్వాసితులు కానున్న ఆదివాసీల సంఖ్య 23 లక్షలకు పైగానే ఉంటుంది. గోండూ, ముండా, డోంగ్రి యా తదితర ఆదివాసీలు తమ అటవీ భూములను బాగు చేసుకొని అందులో పండించుకునే అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి బతుకుతారు. ఇందులో 2 శాతం మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన వారంతా అక్రమంగా అటవీ ప్రాంతంలో సాగుచేసుకుంటున్న వారేనని అటవీ హక్కుల చట్టాన్ని బట్టి అర్థం అవుతోంది. అయితే కోర్టులో కేంద్రం ఆదివాసీల రక్షణ చట్టాన్ని సమర్థించుకోలేకపోయిందన్న విమర్శలొస్తున్నాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top