‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నా విజయ రహస్యం..
ముంబై: ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నా విజయ రహస్యం.. నేను తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఎవరూ హర్షించకపోయినా పట్టించుకోలేదు.. జీవితంలో రాజీ పడలేదు. అందుకే నటుడిగా పలు విజయాలను సాధించగలిగాను..’ అని బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ తెలిపాడు. ‘ నేను ఎప్పుడు ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా దాన్ని సన్నిహితులు, స్నేహితులు, హితులు అనుకున్నవారంతా ఖండిస్తూనే ఉన్నారు.
నువ్వు తప్పు చేస్తున్నావు.. ఆలోచించుకో.. అంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అలా చేస్తే నీ భవిష్యత్తుకే నష్టం..’ అంటూ చెబుతూనే ఉన్నారని ఆమీర్ చెప్పాడు. ముంబైలో మంగళవారం యువ ఇన్‌స్పెక్టర్ల సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాడు. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే.. ‘నేను నా హితులు, సన్నిహితులు చెప్పేది శ్రద్ధగా వినేవాడిని... వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.. అయితే చివరకు నాకు నచ్చినట్లే చేసేవాడిని.. గత 25 యేళ్లుగా ఒక కళాకారుడిగా నేను నా ఆలోచన సరళినే అనుసరిస్తూ బతుకుతుండటంపై ఆనందంగా ఉన్నాను. ప్రస్తుతం నేను ఒక విజయవంతమైన నటుడిని.. అయితే మున్ముందు కూడా ఇలానే ఉంటానని చెప్పలేను. అయితే నా జీవితంలో రాజీ పడలేదు.. పడను కూడా.. మొహమాటానికి పోయి ఎప్పుడూ నాకు నచ్చని పని చేయలేదు..’అని ఆమిర్ చెప్పాడు.
ఆమిర్ తన సినీ జీవితాన్ని ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో ప్రారంభించాడు. అది సూపర్‌డూపర్ హిట్..అంతే అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.. అనంతరం ఆయన నటించిన ‘రాజా హిందూస్థానీ’, ‘సర్ఫరోష్’, ‘లగాన్’,‘ఫనా’, ‘రంగ్ దే బసంతి’, ‘గజనీ’, ‘3 ఈడియట్స్’, ‘ధూమ్ 3’వంటి చిత్రాలు ఆమిర్‌లోని నటనా కౌశలాన్ని ప్రతిబింబింపజేశాయి. ఒక నటుడిగా అతడు నానాటికీ ఎదుగుతూ ప్రస్తుతం శిఖరాగ్రానికి చేరుకున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ‘తారే జమీన్ పర్’ సినిమాతో తన సత్తా నిరూపించుకున్నాడు.