
పామును మింగుదామని ప్రయత్నించి....
సాధారణంగా చేపలను, కప్పలను పాములు తినే సందర్భాలు మనం చూస్తుంటాం.
సాక్షి, బెంగళూరు: సాధారణంగా చేపలను, కప్పలను పాములు తినే సందర్భాలు మనం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగాఓ చేప తనకంటే పదింతలు పెద్దదైన పామునే మింగేయాలని పోరాటం చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ చేప దెబ్బకి అంత పెద్ద పాము గిలగిలా కొట్టుకుంది. చివరకు చేప పోరాడి ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని సీగేబాగే గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీగేబాగే ప్రాంతంలోని భద్రానదిలో ఓ నాగుపామును చేప నోటితో కరిచి పట్టుకుంది. ఉన్నట్లుండి జరిగిన ఈ ఘటనతో నాగుపాము గిలగిలా కొట్టుకుంది. ఈ పోరులో చేప, పాము నది ఒడ్డుకు చేరుకున్నాయి.
కాసేపు పెనుగులాడిన అనంతరం ఊపిరాడక చేప చనిపోయింది. చేప చనిపోయిన కొంత సేపటి తరువాత బయటపడిన నాగుపాము బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటనను భద్రానది ఒడ్డున జాలర్లు చిత్రీకరించడంతో వెలుగులోకొచ్చింది.