కేంద్రం ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన విపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు చేపట్టాయి.
ఢిల్లీ/తిరువనంతపురం: కేంద్రం ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన విపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు చేపట్టాయి. వామపక్షాలు 12 గంటల బంద్‌కు పిలుపునివ్వగా.. కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) ఆందోళనలు చేపట్టాలని నిర్ణరుుంచాయి. జేడీయూ, బీజేడీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోమన్నాయి. ఈ నేపథ్యంలో కేరళ, త్రిపురల్లో బంద్ విజయవంతమైంది. కమ్యూనిస్టులకు పట్టున్న పశ్చిమ బెంగాల్‌లో మాత్రం బంద్ విఫలమైంది. కాంగ్రెస్, తృణమూల్ కార్యకర్తలు పలు రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడులో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు ఆయా పార్టీల కార్యకర్తలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ఎదుట ఆందోళనలు చేసి అరెస్టయ్యారు.
ఢిల్లీలో సీపీఎం, సీపీఐతో సహా ఏడు వామపక్షాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారుు. కాంగ్రెస్ సోమవారం ‘ఆక్రోశ్ దివస్’గా పాటించింది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ రైసినా రోడ్ నుంచి పార్లమెంటు వరకు నిరసన ప్రదర్శన జరపాలనుకున్నప్పటికీ పోలీసులు బారికేడ్లను అడ్డంపెట్టి వారి ప్రయత్నాన్ని వమ్ము చేశారు. నిరసన ప్రదర్శనలతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డారుు. కేరళలో అధికార పార్టీ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ చేపట్టిన 12 గంటల బంద్ విజయవంతమైంది.
పశ్చిమ బెంగాల్‌లో బంద్ విఫలం.. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ పార్టీలు చేపట్టిన 12 గంటల బంద్ విఫలమైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించడంతో బంద్ ప్రభావం రాష్ట్రంలో కనిపించలేదు. మరోవైపు కొత్త నోట్లు దొరకక, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆగ్రహంగా ఉన్న ప్రజలు మణిపూర్ రాష్ట్రంలోని రెండు ఎస్‌బీఐ శాఖలను ధ్వంసం చేశారు. రాజస్తాన్ నాగౌర్ జిల్లాలో ప్రహ్లాద్ సింగ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు బ్యాంకు వద్ద వరుసలో నిలబడి ఉండగా మరణించాడు.