చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

60 years back Investigation to starts Chandrayaan - Sakshi

శ్రీహరికోట(సూళ్లూరుపేట): నెలలో సగం రోజులు చీకటిలో ఉండి, మరో సగం రోజులు చల్లని వెన్నెల కురిపించే నెల రాజు గురించి తెలుసుకోవడానికి 60 ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. చందమామ విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రుని చుట్టు కొలత 10,921 కిలోమీటర్లు అని నాసా శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. నానాటికీ చంద్రుని పరిమాణం కూడా తగ్గిపోతోందనే విషయం కూడా వారి పరిశోధనల్లోనే వెల్లడైంది. అదే విధంగానే చంద్రుడు భూమికి మధ్య దూరం పెరిగిపోతోందని, ఏడాదికి సుమారు 15 అంగుళాల చొప్పున చంద్రుడు దూరంగా వెళుతున్నాడని కూడా నాసా వెల్లడించింది.

ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు చాలా వరకు ఇప్పటికి 125 ప్రయోగాలు చంద్రుడిపైకి చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 1958 నుంచి అమెరికా చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించింది. 12 ప్రయోగాలు చేసిన తరువాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించగలిగింది. అలా ఇప్పటిదాకా 58 ప్రయోగాలు చేసి 41 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. 1969లో అపోలో రాకెట్‌ ద్వారా నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్‌ ఆల్డ్రిన్, మైఖేల్‌ కొలిన్స్‌ అనే ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ఘనత అమెరికాదే. ఈ ప్రయోగం జరిగి కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. రష్యా 1958 నుంచి చంద్రునిపైకి 53 ప్రయోగాలు చేసింది. అందులో 35 మాత్రమే విజయం అయ్యాయి. 1990 నుంచి జపాన్‌ ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక్క ప్రయోగం నాసాతో కలిసి చేసింది. ఇందులో ఐదు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2010 నుంచి చైనా ఏడు ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగం మాత్రమే చంద్రుని దాకా వెళ్లగలిగింది.

ఇజ్రాయెల్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాండర్‌ను çపంపించినా అది విజయవంతం కాలేదు. జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్‌ను విజయవంతంగా పంపించింది. 2008లో భారత్‌ చంద్రుడి మీదకు చంద్రయాన్‌–1 పేరుతో ఆర్బిటర్‌ ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, జర్మనీ, ఇజ్రాయెల్, భారత్‌ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినప్పటికీ అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలే ఇప్పటికీ ముందంజలో ఉన్నాయి. తాజాగా, భారత్‌ రెండో సారి ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, రోవర్‌ను ల్యాండర్‌ ద్వారా పంపి దాన్ని చంద్రుడిపైకి దించడం మాత్రం చేస్తున్నది భారత్‌ మాత్రమేనని చెప్పుకోవచ్చు. చంద్రుడు, అంగారకుడు మీదకు రోవర్లు పంపిన వారు పెద్ద పెద్ద బాల్స్‌ వంటి వాటిలో రోవర్లను అమర్చి పంపారు. భారత్‌ మాత్రం ల్యాండర్‌ను చందమామపై దించే మొట్టమొదటి దేశంగా ఖ్యాతి సాధిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top