ఐఫోన్ కోసం ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. పాశవికంగా హత్య చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది.
న్యూఢిల్లీ: ఐఫోన్ కోసం ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. పాశవికంగా హత్య చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడింది కూడా ఓ 17 ఏళ్ల బాలుడే. రంజిత్ నగర్‌కు చెందిన పండ్ల వ్యాపారి కుమారుడు గణేష్(6). గురువారం సాయంత్రం ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన గణేష్ కనిపించలేదు. అయితే అతనిని కిడ్నాప్ చేశామని, రూ. 1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే రోజు రాత్రి గణేష్ తండ్రికి ఫోన్ రావడంతో అతను పోలీసులను ఆశ్రయించారు.
శుక్రవారం సాయంత్రం నారాయనాలోని సత్యా పార్క్‌లో గణేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో చిన్నారి చివరిసారిగా ఎవరితో ఉన్నాడనే విషయం పరిశీలించగా.. అతని ఇంటికి సమీపంలో నివసిస్తున్న బాలుని(17)తో ఆడుకున్నట్టు గుర్తించారు. దీంతో ఆ బాలుడిని అతని తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రశ్నించగా.. తానే గణేష్‌ను హత్య చేసినట్టు అంగీకరించాడు. ఐఫోన్ కొనుగోలుకు.. విలాసంగా జీవించేందుకే హత్యకు పాల్పడినట్టు వెల్లడించాడు.