40 లక్షల మందికి దక్కని పౌరసత్వం

40 Lakh People Not Included In NRC Draft In Assam - Sakshi

గువాహటి : అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ) ముసాయిదాను విడుదల చేసింది. 3.29 కోట్ల మంది జనాభాలోలో 2.89 కోట్ల మందికి పౌరసత్వం లభించింది. ఎన్‌ఆర్‌సీలో 40 లక్షల మందికి పౌరసత్వం దక్కలేదు. అంతకుముందు ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్‌గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. 

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్‌ఆర్‌సీ జాబితాను సోమవారం ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే ఎన్‌ఆర్‌సీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్‌ఆర్‌సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్‌ హజేలా తెలిపారు. 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తించారు. అస్సాం ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన జాబితాతో 2,89,83,677 మందికి పౌరసత్వం లభించింది.

ప్రస్తుతం విడుదల చేసింది ప్రభుత్వం గుర్తించిన జాబితా అని, తుది జాబితా మాత్రం కాదని ప్రతీక్‌ హజేలా అన్నారు. అక్రమ వలసల్ని నిరోధించేందుకు ఈ ముసాయిదాను ప్రకటించామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి మైనార్టీల అక్రమ వలసలు కొనసాగడం వల్లే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందిన నార్త్‌ ఈస్ట్‌ జాయింట్‌ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్‌ తెలిపారు. తాజా ముసాయిదా జాబితాలో పౌరసత్వం దక్కని వలస మైనార్టీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top