కొనసాగనున్న తుపాను బీభత్సం..

40 Killed In Storms Across India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష బీభత్సం కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు వాయువ్య భారత దేశాన్ని ముంచెత్తనున్నట్లు తెలిపింది. గత రెండు వారాలుగా ఇసుక తుపానుకు తోడు ఈదురు గాలులలతో కూడిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం ధాటికి ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణ నష్టం కూడా సంభవించింది. దేశమంతటా కలిపి సుమారు 41 మంది మృతి చెందినట్లు సమాచారం.

దక్షిణాదిపైనా ప్రభావం..
ఆదివారం కురిసిన వర్షాల ధాటికి ఉ‍త్తర ప్రదేశ్‌లో అధికంగా 18 మంది మృతి చెందగా, సుమారు 100 ఇళ్లు పిడుగుపాటుకు దగ్థమైనట్టు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మంది, తెలంగాణలో ముగ్గురు రైతుల మృతి చెందినట్లు అధికారిక సమాచారం. దేశ రాజధాని ప్రాంతంలో ఐదుగురు, పశ్చిమ బెంగాల్‌లో తొమ్మిది మంది మృతి చెందగా వీరిలో నలుగురు చిన్నారులున్నారు.

విమానాల మళ్లింపు..
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దాదాపు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈదురుగాలులు 70 విమానాలను దారి మళ్లించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోయింది. తుపాను తాకిడి పెరగడంతో ద్వారక నుంచి నోయిడా, వైశాలికి వెళ్లే మెట్రో రైలు సుమారు 45 నిమిషాల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అలాగే వర్షంతో పాటు ఈదురు గాలులతో పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top