3,900 కేసులు.. 195 మరణాలు | 3900 Corona Cases Registered In India | Sakshi
Sakshi News home page

3,900 కేసులు.. 195 మరణాలు

May 6 2020 2:22 AM | Updated on May 6 2020 2:22 AM

3900 Corona Cases Registered In India - Sakshi

శానిటైజ్‌ చేసిన కరెన్సీ నోట్లు, మాస్కును ఆరబెడుతున్న గువాహటికి చెందిన మహిళ  

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కారణంగా మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్రం నుం చి మంగళవారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 3,900 కరోనా కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాలు సకాలంలో వివరాలు అందించకపోవడం, అవి ఇప్పుడు జత కావడంతో ఈ పెరుగుదల నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోవిడ్‌ పరిస్థితిపై రోజువారీ వివరాలను వెల్లడించారు. తాజా గణాంకాలతో దేశంలో కోవిడ్‌ మొత్తం కేసులు 46,711కు, మరణాల సంఖ్య 1,583కు చేరుకుందన్నారు.

కరోనాతో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 98 మంది మృతి చెందగా, ఆ తర్వాత మహారాష్ట్ర (35), గుజరాత్‌(29), మధ్యప్రదేశ్‌(11), యూపీ (8), రాజస్తాన్‌(6) ఉన్నాయి. రికవరీ రేటు 28.17 శాతంగా ఉంది. ‘కోవిడ్‌ కట్టడి విషయంలో మనం మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఏ మాత్రం సడలింపు ఇచ్చినా పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతాయి. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లోని పాజిటివ్‌ రోగులతో కాంటాక్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు జరపాలి. వారి నుంచి సేకరించే సమాచారం కీలకం. తదుపరి చర్యలకు ఇది ఉపయోగపడుతుంది. లాక్‌డౌన్‌తో సానుకూల ఫలితాలను రాబట్టాం’అని వివరించారు.

సామాజిక వ్యాప్తి జరగలేదు
దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి జరగలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన వారి ప్రవర్తనలో కలిగే మార్పులు ఆరోగ్యకరమైన సమాజానికి కొత్త సూత్రాలుగా మారనున్నాయని అన్నారు. చేతులు, శ్వాస, పరిసరాల పరిశుభ్రతలను జీవితంలో భాగంగా మార్చుకుంటే ఇప్పటి అనుభవం మున్ముందు ఆయాచితవరం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడంపై ఆయన.. ఆర్థిక రంగంతోపాటు ఆరోగ్యమూ ముఖ్యమేనని, ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం సమతుల్యత సాధించాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం ఒక్కరోజే 3,597 వరకు పెరగడంపై ఆయన..‘పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. రికవరీ రేటు కూడా పెరుగుతోంది. కరోనా వైరస్‌ను సామాజిక వ్యాప్తి దశలోకి మారకుండా అడ్డుకోగలిగాం. పరిశుభ్రత పాటించడం ద్వారా మున్ముందు దేశంలో ఇటువంటి వ్యాధుల విస్తరణను ఆపవచ్చు’అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement