31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

31 police personnel tested positive for COVID 19 in Indore - Sakshi

భోపాల్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న పోలీసులపై వైరస్‌ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోలీసు అధికారులు వైరస్‌ బారినపడ్డారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ విధులు నిర్వర్తిస్తున్న ఖాకీలకు కరోనా సోకింది. ఇండోర్‌లో 31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు స్థానిక ఎ‍స్పీ మహ్మద్‌ యూసఫ్ ప్రకటించారు. వీరందరినీ క్వారెంటైన్‌కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఎ‍స్పీ తెలిపారు. తాజా ఘటనతో పోలీస్‌శాఖ మరింత అప్రమత్తమైంది. విధి నిర్వహణలో పోలీసులు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.  (గ్యాస్‌ లీక్‌ బాధితుల పట్ల శాపంగా మారిన కరోనా)

మరోవైపు మహారాష్ట్రలోనూ గురువారం పలువురు పోలీసు అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేష‌న్‌కు చెందిన 26 మంది పోలీసులకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో 12 మంది ఉన్నతాధికారులు ఉ‍న్నట్టు అధికారులు వెల్ల‌డించారు. కాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,138 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 185 మంది వైరస్‌ కారణంగా మరణించారు. కాగా బుధవారం ఒక్కరోజే భోపాల్‌లో 12 మంది మ్యత్యువాడ్డ విషయం తెలిసిందే. అయితే వీరంతా భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితులేనని వైద్యులు ధృవీకరించారు. (ఒకే పోలీస్‌ స్టేషన్‌లో 26 మందికి కరోనా)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top