ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు 

15 Maoists Killed In Sukma Encounter In Chhattisgarh - Sakshi

15 మంది మావోల మృతి

భద్రతా దళానికి చిక్కిన ఐదుగురు.., వీరిలో ఓ మహిళ  

16 ఆయుధాలు, 5 కిట్‌ బ్యాగులు లభ్యం 

కుంట పోలీస్‌స్టేషన్‌కు మృతదేహాల తరలింపు 

ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించిన సుక్మా ఎస్పీ మీనా

సాక్షి, కొత్తగూడెం/చర్ల/పర్ణశాల: సరిహద్దు దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోలు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడి భద్రతా సిబ్బందికి చిక్కారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మరికొందరు పారిపోయినట్లు సుక్మా ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు. తెలంగాణ, ఏపీ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో 200 మంది సీఆర్‌పీఎ‹ఫ్, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సోమవారం తెల్లవారుజామున కుంట పోలీసుస్టేషన్‌కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో నులకతుంగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లగా మావోయిస్టులు బలగాలను గమనించి కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు గంటకు పైగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా, దళ కమాండర్‌ సహా 15 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో దళ కమాండర్‌ వంజం హుంగ, సభ్యులు ముచకి హిడ్మ, మడకం గంగు, హుంగా, ముచకి ముక్క, దాబో, మడకం టెంకో, ముచకి హిడిమా, మడకం సోసా, మడకం హుంగా, ముచకి నందా, సీత ఉన్నారు.

మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. ఓ మహిళ సహా నలుగురు మావోలు గాయపడి బలగాలకు చిక్కారు. ఘటనా స్థలంలో మొత్తం 16 ఆయుధాలు పోలీసులకు లభించాయి. వీటిలో 12 నాటు తుపాకులు, ఒక 305, ఒక 12–బోర్, 315–బోర్, పిస్టల్, కత్తి ఉన్నాయి. మృతదేహాలను కుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగిసిన రెండు రోజుల్లోనే మావోయిస్టులకు భారీ స్థాయిలో నష్టం జరగడం గమనార్హం. 

‘ఛత్తీస్‌’లో ఇదే భారీ నష్టం.. 
మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది కోలుకోలేని నష్టం జరిగింది. గత మార్చి 2న బీజాపూర్‌ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రతా బలగాలు, మావోయిస్టుల దాడులు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తంగా మారింది. గత ఏప్రిల్‌ చివరి వారంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఏకంగా 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. తరువాత ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో 8 మంది, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోలు మరణించారు.

ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి వద్ద జరిగిన ఘటనలో చర్ల ఏరియా కమాండర్‌ అరుణ్‌ మృతి చెందాడు. తాజాగా ప్రస్తుత ఎన్‌కౌంటర్‌లో మరో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌ తరువాత నుంచి ఇప్పటివరకు మావోయిస్టులు ప్రతీకారంగా భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు సహా ఇతరులను సుమారు 30 మందిని హతమార్చారు. గత 5 నెలల కాలంలో దండకారణ్యంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన పోరులో సుమారు 120 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. వీరిలో 90 మంది మావోయిస్టులు ఉండగా, 30 మంది భద్రతా సిబ్బంది, ఇతరులు ఉన్నారు. 
పట్టున్న చోటే మావోలకు 

ఎదురుదెబ్బ  
మావోయిస్టులకు గట్టి పట్టున్న (లిబరేటెడ్‌జోన్‌) ప్రాంతంలోకి దూసుకెళ్లిన జవాన్లు కోలుకోలేని దెబ్బతీశారు. ఈ ప్రాంతానికి జవాన్లు తొలిసారిగా వెళ్లి భారీ ఆపరేషన్‌ చేపట్టారని నక్సల్స్‌ ఆపరేషన్‌ డీజీడీఎం అవస్థి తెలిపారు. సుమారు 20 కిలోమీటర్ల మేర కాలినడకన మూడు కొండలు దాటి మావోయిస్టుల ఆచూకీ కనుగొన్నారని అన్నారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించిన ప్రాంతంలో మావోయిస్టులు 15 మందిని కోల్పోయినట్లుగా తెలుస్తోంది. గోంపాడ్, బాలా తోంగ్, మిన్‌చా ఏరియాలకు చెందిన మిలిషియా కమిటీలు సంయుక్తంగా క్యాంపు నిర్వహిస్తున్న క్రమంలో జవాన్లు ఒక్కసారిగా చుట్టుముట్టడంతోనే ఈ భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నట్లు సమాచారం.  

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top