కులాన్ని కాదు.. కులవృత్తులను ఉద్దరించాలని చెప్పా.. | Sakshi
Sakshi News home page

కులాన్ని కాదు.. కులవృత్తులను ఉద్దరించాలని చెప్పా..

Published Sat, Feb 3 2018 7:21 PM

KCR teacher said interesting things about KCR - Sakshi

కోదాడ : నాడు విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు కావ్యంలో ఉన్న ఓ పద్యంలో ‘కులాన్ని కాదు.. కులవృత్తులను ఉద్దరించాలని’ ఉందని దానినే తాను తరచుగా విద్యార్థులతో చెప్పేవాడినని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువు ముదిగొండ వీరభద్రయ్య అన్నారు. కేసీఆర్‌ దానిని గుర్తు పెట్టుకున్నాడో ఏమోగాని రాష్ట్రంలో కులవృత్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన శిష్యుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం కోదాడలోని కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌డేలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్‌ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తనకు శిష్యుడని తెలిపారు. నాడు బక్కపలచగా ఉండే కేసీఆర్‌ పెద్ద బొట్టుపెట్టుకొని కళాశాలకు వచ్చేవాడని,  విద్యార్థి దశలోనే ఎంతో చురుకుగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషాలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉందని, ఎన్నో తెలుగు పద్యాలను అలవోకగా చెప్పేవాడని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కొద్ది రోజుల్లో కేసీఆర్‌ తన దూరదృష్టితో కోనసీమగా మారుస్తాడనడంలో సందేహం లేదన్నారు. రైతును రాజును చేస్తానని కేసీఆర్‌ తనతో అన్నాడని అది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. రాజకీయ చతురత, విషయ పరిజ్ఞానంలో కేసీఆర్‌ను ఆయన ప్రత్యర్ధులు కూడ మెచ్చుకోకుండా ఉండలేరన్నారు. పసిగుడ్డుగా ఉన్న తెలంగాణకు ఆయన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని, అందుకే తెలంగాణ ప్రజలు ఆయనకు పట్టంకట్టి మంచి పని చేశారని అన్నారు.

Advertisement
Advertisement