ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది : మోహన్‌బాబు | Yamaleela -2 Platinum Disc celebration | Sakshi
Sakshi News home page

ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది : మోహన్‌బాబు

Nov 23 2014 10:33 PM | Updated on Aug 29 2018 9:35 PM

ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది :  మోహన్‌బాబు - Sakshi

ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది : మోహన్‌బాబు

ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. కథ ఎలా ఉన్నా... దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించేది దర్శకుడే. అలాంటి దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు.

‘‘ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. కథ ఎలా ఉన్నా... దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించేది దర్శకుడే. అలాంటి దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఆయన దర్శకునిగా మారి దాదాపు పాతికేళ్లు అయ్యింది. 40 ఏళ్లుగా నేను ఈ రంగంలో ఉన్నా... ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పుడు కలిగింది’’ అని మోహన్‌బాబు అన్నారు. కె.సతీశ్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.ఆశా సతీశ్ నిర్మించిన చిత్రం ‘యమలీల-2’. మోహన్‌బాబు ఇందులో యమునిగా నటించిన విషయం తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
  ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. ‘‘ఇంత క్రమశిక్షణగా మేం నడుచుకుంటున్నామంటే కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరిగార్లు నేర్పిన క్రమశిక్షణే. ఈ చిత్ర కథానాయకుడు సతీశ్‌లో కూడా అదే క్రమశిక్షణ కనిపింది. ఇందులో నేను పోషించిన యముడి పాత్ర నాకు ప్రత్యేకం’’ అని మోహన్‌బాబు తెలిపారు. ఆడియోలాగే సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని హీరో కె.సతీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘సతీశ్ కోసమే ఈ స్క్రిప్ట్ తయారు చేశాను. అభినయంతో పాటు డాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేశాడు. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం పాత్రలు ఈ చిత్రానికి హైలైట్’’ అని నమ్మకం వెలిబుచ్చారు.
 
  నటునిగా మోహన్‌బాబు 40వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని కె.అచ్చిరెడ్డి అన్నారు. ‘యమలీల’ టైమ్‌కి తాను ఓ ప్రేక్షకుణ్ణి మాత్రమేననీ, ‘యమలీల-2’కి వచ్చే సరికి పంపిణీదారుని స్థాయిలో జ్ఞాపిక అందుకోవడం ఆనందంగా ఉందనీ ‘దిల్’ రాజు సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో భాగంగా అప్పటి ‘యమలీల’ కథానాయకుడు అలీని ఈ ‘యమలీల-2’ యూనిట్ ఘనంగా సత్కరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement