గెలుపు అతని లక్షణం | Winner Movie Trailer Created Record with One Million Views | Sakshi
Sakshi News home page

గెలుపు అతని లక్షణం

Feb 14 2017 11:14 PM | Updated on Aug 3 2019 1:14 PM

గెలుపు అతని లక్షణం - Sakshi

గెలుపు అతని లక్షణం

చూపులకు చిన్నోడే.. పాతికేళ్ల కుర్రాడే. కానీ, పులికి ఎదురెళ్ళే ధైర్యం.. పాతికమందిని మట్టుబెట్టే బలం.. గడ్డిపోచగా తీసినోళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ అతనిలో ఉన్నాయి.

చూపులకు చిన్నోడే.. పాతికేళ్ల కుర్రాడే. కానీ, పులికి ఎదురెళ్ళే ధైర్యం.. పాతికమందిని మట్టుబెట్టే బలం.. గడ్డిపోచగా తీసినోళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ అతనిలో ఉన్నాయి. పరిస్థితులకు తలవంచకుండా గెలుపే లక్ష్యంగా పోరాడడం.. గెలిచి తీరడం అతని లక్షణం. మరి, ఆ కుర్రాడి కథేంటో మహాశివరాత్రికి థియేటర్లలో చూడమంటున్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. సాయిధరమ్‌ తేజ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా ఆయన దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మించిన సినిమా ‘విన్నర్‌’.

ఈ నెల 19న ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించి, శివరాత్రి సందర్భంగా ఈ 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో పాటలను సినీ ప్రముఖులు ఒక్కొక్కరూ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ‘నా బీసీ సెంటర్లు..’ అనే పాటను రవితేజ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుత స్పందన లభిస్తోంది. ట్రైలర్‌ను యూట్యూబ్‌లో 20 లక్షల మంది చూశారు.

ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. టర్కీలో చిత్రీకరించిన హార్స్‌ రేసింగ్‌ సీన్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. జగపతిబాబు, ముఖేశ్‌రుషి, ఆలీ, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: అబ్బూరి రవి, కళ: ఏఎస్‌ ప్రకాశ్, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఛోటా కె.నాయుడు, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, సమర్పణ: ‘బేబీ’ భవ్య.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement