వేధింపులంటూ.. ఫిల్మ్‌ ఇండస్ట్రీని బలి చేయొద్దు!

we will fight against sexual harassment, says Farhan Akhtar - Sakshi

ముంబయి : లైంగిక వేధింపులు కేవలం సినీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లో ఈ పరిస్థితులున్నాయని బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ‘కాస్టింగ్‌ కౌచ్‌’కు సంబంధించి ఇటీవల హాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూడగా.. ఆ వెంటనే బాలీవుడ్‌ నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు తాగొచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి స్వర భాస్కర్‌ ఆరోపించారు.

లైంగిక వేధింపులపై ఫర్హాన్‌ అక్తర్‌ స్పందిస్తూ.. ‘కేవలం ఫిల్మ్‌ ఇండస్ట్రీని బలి చేయడం సరికాదు. అన్ని రంగాల్లో వేధింపులు జరుగుతున్నాయి. బాధిత మహిళలు, యువతులు ఏదో రూపంలో ధైర్యంగా వారికి ఎదురైన విషయంపై బహిర్గం చేసి పోరాటం కొనసాగించాలి. ఈ విషయంలో వారికి పూర్తి మద్ధతు తెలుపుతా. లింగభేదం లేనప్పుడే సమాజం మరింత ముందుకు వెళ్తుంది. మహిళలపై వేధింపులకే పాల్పడేవాళ్లను అంత తేలికగా విడిచిపెట్టొద్దు. నా సినిమాల్లో అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తాను. అంతేకానీ పలానా మహిళ బాధితురాలంటూ వ్యత్యాసం చూపనని’  వెల్లడించారు. మహిళలపై వేధింపులు అడ్డుకోవాలంటూ వారికోసం పోరాటం చేసే వ్యక్తులలో ఫర్హాన్‌ ఒకరు. తన సినిమాల్లో హీరోలకు ఇచ్చేంత పారితోషికమే హీరోయిన్లకు ఇస్తానంటూ గతంలో పలుమార్లు చెప్పి లింగవ్యత్యాసం చూపడాన్ని వ్యతిరేకించాడు దర్శకనిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top