మౌలాలీ స్నేహితుడు

Venu Madhav Friends Relatives Worried About Hes Death - Sakshi

హాస్య నటుడు వేణుమాధవ్‌ మృతితో మౌలిలో విషాద ఛాయలు

మంచి స్నేహితుడ్ని కోల్పోయామంటున్న స్థానికులు

అనారోగ్యంతో బుధవారం మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ స్థానికులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని మౌలాలీ వాసులు గుర్తు చేసుకున్నారు. ఆయన గత 25 ఏళ్లుగా స్థానిక పెద్దలు, చిన్న పిల్లలకు సన్నిహితులని పేర్కొన్నారు. డివిజన్‌లో జరిగే ప్రతి పండగలోను వేణుఉత్సాహంగా పాల్గొనేవారని, తోటివారితో సందడి చేవారని వారు పేర్కొన్నారు.

కుషాయిగూడ: అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ స్థానికులతో కలివిడిగా.. ఎంతో అప్యాయంగా ఉండేవారు. 25 సంవత్సరాలుగా మౌలాలి ప్రాంతంలో నివసిస్తున్న ఆయన పెద్దలతో పాటుగా చిన్నపిల్లలకు సుపరిచితుడిగా మారారు. స్థానికంగా నిర్వహించే పండుగలు, ఉత్సవాలలో పాల్గొంటూ తన హాస్యంతో అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు గుర్తుచేసుకున్నారు.

నా గెలుపులో భాగస్వామి 
జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో నాకు అన్ని విధాలా అండగా నిలిచాడు. ఎన్నికల ప్రచారంలో సొంత మనిషిలా నాకు మద్దతుగా  ప్రచారం చేసి  నా గెలుపులో భాగస్వామి అయ్యాడు.   నేను తలపెట్టే ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యారు. వేణుమాధవ్‌ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది.   
–  గొల్లూరి అంజయ్య,  కార్పొరేటర్‌

1997 నుంచి స్నేహితులం 
వేణు మాధవ్‌ హెచ్‌బీకాలనీకి వచ్చిన తరువాత 1997లో మా స్నేహం మొదలైంది.  ఆయనతో పాటు పది సంవత్సరాలుగా సినిమా రంగంలో పనిచేశాను. ఈ క్రమంలో మా స్నేహం కాస్తా మరింత బలపడి కుటుంబ స్నేహితులుగా మారాం. తన సమస్యలు నాతో చర్చించేవాడు. గొప్ప మిత్రుడిని కోల్పోడం బాధగా ఉంది.   
– శ్రావణ్‌కుమార్‌గౌడ్‌

 ప్రతి ఫంక్షన్‌కు వచ్చేవాడు
కొద్ది కాలం క్రితం పరిచయమైన వేణన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్‌గా మారాడు. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడు. ఎక్కడైనా కలిశాడంటే చాలు నవ్వులు పండించేవాడు. అతనితో గడిపినంత సేపు సమయం గుర్తుకు వచ్చేది కాదు. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి కుటుంబ సమేతంగా హజరై సంతోష పరిచేవాడు. అలాంటి వ్యక్తి మరణించాడన్న వార్త మా కుటుంబ సభ్యులందరినీ బాధలో ముంచేసింది.
– వంజరి ప్రవీణ్‌

అందరిలో జోష్‌ నింపేవాడు
మా కాలనీలో జరిగే ప్రతి కార్యక్రమానికీ ఆయనను ఆహ్వానించేవాళ్లం. ముఖ్యంగా బోనాలకు ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొని మా అందరిలో జోష్‌ నింపేవాడు. ఎలాంటి సాయం కోరినా తనవంతు సాయం చేసేవాడు.
– సురేష్‌   

నమ్మలేకున్నాం
హాస్యనటుడు వేణుమాధవ్‌ హెచ్‌బీకాలనీలో అందరితో కలివిడిగా ఉంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. డివిజన్‌లో నిర్వహించే అన్ని ఉత్సవాలకు హాజరై  ఉత్సహపరిచేవాడు. అలా అందరికి సుపరిచితుడుగా మారిన వేణుమాధవ్‌ ఇక లేడంటే నమ్మలేకున్నాం.     
–  బోదాస్‌ రవి

(వేణుమాధవ్‌కు ప్రముఖుల నివాళి దృశ్యాల కోసం... క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top