ఒక ఉడి క‌థ‌

uri the surgical strike movie special - Sakshi

ఏ దేశంలో ఉండేదైనా మనుషులే.  వాళ్లకుండేదీ కుటుంబాలే.  తప్పు చేసిన ‘రోగ్‌ నేషన్స్‌’కి శిక్ష వేయాలి కానీ.. ఆ దేశంలో ప్రజలకు నష్టం కలక్కూడదు. యుద్ధంలో అదెలా సాధ్యం?! బాంబులు వేస్తే మంచివారు, చెడ్డవారూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోతారు కదా! అందుకే... సర్జికల్‌ స్ట్రయిక్స్‌. అందుకే.. ఈ రిపబ్లిడ్‌ డే రోజు  ‘ఉడి’ చిత్రంపై స్పెషల్‌ ఫోకస్‌.

సెప్టెంబరు 18, 2016. లష్కర్‌ ఏ తోయిబా టెర్రరిస్టులు తెల్లవారుజామున వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లోకి వచ్చి, ‘ఉడి’ ప్రాంతంలో ఉన్న 12 బ్రిగేడ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను ముట్టడించారు. వారి దాడిలో బిహార్‌కు చెందిన ఆరవ బెటాలియన్‌లోని పందొమ్మిది మంది జవానులు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసింది. ఆ వాస్తవ కథాంశమే ‘ఉడి: ది సర్జికల్‌ స్ట్రయిక్‌.’ 

విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ (వికీ కౌశల్‌) భారత ఆర్మీ మేజర్‌. ఎన్నో యుద్ధాలలో  విజయాలు సాధిస్తూ, మాతృదేశానికి సేవ చేస్తుంటాడు. అయితే తన తల్లిని విస్మరిస్తున్నాననే బాధ అతడి హృదయాన్ని దహిస్తూ ఉంటుంది. అల్జీమర్స్‌ వ్యాధితో ఉన్న తల్లి.. చెల్లి దగ్గర ఉంటుంది. ఈ సమయంలో తల్లి దగ్గరకు వెళ్లకపోతే, తనను పూర్తిగా మరచిపోతుంది అనుకుంటాడు. విధుల నుంచి తప్పుకుని, తల్లి దగ్గరకు వెళ్లిపోతానని చెబుతాడు. ‘దేశానికి సేవ చేసే అదృష్టం అందరికీ లభించదు. శక్తి ఉన్నంతవరకు దేశం కోసం పాటుపడాలి’ అని పై అధికారి అనడంతో మనసు మార్చుకుని, తన తల్లి ఉండే ప్రాంతానికి బదిలీ చేయించుకుంటాడు. రాజధానిలో ఆర్మీ బేస్‌లో చేరి, తల్లికి సేవ చేస్తుంటాడు. చెల్లి భర్త మేజర్‌ కరణ్‌ కశ్యప్‌ (మోహిత్‌ రైనా) కూడా సైనికదళంలోనే పని చేస్తుంటాడు. వారికి ఒక పాప. ఆ పాపలో తండ్రి, మేనమామల దేశభక్తి ప్రవహిస్తుంటుంది. తను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరతానంటుంది.  తల్లి (స్వరూప్‌ సంపత్‌)ని చూసుకోవడానికి జాస్మిన్‌ అల్మైదా (యామీ గౌతమ్‌) అనే ఒక నర్సుని పెడతాడు విహాన్‌. ఆమే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజున అకస్మాత్తుగా తల్లి కనిపించదు. అంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించదు. ఆ కోపంలో నర్సుని విధుల నుంచి తొలగిస్తారు. ఆమె వెళ్లిపోతుంది.  ఇంతలో తల్లిని కారులో తీసుకువస్తారు అపరిచితులు. (వెళ్లిపోయిన ఆ నర్సు తరవాత ‘రా’ ఏజెంట్‌ అని విహాన్‌కి తెలుస్తుంది).  

ఈ క్రమంలో లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఉడిలో చేసిన దాడిలో వీర మరణం పొందుతాడు విహాన్‌ చెల్లి భర్త కరణ్‌. టెర్రిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు విహాన్‌. అదే సమయంలో పాకిస్తాన్‌ చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది భారత ప్రభుత్వం. నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌ గోవింద్‌ భరద్వాజ్‌ (పరేశ్‌ రావల్‌) సర్జికల్‌ స్ట్రయిక్‌కి ప్రణాళిక రూపొందిస్తాడు. ఆ బెటాలియన్‌కి నాయకత్వం వహించి, ఉడి ఆర్మీ బేస్‌ క్యాంపులో పథకం ప్రకారం దాడులు జరపడానికి విహాన్‌సింగ్‌ సన్నద్ధుడవుతాడు. మరోవైపు.. చేతికి చిక్కిన పాకిస్తాన్‌ టెర్రరిస్టుల నుంచి నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు ‘రా’ ఏజెంట్‌ పల్లవి శర్మ, విహాన్‌ సింగ్‌. మొత్తానికి తమకు కావలసిన సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత సర్జికల్‌ స్ట్రయిక్‌కి ముహూర్తం నిర్ణయం అవుతుంది.  కేవలం గంటలో ఈ ఆపరేషన్‌ పూర్తి కావాలి. అయితే పాకిస్తాన్‌ స్థావరాలలో ఎవరెవరు ఉన్నారో తెలిస్తేనే కాని, వీరి దాడి త్వరగా పూర్తి చేయలేరు. ఏం చేయాలా అని ఆలోస్తుంటారు. ఆ సమయంలో ఒక కుర్రవాడు తయారుచేస్తున్న గరుడ డ్రోన్‌ (గరుడ పక్షి బొమ్మ లోపల డ్రోన్‌ కెమెరా ఉంచుతారు)ను చూస్తాడు భారత ఆఫీసర్‌. దాని సహాయంతో టెర్రరిస్టుల స్థావరాలను గమనిస్తూ, సమాచారం అందించుకుంటూ టెర్రరిస్టులను మట్టుపెట్టాలనుకుంటారు.

పథకం ప్రకారం అన్నీ సిద్ధం చేస్తారు. అర్ధరాత్రి వేళ పాకిస్తాన్‌ స్థావరాలకు చేరుకుని, పని పూర్తి చేసుకుని తెల్లారేలోగా వెనక్కు వచ్చేయాలని ప్రధాని ఆదేశం. అడుగడుగునా గరుడ డ్రోన్‌ సమాచారం అందిస్తూనే ఉంటుంది. పథకం ప్రకారం దాడి జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా గరుడ డ్రోన్‌ అకస్మాత్తుగా కింద పడిపోతుంది. ఎంత ప్రయత్నించినా కొద్దిగా కూడా కదలదు. ఇంతలో పాకిస్తానీ టెర్రరిస్టులకు చెందిన ఒక చిన్న కుర్రవాడు అక్కడకు వచ్చి, గరుడను చూసి బొమ్మ అనుకుని, చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తుంటాడు. ఆ పిల్లవాడు గరుడను ఏం చేస్తాడా అని భారత అధికారులు ఆందోళనగా చూస్తుంటారు. రిమోట్‌ ఒక్కసారిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గాలిలోకి ఎగురుతుంది. నిమిషాలలో సర్జికల్‌ స్ట్రయిక్‌ విజయవంతం అవుతుంది. ఈ దాడిలో ఆ గరుడను పట్టుకున్న కుర్రవాడు ఎదురుపడతాడు భారత సైనికులకు. ఆ బాలుడి పట్ల దయచూపి విడిచిపెడతాడు విహాన్‌సింగ్‌. తెలతెలవారుతున్నా వీరజవానులు ఇంకా వెనుకకు రాకపోవడంతో ప్రధానిలో ఆందోళన బయలుదేరుతుంది. ఇంతలోనే ‘ఆపరేషన్‌ సక్సెస్, మనవారంతా వెనక్కు వస్తున్నారు’ అనే సమాచారం అందుతుంది. 

సెర్బియాలో  ‘వాస్తవాధీన’ సన్నివేశాలు
పాకిస్తాన్‌పై భారతదేశం సర్జికల్‌ స్ట్రయిక్‌ జరిగిన సంవత్సరానికి.. సెప్టెంబరు 2017లో తాను ఈ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు ఆదిత్యధర్‌. ఆ పదకొండు రోజులు (సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 29 వరకు) ఏం జరిగిందనే అంశం ఆధారంగా కథను రూపొందించుకున్నారు. మేజర్‌ విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ పాత్రలో నటించడం కోసం విక్కీ కౌశల్‌ ఐదు మాసాల పాటు మిలిటరీ శిక్షణ తీసుకున్నారు. బరువు పెరిగారు. రోజుకి ఐదు గంటల పాటు శ్రమపడ్డారు. ముంబైలోని ‘కఫ్‌ పరేడ్‌’లో గన్‌ ట్రయినింగ్‌ కూడా తీసుకున్నారు. ముంబై నవీ నగర్‌లోనే నటులందరికీ  శిక్షణ ఇచ్చారు. ఆయుధాలు ఉపయోగించడం నేర్పారు. ‘వాస్తవ అధీన రేఖ’ సన్నివేశాలను సెర్బియాలో చిత్రీకరించారు. యామీ గౌతమ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారు. ఈ చిత్రంలో యుద్ధం, యాక్షన్, స్ట్రాటెజీ అన్నీ ఉన్నాయి. నరేంద్రమోడి, అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్, సుష్మాస్వరాజ్‌ పాత్రలను కూడా చూపారు దర్శకులు. 

సర్జికల్‌స్ట్రయిక్‌ అంటే?!
ఇదొక సైనిక దాడి. లక్ష్యాన్ని మాత్రమే ఛేదించి.. ప్రజలకు, చుట్టుపక్క ప్రదేశాలకు, వాహనాలకు, భవంతులకు ఏ మాత్రం హాని, విధ్వంసం జరగకుండా చేసేదే సర్జికల్‌ స్ట్రయిక్‌. 1976లో ఉగాండాలోని ఎంటెబ్బే మీద ఆ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసింది. 1981లో ఇజ్రాయిల్‌.. ఇరాక్‌ అణు రియాక్టర్‌ మీద  సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసింది. అఫ్గానిస్తాన్‌లోని అల్‌కాయిదా స్థావరాల మీద అమెరికా చాలాసార్లు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసింది. ఇక మన దేశం 2016 సెప్టెంబరు 18న ‘ఉడి’ ప్రాంతంలో పాకిస్థాన్‌ మీద సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసింది. 
– డా. పురాణపండ వైజయంతి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top