మనుషులా? దెయ్యాలా?

ullala ullala movie launch in hyderabad - Sakshi

ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన సత్యప్రకాష్‌ (‘పోలీస్‌ స్టోరీ’ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉల్లాలా.. ఉల్లాలా’. ఈ చిత్రంతో ఆయన తనయుడు, కన్నడ హీరో నటరాజ్‌ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. నూరిన్‌ షెరీఫ్, అంకిత మహారాణ, గురురాజ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. సుఖీభవ మూవీస్‌ పతాకంపై గురురాజ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటులు బెనర్జీ, అశోక్‌కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ తేజ క్లాప్‌ ఇచ్చారు.

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. గురురాజ్‌ మాట్లాడుతూ– ‘‘రక్షక భటుడు, ఆనందం, లవర్స్‌ డే’ సినిమాలు విడుదల చేశాను. వాటి తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉల్లాలా.. ఉల్లాలా’. సత్యప్రకాష్‌ చెప్పిన కాన్సెప్ట్‌ నచ్చింది. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయి. పాత్రలన్నీ వైవిధ్యంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు వెన్నెముక గురురాజ్‌గారు. మా సినిమాలో కనిపించే పాత్రలు నిజమైనవి కావు. వాళ్లు మనుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మనుషులు.

ఇంతకీ దెయ్యాలా? మనుషులా? అంటే ఎవరూ కారు. మా చిత్రంలో ఉన్నది లేదు, లేనిదే ఉన్నట్టు... ఒక వైవిధ్యమైన చిత్రమిది’’ అని సత్యప్రకాష్‌ అన్నారు. ‘‘మా నాన్న ఈ సినిమాకు దర్శకుడు అనే విషయం నాకు చాలా రోజుల వరకు తెలియదు. తీరా తెలిశాక నేను చేయగలనా? అని కాస్త సందేహించాను’’ అన్నారు నటరాజ్‌. అంకిత మహారాణ, నూరిన్‌ షెరీఫ్, సంగీత దర్శకుడు జాయ్, కెమెరామేన్‌ జె.జి.కృష్ణ తదితరులు మాట్లాడారు. పృథ్వీ, ‘అదుర్స్‌’ రఘు, లోబో, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top