అదే ఈ సినిమా మొదటి విజయం

Trivikram to launch Ranarangam's trailer - Sakshi

– త్రివిక్రమ్‌

‘‘సినిమా ట్రైలర్స్‌ చూసినప్పుడు మళ్లీ చూడాలని చాలా కొద్ది సార్లే అనిపిస్తుంది. ‘రణరంగం’ ట్రైలర్‌ చూడగానే అలా అనిపించింది’’ అని దర్శకుడు త్రివిక్రమ్‌ అన్నారు. శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’.  కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ కథానా యికలు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. కాకినాడలో ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేసిన త్రివిక్రమ్‌ మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు మా నాన్నగారి బలవంతం మీద ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను.

ఆ ఉద్యోగం రాకూడదని అప్పట్లో ప్రార్థనలు కూడా చేశా. మళ్లీ కాకినాడకు రావడం ఇదే. నాకు ఏ ఊరితో అయినా సినిమాలతో కూడిన జ్ఞాపకాలే గుర్తుంటాయి. తొలిసారి కాకినాడకు వచ్చినప్పుడు ‘ఆదిత్య 369’ సినిమా చూశాను. శ్రీనాథ్‌అనే వ్యక్తి ద్వారా శర్వానంద్‌ ఎప్పట్నుంచో తెలుసు. ‘ప్రస్థానం’ సినిమాలో మంచి క్యారెక్టర్‌ చేశాడు. ‘రణరంగం’ సినిమాలో 40ఏళ్ల కుర్రాడిలా శర్వా బాగా నటించాడు. లేట్‌ ట్వంటీస్‌లో ఉన్న కుర్రాడు మిడ్‌ 40 ఏజ్‌ ఉన్న పాత్రను బాగా చేయడమే ఈ సినిమా మొదటి విజయంగా భావిస్తున్నాను.

ఈ సినిమాలో 1980లో జరిగే కథ కొంత, ఇప్పటి కాలానికి చెందిన కథ కొంత ఉంటుందన్నారు. చాలా కేర్‌ తీసుకుని బ్యాలెన్డ్స్‌గా తీశారనిపిస్తోంది. కల్యాణి చెప్పినట్లు సుధీర్‌ లవ్‌స్టోరీస్‌ కూడా తీయొచ్చు. సినిమా విజయం సాధించాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్‌. నేను సినిమాల్లోకి రావడానికి క్యారెక్టర్ల కోసం ప్రయత్నించే సమయంలో త్రివిక్రమ్‌గారిని కలుస్తుండేవాణ్ణి. అప్పుడు ఆయన దర్శకుడు కాలేదు. పెద్ద రైటర్‌. 

ఓ సందర్భంలో ఆయన, నేను కలిసి కారులో వెళ్తున్నప్పుడు ‘ఏదైనా సినిమాల్లో క్యారెక్టర్‌ ఇవ్వండి సార్‌’ అన్నాను. ‘నీతో చేస్తే కచ్చితంగా హీరోగానే చేస్తా. క్యారెక్టర్‌ అయితే ఎప్పటికీ ఇవ్వను’ అన్నారు. అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో... ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. మా ట్రైలర్‌ ఆడియన్స్‌కు నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. ఫస్ట్‌ డే ఎంత ఎనర్జీతో ఉన్నాడో లాస్ట్‌ డే కూడా అంతే ఎనర్జీతో వర్క్‌ చేశాడు శర్వా. ఏం మాట్లాడాలనుకుంటున్నానో ట్రైలర్‌తో చెప్పాం. ఏం చూపించాలనుకుంటున్నామో సినిమాలో చూపిస్తాం.

మాకు సహకరించిన టీమ్‌ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు సుధీర్‌ వర్మ. ‘‘కాకినాడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. త్రివిక్రమ్‌గారికి నేను అభిమానిని. శర్వా మంచి కో స్టార్‌. సుధీర్‌గారి గత సినిమాలు గమనిస్తే గన్స్, బ్లడ్‌లతో కొన్ని వయలెన్స్‌ అంశాలు ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత క్యూట్‌ లవ్‌ స్టోరీస్‌ కూడా ఆయన తీయగలరని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. నాకు గన్‌ పట్టుకోవడం నేర్పించారు. కెమెరామెన్‌ దివాకర్‌ అందమైన విజువల్స్‌ అందించారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కల్యాణీ  ప్రియదర్శన్‌. ఈ కార్యక్రమంలో నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, నటులు అజయ్, రాజా, సంగీత దర్శకుడు కార్తీక్,  రచయితలు కృష్ణచైతన్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top