నటి జ్యోతికపై ఉపాధ్యాయుల సంఘం ఫిర్యాదు

Teachers Association Complaint on Jyothika in Tamil nadu - Sakshi

చెన్నై ,పెరంబూరు: నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రాక్షసి. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ చిత్రంలో ఉపాధ్యాయులు పిల్లలకు సరిగా పాఠాలు బోధించకుండా కథల పుస్తకాలు చదుకుంటున్నట్లు, సెల్‌ఫోన్లతో కాలం గడపడం వంటి సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా విద్యార్థులు సిగరెట్లు తాగడం, గొడవలు పడడం లాంటి సన్నివేశాలు పొందుపరిచారు.

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే అధిక వేతనాలు తీసుకుంటున్నారని, అయినా విద్యార్థులపై సరిగా దృష్టి పెట్టకపోవడం వల్లే వారు వైద్య విద్య లాంటి ఉన్నత చదువులు చదవలేకపోతున్నారనే సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కాగా రాక్షసి చిత్రంలోని ఇలాంటి సన్ని వేశాలు నిజాయితీగా పని చేసే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కించపరచేవిగా ఉన్నాయన్న విమర్శలు తలెత్తాయి. దీంతో తమిళనాడు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీకే.ఇళమారన్‌ ఇటీవల చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో రాక్షసి చిత్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అందులో నటి జ్యోతిక నటించిన రాక్షసి చిత్రంలో ఉపాధ్యాయుల వల్లే దేశం నాశనం అవుతోందన్నట్లు సంభాషణలు, సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. ఇది ఉపాధ్యాయులందరినీ కించపరచే చర్యగా పేర్కొన్నారు. కాబట్టి రాక్షసి చిత్రంపై నిషేధం విధించాలని, నటి జ్యోతిక, చిత్ర యూనిట్‌పై చర్యలు చేపట్టాలని కోరారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top