
నాగు గవర, సెహర్, వసంత్ సమీర్, శ్రీనివాసరావు
‘వీకెండ్ లవ్’ సినిమా ఫేమ్ నాగు గవర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వసంత్ సమీర్, సెహర్ జంటగా, శ్రీహర్ష, రవివర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు దేవి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకుడు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘జర్నలిస్ట్ వినాయకరావుగారి ద్వారా నాగు పరిచయమయ్యాడు.
తను మంచి∙క్రైమ్ సబ్జెక్ట్ చెప్పాడు. ‘బిచ్చగాడు, డి16’ తరహాలోనే విభిన్నమైన చిత్రమిది’’ అన్నారు. ‘‘వీకెండ్ లవ్’ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకుని, వినాయకరావుగారి ద్వారా ఈ సినిమా చేస్తున్నా. ఇదొక సమకాలీన క్రైమ్ కథ. రియలిస్టిక్, గ్రిప్పింగ్ కథనంతో ఉంటుంది. ఈ నెల 14న చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు నాగు గవర. కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేష్, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దుర్గా కిషోర్ బొయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్.