
ఆయన అంటే చాలా ఇష్టం
శ్రీదివ్య, జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన పెన్సిల్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో శుక్రవారం తెరపైకి వచ్చింది. మరో వారంలోనే అంటే...
నటుడు సూర్య అంటే చాలా ఇష్టం అంటున్నారు నటి శ్రీదివ్య. ఈమెను విజయాలకు చిరునామాగా పేర్కొనవచ్చు. వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం నుంచి ఈ మధ్య విడుదలైన ఈటీ వరకూ వరుసగా సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న శ్రీదివ్య అచ్చ తెలుగు అమ్మాయి అన్న విషయం తెలిసిందే.ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లోనూ గెలుపు గుర్రం అనే చెప్పవచ్చు. అయితే తమిళంలో కాస్త ఎక్కువ అని చెప్పక తప్పదు.
శ్రీదివ్య, జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన పెన్సిల్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో శుక్రవారం తెరపైకి వచ్చింది. మరో వారంలోనే అంటే ఈ నెల 20న విశాల్‌తో రొమాన్స్ చేసిన మరుదు చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. కార్తీతో జత కలిసి నటిస్తున్న కాష్మోరా చిత్రం నిర్మాణంలో ఉంది. ఇటీవల మరుదు చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదివ్యతో చిన్న చిట్ చాట్..
ప్ర: తమిళంలో వరుస విజయాలను సాధించడం గురించి?
జ: చాలా సంతోషంగా ఉంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. నా పాత్రలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
ప్ర: మరుదు చిత్రంలో విశాల్‌తో తొలిసారిగా నటించిన అనుభవం గురించి?
జ: విశాల్ చాలా స్వీట్ పర్సన్. కో ఆర్టిస్ట్‌గా నాకు చాలా సహకారం అందించారు.ఆయన చాలా హార్డ్ వర్కర్. అవన్ ఇవన్ చిత్రంలో ఒక సన్నివేశంలో విశాల్ నవరసాలు పండించారు. ఆ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు వస్తుందని ఆశించాను. అలా జరగక పోవడం చాలా బాధ అనిపించింది. ఇక మరుదు చిత్రంలో చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను.
ప్ర: మరుదు చిత్రంలో మీ పాత్ర గురించి?
జ: ఈ చిత్రంలో గ్రామీణ యువతిగా నటించాను. విశాల్‌కు ప్రేయసిగా,ఆ తరువాత అర్ధాంగిగా రెండు కోణాల్లో నా పాత్ర సాగుతుంది. భాగ్యలక్ష్మి అనే ఆ పాత్ర చాలా బోల్డ్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ సాఫ్ట్ పాత్రలు చేసిన నేను ఇందులో తొలిసారిగా అదరగొట్టే పాత్రను పోషించాను. మరుదు చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ మదురై స్లాంగ్ చాలా కష్టం అనిపించడంతో చెప్పలేకపోయాను. అయితే ఇదే చిత్రం తెలుగు రీమేక్‌లో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను.
ప్ర: కాష్మోరా చిత్రం గురించి?
జ: కాష్మోరా చిత్రంలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతానికి ఆ చిత్రం గురించి ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. అయితే కార్తీతో నటించడం మంచి అనుభవం.
ప్ర: కాష్మోరా చిత్రంలో నయనతారతో కలిసి నటించారా?
జ: ఇప్పటి వరకూ అలాంటి సన్నివేశం రాలేదు.చిత్ర షూటింగ్ ఇంకా జరుగుతోంది. నయనతారతో కలిసి నటించే సన్నివేశాలు ఉంటాయో ఉండవో తెలియదు.
ప్ర:మీకు ఇష్టం అయిన హీరో?
జ: ఇష్టం అయిన హీరో సూర్య. ఆయన నటించి చిల్లన్ను ఒక కాదల్ చూసినప్పుడే ఆయనంటే ఇష్టం ఏర్పడింది.
ప్ర: ఇటీవల తమిళనాడులో వరద బాధితులకు సాయం అందించారు. మరుదు చిత్రం షూటింగ్ సమయంలో రాజపాలెయం ప్రాంత ప్రజలకు టాయిలెట్స్ కట్టించడానికి సాయం చేశారు. కోట్ల పారితోషికాలు తీసుకుంటున్న హీరోయిన్లకు కూడా లేని మానవతాగుణం మీలో ఉండడానికి స్ఫూర్తి?
జ: స్ఫూర్తి కాదు గానీ, రాజపాలెయంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ గ్రామ ప్రజలు ఎంతగానో సహకరించారు. అయితే అక్కడ మారుమూల ప్రాంతాల్లో టాయిలెట్లు లేక పోవడంతో వాటిని ఏర్పాటు చేయడానికి సాయం చేయాలనిపించింది. అయితే నీ నిర్ణయానికి అమ్మ వెన్నుదన్నుగా నిలిచారు.
ప్ర:మీ గ్లామర్ రహస్యం?
జ: రహస్యం అంటూ ఏమీ లేదు. బాగా తింటాను. అలాగే వర్కౌట్ చేస్తాను.నేను శాఖాకారిని.