బాషా... త్రీజీ బాషా... నేనూ ఆటోవాణ్ణే!

‘బాషా’... రజనీకాంత్! మరి, ‘త్రీజీ బాషా’ ఎవరు? ‘త్రీజీ’ అంటే... ‘థర్డ్ జనరేషన్’. ఇన్‌సెట్ ఫొటోలో... బుల్లి ఆటోలో ఏముందోనని తీక్షణంగా చూస్తున్న బుల్లి బాబే త్రీజీ బాషా! రజనీకాంత్ మనవడు. పేరు... వేద్. రజనీ రెండో కుమార్తె సౌందర్యా రజనీకాంత్ కుమారుడు. ఈ బుడతడు బాషా ఏంటనుకుంటున్నారా? ‘బాషా’లో రజనీకాంత్ ఏం చేశారు? కొన్ని సన్నివేశాల్లో ఆటో నడుపుతూ కనిపించారు. ఇప్పుడు వేద్ కూడా ఆటో నడుపుతున్నారు.
అయితే... వేద్‌ది బుల్లి ఆటో! బుల్లి బాబు కదా మరి! ‘నాన్ ఆటో కారన్.. ఆటో కారన్ (‘బాషా’లో నేను ఆటోవాణ్ణి... ఆటోవాణ్ణి పాట గుర్తుండే ఉంటుంది)! జస్ట్ లైక్ తాత’’ అని సౌందర్యా రజనీకాంత్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆటోలతో ఆడు కుంటున్న వేద్ పెదై్దన తర్వాత తాతయ్యలా హీరో అయ్యి, సినిమాల్లో ఆటో నడుపుతాడేమో? ‘బాషా... త్రీజీ బాషా... నేనూ ఆటోవాణ్ణే’ అని డైలాగులు చెబుతాడేమో!
పుట్టినరోజున పార్టీ అనౌన్స్‌మెంట్?
డిసెంబర్ 12... రజనీకాంత్ పుట్టినరోజు. అదే రోజున రజనీ తన రాజకీయ ప్రణాళికలు, స్థాపించబోయే పార్టీ, ఇతర అంశాల గురించి అభిమానుల సమక్షంలో ప్రకటిస్తారని చెన్నైలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా రజనీ పుట్టినరోజుకి ముందు ఇటువంటి ప్రచారాలు రావడం సాధారణమే. అయితే... ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత నెలకొన్న దృష్ట్యా ఈ ప్రచారానికి ప్రాముఖ్యత లభిస్తోంది. రజనీ ఏమంటారో మరి? వెయిట్ అండ్ సీ!!