
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నంది అవార్డుల జాబితా అంత ఇదీగా లేదని, అవార్డుల జ్యూరీలో సీనియర్ నటుడు గిరిబాబు ఉన్నా.. ఎందుకలా జరిగిందో తెలియడం లేదని ఆయన అన్నారు. నంది అవార్డుల విషయంలో 'సాక్షి' టీవీతో ఆయన మాట్లాడారు. 'లౌక్యం' సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడు అవార్డు తనకు వస్తుందని అనుకున్నామని, కానీ రాలేదని అన్నారు.
'అవార్డు అందుకునే స్థాయి ఇంకా నీకు రాలేదురా అని అన్నారేమో కమిటీ వాళ్లు అని సరిపెట్టుకున్నాన'ని చెప్పారు. ఏ సంవత్సరం అవార్డులు ఆ సంవత్సరం ఇస్తే ఆ సినిమా సత్తా ఏంటో తెలుస్తుందని, గ్యాప్ ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. కొని తెచ్చుకున్న అవార్డులు బయటకు వెళ్లినప్పుడు వెక్కిరిస్తాయని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో అన్నట్టు గుర్తుచేశారు. మీ యాక్టింగ్ బాగుంటుంది, మాకు నచ్చింది.. అవార్డులది ఏముందని ప్రేక్షకులు తనతో అంటూ ఉంటారని, మంచి నటులకు ఎందుకు అవార్డులు రావడం లేదన్న భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.