తెర వెనుక హీరోల మద్దతు కోసం అభ్యర్ధుల పాట్లు
24 వేల మంది సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు యత్నాలు
సినీ తారలతో ప్రచారం చేయాలని ప్రణాళికలు
జూబ్లీహిల్స్‌లో కార్మికుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికుల ఓట్లను పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు మూడు పార్టీల అభ్యర్థులు అందుకు తగిన ప్రచారంతో, హామీలతో ముందుకు వస్తున్నారు. పదుల సంఖ్యలో ఉండే సినీ తారలు, దర్శక నిర్మాతలు, సినీ రచయితలు, కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు, ప్రముఖ నటీ నటులు ఈ నియోజక వర్గంలో లేకపోయినా తెర వెనుక పనిచేసే 24 వేల మంది సినీ కార్మికులు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉంటూ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
నియోజక వర్గ పరిధిలోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట తదితర డివిజన్ల పరిధిలో లైట్‌బాయ్‌లు, జూనియర్ ఆర్టిస్ట్లు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ సభ్యులు, డ్రైవర్లు ఇలా సినీ షూటింగ్‌లకు పనిచేసే కారి్మకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినా అక్కడున్న రాజకీయాలు, అవినీతి అక్రమాలు స్వార్థపూరిత నాయకత్వంతో వేలాది మంది కారి్మకులకు ఇళ్లు దక్కలేదు. అంతేకాదు వీరికి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారినా సినీ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవితాలు మారుస్తామని నేతలు హామీ ఇవ్వడమే తప్ప ఏ ఒక్కరు చొరవ చూపింది లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి ఆయా పార్టీల అభ్యర్ధులకు సినీ కార్మికులు గుర్తుకు వస్తున్నారు.
పరిశ్రమతో ముగ్గురికీ అనుబంధం..
సినీ పరిశ్రమతో బీఆర్‌ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఆయన రవన్న, పాతబస్తీ అనే రెండు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొదటి నుంచి సినీ వర్గాలతో మంచి సంబంధాలు నెలకొల్పారు. కారి్మక సంఘాలతోనూ అనుబంధం ఉంది. అంతే కాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సినీకార్మికులులతో సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కార్మికుల మద్దతు పొందేందుకు బీఆర్‌ఎస్ తగిన వ్యూహాలు రచిస్తోంది.
⇒ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు గత నాలుగు దశాబ్ధాలుగా సినీ కార్మిమక సంఘాలతోనూ, వర్కర్స్‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్‌కు పలుమార్లు సార్లు సలహాదారుగా పని చేశారు. ఆయన తనయుడు వెంకట్ హీరోగా సినిమాలు కూడా నిర్మించారు. సినీ హీరో సుమన్, ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో సినీ కార్మికుల మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
⇒ బీజేపీ అభ్యర్ధి లంకల్ దీపక్‌రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటమే కాకుండా కారి్మక నాయకులతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. సినీ కార్మికుల మద్దతును కూడగట్టేందుకు ఆయన తన పాత పరిచయాలను వినియోగించుకుంటున్నారు.
⇒ గత మూడు నాలుగు రోజులుగా ఆయా పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలంటూ సినీ కార్మికులతో పాటు వారి నాయకులను కూడా అభ్యర్థిస్తున్నారు. సినీ తారలతో సినీ కార్మికులు ఉండే ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమకు చెందిన ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారితో ప్రచారం నిర్వహించాలని కూడా భావిస్తున్నారు.. మొత్తానికి మొట్ట మొదటిసారిగా సినీ కారి్మకుల మద్దతు కూడగట్టేందుకు వారిని ఆకట్టుకునేందుకు , బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
⇒ ఆ దిశగా ప్రచారం కూడా చేయాలని వారి సమస్యలను పరిష్కరిస్తామని, హామీ ఇవ్వాలని కూడా వీరు పేర్కొంటున్నారు. నియోజక వర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో సినీ కారి్మకులు ఉంండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అభ్యర్థులు, ఆ ఆప్రాంతాల్లో తమకు స్నేహితులైన హీరోలతో ప్రచారం చేయించనున్నారు. సుమారుగా 24 వేల మంది సినీ కార్మికులు ఉన్న ఈ నియోజక వర్గంలో నవంబర్ 11న మెజార్టీ కారి్మకులు ఎవరి వైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వీరికి ఇళ్లు దక్కకపోగా భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, ప్రత్యేక తెలంగాణ రావడం జరిగిపోయింది. ఇప్పుడు కారి్మకులంతా ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది.


