తమ్ముళ్లు... చెల్లెళ్లు వస్తున్నారోచ్‌

Sakshi Special Story About Film Industry

చిత్ర పరిశ్రమలో హీరోలకు వారసులుగా వారి తనయులు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ.. ఇప్పటి తరంలో చిరంజీవి, నాగార్జున.. ఇలా చాలామంది హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు... భవిష్యత్‌లోనూ ఇస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్న కొందరి తమ్ముళ్లు, హీరోయిన్ల తమ్ముళ్లు  హీరోలుగా పరిచయం కానున్నారు. మరికొందరు ఆల్రెడీ వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం...

‘అర్జున్‌రెడ్డి’ (2017) బంపర్‌ హిట్‌తో టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరో అయ్యారు విజయ్‌ దేవరకొండ. ఆ తర్వాత ‘గీత గోవిందం’ (2018), ‘టాక్సీవాలా’ (2018) వంటి చిత్రాల హిట్స్‌తో విజయ్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. ఈ క్రేజీ హీరో ఓవర్‌నైట్‌ స్టార్‌ కాలేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చి హీరో అయ్యారు.. ఆ తర్వాత స్టార్‌ హీరో అయ్యారు. తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండకి ఓ విజిటింగ్‌ కార్డ్‌ అయ్యారు. ‘దొరసాని’ (2019) చిత్రంతో ఆనంద్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం వినోద్, దామోదర అట్టాడ అనే కొత్త దర్శకులు తెరకెక్కిస్తోన్న రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు ఆనంద్‌ దేవరకొండ.

విజయ్‌ దేవరకొండ– ఆనంద్‌ దేవరకొండ

దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్‌ కూడా హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన కథలు వింటున్నారు.


రానా– అభిరామ్‌

బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు సాయి గణేశ్‌ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి పవన్‌ సాధినేని దర్శకత్వం వహిస్తారు.

సాయి శ్రీనివాస్‌– సాయి గణేశ్‌

హీరో సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ చిత్రంలో ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ఓ ప్రధాన పాత్ర పోషించారు.

సాయిధరమ్‌ తేజ్‌– వైష్ణవ్‌ తేజ్‌

మరోవైపు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తమ్ముడు అమ్రాన్‌ ప్రీత్‌సింగ్‌ హీరోగా తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా’(2020) అనే సినిమా తెరకెక్కుతోంది. దాసరి లారెన్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నితేష్‌ రాయ్‌ దర్శకత్వం వహించనున్న ‘రామ్‌ రాజ్య’ అనే హిందీ చిత్రంలోనూ అమ్రాన్‌ హీరోగా నటించనున్నారు.

రకుల్‌ ప్రీత్‌సింగ్, అమ్రాన్‌

హీరోయిన్‌ మెహరీన్‌ తమ్ముడు గుర్ఫతే సింగ్‌ ‘గిల్టీ’ అనే వెబ్‌ సిరీస్‌లో ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేశారు. తొలుత క్రికెటర్‌ కావాలనుకున్నారట గుర్ఫతే. అయితే ఆ తర్వాత యాక్టింగ్‌ను కెరీర్‌గా మార్చుకుని ఓ మ్యూజిక్‌ వీడియో చేశారు. ఆ మ్యూజిక్‌ వీడియో బీటౌన్‌లో కాస్త పాపులర్‌ కావడంతో ‘గిల్టీ’లో గుర్ఫతేకి చాన్స్‌ దక్కింది. త్వరలో బాలీవుడ్‌లో కూడా గుర్ఫతే లీడ్‌గా ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

మెహరీన్‌–గుర్ఫతే సింగ్‌

జీవితా రాజశేఖర్‌ కుమార్తెలు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక ఇప్పుడు ‘విధి విలాసం’ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్‌ అదిత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దుర్గా నరేష్‌ గుట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ‘2స్టేట్స్‌’ తెలుగు రీమేక్‌తో హీరోయిన్‌గా శివాని ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. తాజాగా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు శివానీ రాజశేఖర్‌. ఇందులో తేజ సజ్జా హీరో. తమిళంలో కూడా తన ఎంట్రీని ఖరారు చేసుకున్నారు శివానీ రాజశేఖర్‌. ఇందులో విష్ణు విశాల్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకటేష్‌ దర్శకుడు.

శివాని–శివాత్మిక

దివంగత నటుడు శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్‌ ‘రాజ్‌దూత్‌’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మేఘాంశ్‌ బ్రదర్‌ శశాంక్‌ తనకు దర్శకత్వంలో ఆసక్తి ఉందని ఓ సందర్భంలో చెప్పారు. ఇంకా అల్లు అర్జున్‌–అల్లు శిరీష్, మంచువిష్ణు, మంచు మనోజ్‌– మంచు లక్ష్మీ, నాగచైతన్య– అఖిల్,  వరుణ్‌తేజ్‌ – నిహారిక కొణిదెల.. ఇలా ఇండస్ట్రీలో ఆల్రెడీ కొందరు బ్రదర్స్, బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ కాంబినేషన్స్‌ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అందాలతార, ప్రముఖ దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్‌ కూడా సినిమాల్లోకి వచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

ఖుషీ కపూర్‌-జాన్వీ కపూర్‌

హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ చెల్లెలు ఇసాబెల్లా కైఫ్‌ కూడా ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నారు. సల్మాన్‌ బావమరిది ఆయుష్‌ శర్మ హీరోగా నటించిన ‘లవ్‌యాత్రి’ సినిమాతో ఇసాబెల్లా కైఫ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

ఇసబెల్లా కైఫ్‌-కత్రినా కైఫ్‌

బాలీవుడ్‌ నటుడు నీల్‌నితిన్‌ ముఖేష్‌ తమ్ముడు నామన్‌ నీల్‌నితిన్‌ ‘బైపాస్‌ రోడ్‌’ అనే చిత్రంతో  డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాడు. ఈ చిత్రంలో నీల్‌నితిన్‌ ముఖేష్‌ హీరోగా నటించాడు.నటి సుష్మితాసేన్‌ తమ్ముడు రాజీవ్‌ సేన్‌ బాలీవుడ్‌లో ‘ఇటీ: కేన్‌ యు సాల్వ్‌ యువర్‌ ఓన్‌ మర్డర్‌?’ అనే సినిమాతో హీరోగా పరిచయం కానున్నారు. హీరోయిన్‌ కృతీసనన్‌ సిస్టర్‌ నుపూర్‌ సనన్‌ కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది. కృతీసనన్, నుపూర్‌ సనన్‌లు కలిసి గతంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top