అవును.. ఉంది!

Sakshi special interview with heroine varalaxmi

వరలక్ష్మి

అవును ఉంది. అసమానత ఉంది. వేధింపు ఉంది. సాధింపు ఉంది. దోపిడీ ఉంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ కూడా ఉంది. అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. నిర్భయంగా బయటికొచ్చి మాట్లాడితేనే.. వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటివాళ్లు అదే చేస్తున్నారు. తప్పు చెయ్యడానికీ.. తప్పుడు ఆలోచనలు చెయ్యడానికీ భయపడేలా.. ఆత్మగౌరవం ప్రదర్శిస్తున్నారు. ‘ఇది మంచి పరిణామం..’ అంటున్నారు శరత్‌కుమార్‌ కూతురు వరలక్ష్మి. ఈ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ తమిళ స్టార్‌.. ‘సాక్షి’తో చాలా బోల్డ్‌గా.. పర్సనల్‌ విషయాలు షేర్‌ చేసుకున్నారు. చదవండి. ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

ఈ ఏడాది సుమారు ఆరు సినిమాల్లో కనిపించారు. ఎలా మ్యానేజ్‌ చేస్తున్నారు?
రిలీజ్‌ సంగతి నిర్మాతలు చూసుకుంటారు. మనం మ్యానేజ్‌ చేసేది ఏం ఉండదు. నాకు నచ్చిన సినిమాల్లో కనిపిస్తున్నాను. ఒకే ఏడాది ఇన్ని సినిమాల్లో భాగమైనందుకు హ్యాపీగా ఉన్నాను.

హీరోయిన్‌ అంటే సన్నగా, నాజూకుగా ఉండాలనేది ఇప్పటి ట్రెండ్‌. మీరు కొంచెం బొద్దుగా, టామ్‌బాయ్‌లా ఉంటారు. తగ్గాలని అనుకున్నారా?
నేను హీరోయిన్‌ క్యాటగిరీలోనే ఉండాలనుకోను (నవ్వుతూ). అలాగే హీరోయిన్స్‌ అంటే సన్నగానే ఉండాలి అనే విషయాన్ని కూడా నమ్మను. ఒకప్పుడు బొద్దుగా ఉన్న హీరోయిన్సే సౌత్‌లో టాప్‌గా నిలిచారు. ఆ తర్వాతి తరంలో విద్యాబాలన్, అనుష్క బ్రిలియంట్‌ యాక్టర్స్‌. ముందు మనందరం బాడీ షేమింగ్‌ ఆపేయాలి. నువ్వు సన్నగా ఉండాలి, బరువు తగ్గాలి అని నాకెవరైనా సలహా ఇస్తే ‘నువ్వేమైనా నా బరువు మోస్తున్నావా?’ అన్నట్టుగా సమాధానం ఇస్తాను. నేనేం తింటే నీకేంటి? అన్నట్లుగా మాట్లాడతాను. ఆరోగ్యంగా ఉన్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం.

ఒకవేళ ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ మిమ్మల్ని బరువు తగ్గాలని డిమాండ్‌ చేస్తే?
తగ్గుతా. సినిమా కోసం చేయడం వేరు. ‘మాస్టర్‌ పీస్‌’ అనే మలయాళ సినిమాలో పోలీసాఫీసర్‌ పాత్ర చేశాను. పోలీస్‌ యూనిఫామ్‌ అంటే ఫిట్‌గా ఉండాలి. దర్శకుడు అడిగారని కాదు.. నాకే అనిపించి తగ్గాను. తమిళ సినిమా ‘తారై తప్పటై్ట’ కోసం దర్శకుడు బాలా సార్‌ నన్ను బరువు పెరగమన్నారు. ఎందుకంటే అందులో నేను కరకాట్టమ్‌ డ్యాన్సర్‌గా చేయాలి. వాళ్లు లావుగా ఉంటారు. ఆ క్యారెక్టర్‌కి బరువు పెరగడం అవసరం అనిపించింది, పెరిగాను. యాక్చువల్లీ ‘బాడీ షేమింగ్‌’ అనేది మనం తీసుకొచ్చింది.

ఎవరు ఎలా ఉండాలో మ్యాగజీన్స్, సోషల్‌ మీడియా నిర్ణయిస్తున్నట్టుంది. హీరోయిన్‌ ఎలా ఉండాలి? అనేది కూడా బయటివాళ్లే డిసైడ్‌ చేసేస్తారు. మ్యాగజీన్‌లో చూపించినట్టుగా ఏ హీరోయిన్‌ కూడా నిద్ర లేచినప్పుడు ఫ్రెష్‌గా ఉండదు. అందరిలానే పొద్దునే చెదిరిన జుట్టుతో నిద్రకళ్లతో ఉంటారు (నవ్వుతూ). ఎవరైనా హీరోయిన్‌లా ఉండాలని ఎందుకనుకోవాలి? మీరు మీలా ఉండండి. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటే అదే అందం. ఎవరైనా అందంగా ఉంటే అభినందించండి. కానీ వేరే వాళ్లను కూడా వాళ్లలా ఉండమని పోలికలు పెట్టి, వాళ్ల కాన్ఫిడెన్స్‌ తగ్గించకండి.

ఇలా ఏది అనుకుంటే అది చెప్పేస్తారు కాబట్టే ఏడాది క్రితమే ‘మీటూ’ లాంటి ఇష్యూ గురించి మాట్లాడారు. కానీ అప్పుడు చాలామంది బయటకు రాలేదు. ఎందుకు?
భయం అయ్యుండొచ్చు.

మీకెందుకు భయం లేదంటారు? మీ వెనక మీ నాన్న (నటుడు శరత్‌కుమార్‌) ఉన్నారనే ధైర్యమా?
బ్యాగ్రౌండ్‌ ఉపయోగించుకోకుండా సొంతంగా నిలబడాలనుకునే స్వభావం నాది. నేనేదైనా చేయాలనుకున్నప్పుడు నాన్నగారికి చెప్పను. అన్నీ చేసేసిన తర్వాత ఆయనకు తెలుస్తుంది (నవ్వుతూ). అరే.. ఇలా చేస్తున్నా అని నాకు చెప్పలేదే అంటుంటారు. నేను ఇండిపెండెంట్‌ పర్సన్‌ని. భయం లేదు. పరిస్థితులను ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలుసు. ఒకవేళ చిక్కుకున్నా అందులో నుంచి ఎలా బయటకు రావాలో కూడా తెలుసు.

స్టార్‌ కిడ్స్‌ లైంగిక వేధింపులకు గురవ్వరని అనుకుంటుంటారు. అదెంత వరకూ నిజం?
అస్సలు కాదు. నా విషయంలో జరిగింది కదా. ఓ టీవీ చానల్‌కి సంబంధించిన వ్యక్తి అందరి మధ్యలో నాతో బాగా మాట్లాడి, ఆ తర్వాత ‘మిగతా విషయాలు మనం బయట మాట్లాడుకుందాం’ అన్నాడు. ‘మిగతా విషయాలు’ అనే మాటలో చాలా అర్థం ఉంది. నేను స్టార్‌ కిడ్‌నే కదా. అయినా నాతో ‘కాంప్రమైజ్‌’ గురించి మాట్లాడాడంటే.. ఇంకెంత మంది దగ్గర ఇలా అడిగి ఉంటాడు? ఆ కోపంతోనే  ఆ విషయం గురించి బయటకు వచ్చి మాట్లాడాను.

మీరు స్త్రీవాది అనిపిస్తోంది. అయితే ఫెమినిజమ్‌ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటివారికి ఫెమినిజమ్‌ అంటే ఏంటి? అనేది చెబుతారా?
స్త్రీలకు సమానత్వం ఇవ్వడం లేదు అనే దాంట్లో నుంచి పుట్టిందే ఫెమినిజం. మగవాళ్లలో కూడా చాలామంది ఫెమినిస్ట్‌లు ఉన్నారు. ఎందుకంటే వాళ్లు స్త్రీలను గౌరవిస్తారు కాబట్టి. దక్కాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నవాళ్లను స్త్రీవాది అంటాం. మగవాళ్ల మీద లేనిపోని నిందలు వేయడం స్త్రీవాదం కాదు. సమానత్వం వచ్చే వరకూ ఫెమినిజం అనేది ఉంటుంది.

హీరోయిన్, విలన్, స్పెషల్‌ రోల్స్‌.. ఇలా అన్నీ చేస్తున్నారు. ఒక సెట్‌ నుంచి మరో సినిమా సెట్‌కు వెళ్లేప్పుడు ఆ మూడ్‌ వేరియేషన్స్‌ ఎలా చూపించగలుగుతున్నారు?
మీరు ఐటీ జాబ్‌ చేస్తున్నారు అనుకుందాం. రోజూ ఒకే మూడ్‌తో ఆఫీస్‌కు వెళ్లరు కదా. అయినా రోజూ చేసే పనిని పర్ఫెక్ట్‌గా చేయాలి. మా పని కూడా అంతే. సెట్‌ నుంచి సెట్‌కి మారుతుంటే కథ, పాత్ర, కాస్ట్యూమ్స్‌ మారొచ్చు కానీ అదే యాక్టింగ్‌. దర్శకుడు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోగలిగితే మన పని సులువు అయిపోతుంది.

(ఇటీవల రిలీజైన్‌ ‘సర్కార్‌’ , ‘పందెం కోడి–2’,చిత్రాల్లో... , రిలీజ్‌కు రెడీ అయిన ‘మారి–2’లో.. )

ఇంత బోల్డ్‌గా, ముక్కుసూటిగా ఉండే స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది?  మీ అమ్మగారా? నాన్నగారి దగ్గర్నుంచా?
మా అమ్మ. ఆమే నా ధైర్యం. ఆవిడలో సగం ధైర్యవంతురాలిగా ఉన్నా కూడా నేను చాలా లక్కీ అనే అనుకుంటాను. నన్ను, నా చెల్లిని ఎలాంటి సపోర్ట్‌ లేకుండా తనొక్కతే పెంచింది. స్ట్రాంగ్‌ ఉమెన్‌. నా బలం ఆమె దగ్గర నుంచి వచ్చింది.

అమ్మ ఎప్పుడైనా వేధింపులకు గురయ్యారా? అవి షేర్‌ చేసుకుని, మీకు ధైర్యం నూరిపోశారా?
వేధింపులకు గురి కాలేదు. కానీ ఒకసారి ఎవరో దొంగతనానికి వస్తే ఒక్కతే అతన్ని ఎదుర్కొంది. ఫట్‌ఫట్‌మని చెంప దెబ్బలు ఇచ్చిందట. నిజం కోసం మా అమ్మగారు బలంగా నిలబడతారు. తన దగ్గరనుంచే నాకీ ధైర్యం వచ్చింది అనుకుంటాను.

ఓకే.. యాక్టర్‌గా ఇంత బిజీలోనూ స్త్రీ సంక్షేమ కార్యక్రమాలతో యాక్టీవ్‌గా ఉంటారు. సమయాన్ని  ఎలా కేటాయిస్తారు?
‘సేవ్‌ శక్తి’ అనే క్యాంపెయిన్‌ నడుపుతున్నాను. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఎక్కువగా మా అమ్మగారు చూసుకుంటారు. గృహ హింసకు గురైనవారిని, లైంగిక వేధింపులకు గురైనవారిని కాపాడుతుంటాం. దానికి ఫండ్స్‌ రైజ్‌ చేస్తూ ఉంటాను నేను.

ఒక స్త్రీ ఏదైనా చేదు అనుభవం ఎదుర్కొన్నప్పుడు ఆ విషయాన్ని బయటికి చెబితే ఆమెనే తప్పుబడుతూ కొందరు నిందిస్తారు. దీని గురించి ఏమంటారు?
ఇది నేను చాలా చోట్ల చూశాను. అతను అలా హద్దులు మీరడానికి నువ్వే చాన్స్‌ ఇచ్చి ఉంటావనే అర్థంతో మాట్లాడతారు. కావాలని ఏ స్త్రీ అయినా చేదు అనుభవం కోరుకుంటుందా? ఆమెను నిందించి, నోరు నొక్కేయాలనుకోవడం సరి కాదు. నిందిస్తున్నారని భయపడి సైలెంట్‌ అయిపోవడమూ కరెక్ట్‌ కాదు. ఎవరేమన్నా నిర్భయంగా ఉండాలి.. పోరాడాలి.

రచయిత వైరముత్తుని కొందరు నిర్భయంగా ఆరోపిస్తున్నారు. అసలు వైరముత్తు నిజంగా అలాంటి మనిషే అనుకుంటున్నారా?
మన అభిప్రాయాలతో పని లేదు. రచయితగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేస్తున్న పనిలో కానీ ఆయన స్థాయిని కానీ ఎవ్వరం ప్రశ్నించడం లేదు. పర్సనల్‌ లైఫ్‌ గురించే ప్రశ్న. సెలిబ్రిటీ అయినంత మాత్రాన మంచి వ్యక్తి అయ్యుంటారని అనుకోలేం. అలాగే కామన్‌ మ్యాన్, పేదవాళ్లు అయినంత మాత్రాన చెడు వ్యక్తులు అనలేం. మనుషులు ఎలా అయినా ఉండచ్చు. చిన్మయి, మరికొందరు ఆరోపించినట్టుగా అందులో నిజం ఉంటే కచ్చితంగా యాక్షన్‌ తీసుకోవాల్సిందే. ‘మీటూ’ ఉద్యమం ప్రధమ లక్ష్యం ‘నేమ్‌ దెమ్‌.. షేమ్‌ దెమ్‌’ (పేరు బయటకు చెప్పి పరువు తీయడం). అప్పుడు భయం వస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటారా?
డెఫినెట్‌గా ఉంది. పాత తరం వాళ్లు కొందరు లొంగిపోవడం వల్లో, సినిమాల్లో ఇది భాగమేమో అనుకోవడంవల్లో, ఇలాంటి విషయాలు బయటకు చెప్పకూడదేమో అని భావించడం వల్లో క్యాస్టింగ్‌ కౌచ్‌ కంటిన్యూ అయిందేమో.

సినిమాల విషయానికి వద్దాం. దివంగత నటి, తమిళ నాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లో చేస్తున్నారట?
ఇంకా ఏదీ కన్‌ఫర్మ్‌ కాలేదు. అమ్మ రోల్‌ చేయాలని నాకూ ఉంది. ఆమె నా రోల్‌ మోడల్‌.

భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానన్నారు. పాలిటిక్స్‌ని డీల్‌ చేయడం సులువు కాదేమో?
సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందిని డీల్‌ చేయాలి కదా. అలాగని నేను ఆగిపోలేదు. వచ్చాను, మార్చాను. రాజకీయాల్లోనూ అంతే.

రాజకీయ నాయకురాలిగా మారి ఎటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారు?  
నా ముఖ్యోద్దేశం స్త్రీల హక్కుల కోసం నిలబడటమే. 50 శాతం ఓటు బ్యాంక్‌ స్త్రీలే అని గుర్తించరెందుకో అర్థం కాదు. ఒకవేళ స్త్రీ అనుకుంటే తన ఇంట్లో ఓట్లన్నీ తనకు కావాల్సిన వాళ్లకు వేయించగలదు. లేదంటే అన్నం పెట్టదు (నవ్వుతూ). వేరే రకం వాళ్లు కూడా ఉన్నారు. మా ఆయన ఎవరికి ఓటు వేస్తే నేనూ వాళ్లకే ఓటు వేయాలి అనుకునేవారు. అవన్నీ మారాలి. అలాంటి మార్పు తీసుకురావాలి అనుకుంటున్నాను. ప్రతి స్కూల్‌లో గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ తెలుసుకోవడానికి సెక్స్‌ ఎడ్యుకేషన్‌ క్లాస్‌ తప్పనిసరిగా ఉండేలా చేస్తాను. పీటీ (ఫిజికల్‌ ట్రైనింగ్‌) క్లాస్‌ బదులు సెల్ఫ్‌ డిఫెన్స్‌ క్లాస్‌ ఏర్పాటు చేస్తాను.

ఇటీవల విశాల్‌తో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇలానే అన్నారు. ఈ సిమిలర్‌ ఐడియాలజీనే మిమ్మల్ని ఫ్రెండ్స్‌ని చేసిందా?
మావల్ల ఏదో ఓ మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవాళ్లం. సొసైటీ మీద బాధ్యత ఉన్నవాళ్లం. దారి ఏదైనా ఇద్దరి ఆలోచనా తీరు ఒక్కటే. మా ఫ్రెండ్‌షిప్‌ ఇంత బలంగా ఉండటానికి అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.

వీ అండ్‌ వీ (విశాల్, వరలక్ష్మీ) రియల్‌ లైఫ్‌లో మంచి పెయిర్‌ అవుతుందని కోలీవుడ్‌లో టాక్‌ ఉంది?
ఫ్రెండ్స్‌గా మేం మంచి జోడీ. మా మధ్యలో ఎటువంటి రొమాన్స్‌ లేదు. అయితే ఏదో ఉందని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్‌గా ఉన్నారంటే  వాళ్ల మధ్య ఉన్నది రొమాన్సే.. ఇంకేం కాదు అని నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ ధోరణి కూడా మారాలి. మేం డేటింగ్‌ చేసుకోవడంలేదు. ఫ్రెండ్స్‌గా చాలా హ్యాపీగా ఉన్నాం.  

ఒకసారి నటీనటుల సంఘం ఎలక్షన్స్‌ అప్పుడు మీ ఫాదర్‌ శరత్‌కుమార్, మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ విశాల్‌ మధ్య పోటీ జరిగితే ఇబ్బందిపడ్డారా?
అప్పుడు ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాను. మా నాన్నగారికే నేను సపోర్ట్‌ చేస్తున్నానని. విశాల్‌ ఎప్పటికీ బెస్ట్‌ ఫ్రెండే.  కానీ నేను మా నాన్నగారినే సపోర్ట్‌ చేస్తాను.

ఒకవేళ మీ ఫాదర్‌ సైడ్‌ తప్పు... మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ది కరెక్ట్‌ అయితే అప్పుడు ఎవరివైపు నిలబడతారు?
మా నాన్నగారు చేస్తుంది ఏదైనా తప్పు అనిపిస్తే ఆయనతో ధైర్యంగా చెప్పగలను. చాలా సార్లు చెప్పాను కూడా. తప్పును నిర్మొహమాటంగా నిలదీయాలని నేర్చుకున్నాను. నా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పు చేసినవాళ్లను బహిరంగంగా విమర్శించిన విషయం మీకు తెలుస్తుంది.

నాన్నగారితో ఏదైనా ధైర్యంగా చెబుతానన్నారు. మరి.. ఆయన ఇంకో పెళ్లి (నటి రాధిక) చేసుకున్నారని ఎప్పుడైనా ఆగ్రహం వ్యక్తం చేశారా?
కోపాన్ని మనసులోనే దాచుకునే టైప్‌ కాదు. అప్పుడే కోప్పడ్డాను. ఇద్దరు కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవడం ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. కానీ అప్పట్లో చాలా తక్కువ. భార్య, భర్త ఆనందంగా ఉండలేనప్పుడు విడిపోవడమే నయం. కలిసి ఉండి కొట్టుకుంటుంటే అది పిల్లల్ని కష్టపెడుతుంది. మా అమ్మానాన్న విడివిడిగా ఉంటూ బెటర్‌ పేరెంట్స్‌ అయ్యారు. ఏది జరిగినా మంచికే అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అప్పుడు అలా జరగబట్టే ఈ రోజు నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నానని అనుకుంటున్నాను.

మీ లైఫ్‌ పార్ట్‌నర్‌లో ఎలాంటి లక్షణాలు ఆశిస్తున్నారు?
ఇంకా పుట్టలేదేమో (నవ్వుతూ). నచ్చే క్వాలిటీస్‌ అంటే.. తనని తాను సెక్యూర్డ్‌గా ఉంచుకోగలిగేవాడు. నా ఎదుగుదలను చూసి ఫీల్‌ అయ్యేవాడు నాకొద్దు.

పెళ్లి ఎప్పుడు?
పెళ్లి నా యాంబిషన్‌ కాదు. స్టేట్‌కి సీఎం అవ్వడం నా లక్ష్యం.

మ్యారేజ్‌కి మీరు వ్యతిరేకమా?
వ్యతిరేకం అని కాదు.  పెళ్లి అనేది కచ్చితంగా చేసుకొని తీరాలి అని కాదు. ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీస్‌తో నా గ్రోత్‌ని చూసి భయపడకుండా, పెళ్ళి తర్వాత ఇంట్లో కూర్చో అని అనకుండా ఉంటే పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత భర్త జాబ్‌ మానేయమంటే మనం ఎందుకు మానేయాలి?

– డి.జి. భవాని

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top