పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది | Saaho new song Enni Soni song launch | Sakshi
Sakshi News home page

పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది

Aug 3 2019 12:46 AM | Updated on Aug 3 2019 12:46 AM

Saaho new song Enni Soni song launch - Sakshi

సుజిత్‌, కృష్ణకాంత్‌

‘‘ఇలాంటి భారీ సినిమాకి అవకాశం రావడం గ్రేట్‌. పాటల్లోని పదాలు సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి. కమర్షియాల్టీ కోసం పాట రాయలేదు. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని పాటల రచయిత కృష్ణకాంత్‌ అన్నారు.

‘ఏ చోట నువ్వున్నా.. ఊపిరిలా నేనుంటా, వెంటాడే ఏకాంతం.. లేనట్టే నీకింక, వెన్నంటే నీవుంటే.. నాకేమైనా బావుంటా, దూరాల దారుల్లో.. నీ వెంట నేనుంటా....’ అంటూ బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌తో యూరప్‌లోని అందమైన మంచుకొండల్లో ఆడిపాడారు ప్రభాస్‌. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా గురు రాంధ్వా స్వరాలు సమకూర్చిన ‘ఏచోట నువ్వున్నా...’ అనే పూర్తి నిడివిగల వీడియో పాటను హైదరాబాద్‌లో విడుదల చేసి, ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుజిత్‌ మాట్లాడారు...

► నా తొలి సినిమా ‘రన్‌ రాజా రన్‌’ వచ్చి గురువారంతో ఐదేళ్లు అయింది. నా రెండో సినిమా ‘సాహో’. తొలి, ద్వితీయ సినిమాకి చాలా టైమ్‌ పట్టింది. ఈ సమయంలో వేరే సినిమా చేసి ఉండొచ్చు కదా? అని అడుగుతున్నారు. భవిష్యత్‌ అనేది మన చేతుల్లో ఉండదు. ప్రభాస్‌గారు కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తి. ఆయనంటే చాలా ఇష్టం. అందుకే ఇన్ని రోజులు వేచి చూశానేమో. ఇన్నేళ్ల నిరీక్షణలో నేను చాలా నేర్చుకున్నా. ఒక్క ‘సాహో’కే పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది.

► ‘బాహుబలి’కంటే ముందే ‘సాహో’ కథ చెప్పాను. అయితే ‘బాహుబలి’ విడుదల తర్వాత ప్రభాస్‌గారి స్టార్‌డమ్, మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ కథలో మార్పులు చేయలేదు. యాక్షన్‌ సీక్వెన్స్‌ మరింత బెటర్‌గా ఉండేలా చూసుకున్నా. ‘బాహుబలి’ని దాటాలనుకోలేదు. దాని ప్రభావం నాపై లేదు. మా సినిమాని ‘బాహుబలి’తో పోల్చకూడదు.

► నా రెండో సినిమానే ప్రభాస్‌గారితో చేయడం సంతోషం. ఆయనతో పని చేస్తున్నప్పుడు ఓ స్టార్‌ హీరోతో చేస్తున్నాననే భావన కలగలేదు. అంత సరదాగా షూటింగ్‌ జరిగింది. ఈ నెల 15న సినిమా విడుదల చేయాల్సి ఉంది. అయితే హైస్టాండర్డ్‌ వీఎఫ్‌ఎక్స్‌ వల్ల ఆలస్యమైంది. వినాయక చవితి పండగ సమయంలో ఈ 30న సినిమాని రిలీజ్‌ చేస్తున్నాం.

► ఫారిన్‌లో షూటింగ్‌ పర్మిషన్స్‌ కోసం కొంచెం ఎక్కువ సమయం పట్టింది. అయితే చిత్రీకరణ సాఫీగా సాగింది. షూటింగ్‌ ఆలస్యం అయిందని అందరూ అంటున్నారు. బడ్జెట్‌ తగ్గించాలనుకుని ముందుగానే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేశాం. అందుకే కొంచెం ఆలస్యం అయింది. షూటింగ్‌ స్టార్ట్‌ చేశాక ఎక్కడా ఆలస్యం కాలేదు. ‘బాహుబలి 2’ చిత్రంతోపాటు ‘సాహో’ టీజర్‌ రిలీజ్‌ చేశాం. అయితే అప్పటికి షూటింగ్‌ కూడా మొదలు పెట్టలేదు. ఆ తర్వాతే మొదలైంది.

► ‘సాహో’లో లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. మూడు నాలుగు పాటలుంటాయి. అవి కథను ఎక్కడా డిస్టర్బ్‌ చేయవు. ముందుగా ఒకే సంగీత దర్శకుడితోనే పాటలన్నీ చేయించాలనుకున్నాం. అయితే ఒక్కో పాటకు ఒక్కరు చేయాల్సి వచ్చింది.. దానివల్ల బెస్ట్‌ వర్క్‌ వచ్చింది. నేపథ్యసంగీతం ఇద్దరు ముగ్గురు చేస్తే బాగుండదు కానీ, ఒక్కో పాటను ఒక్కరు చేయడం వల్ల నష్టం ఏమీ లేదు.

► ‘బాహుబలి’ తర్వాత ఇమేజ్‌కి తగ్గ సినిమా చేయాలని ప్రభాస్‌గారు కానీ, నేను కానీ అనుకోలేదు.   యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనో, బాలీవుడ్‌ సినిమాతో మ్యాచ్‌ చేయాలనో తీయలేదు. ప్రేక్షకులకు కొత్తగా ఏం చూపిద్దాం అనుకుని స్టార్ట్‌ చేశాం. మేం అనుకున్న దాన్ని రీచ్‌ అయ్యాం. దర్శకులు రాజమౌళి, శంకర్‌గార్లతో నన్ను పోల్చకూడదు. శంకర్‌గారి సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. ‘సాహో’ సినిమాలో ఆయన రేంజ్‌లో ఓ పాట ఉండేలా ట్రే చేశా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement