నేను చస్తే మోసేవాళ్లు ఉండరేమో: నటుడు

ముంబై: యువ తరం నటులపై బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేన్సర్‌తో కన్నుమూసిన వినోద్ ఖన్నా అంత్యక్రియలకు ఈ తరం నటులు హాజరుకాకపోవడాన్ని సిగ్గుమాలిన చర్యగా ఆయన వర్ణించారు. సీనియర్ నటుడు చనిపోతే పరామర్శించే తీరిక లేదా అని ప్రశ్నించారు.
‘ఈ తరానికి చెందిన ఒక్క నటుడు కూడా వినోద్ ఖన్నా అంత్యక్రియలకు హాజరుకాకపోవడం అవమానకరం. ఆయనతో కలిసి నటించినవారు కూడా రాకపోవడం దారుణం. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. నేను చచ్చిపోయినా నన్ను మోస్తారన్న గ్యారంటీ లేదు. ఈ తరం సోకాల్ట్ స్టార్స్‌పై నాకు చాలా కోపం వస్తోంది. మొన్న ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి చెమ్చా గ్యాంగ్ అంతా వెళ్లారు. కానీ ఖన్నా అంత్యక్రియలకు మాత్రం రాలేదు. ఏదో కొద్ది మంది మాత్రమే వచ్చార’ని రిషి కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రం జరిగిన వినోద్ ఖన్నా అంత్యక్రియలకు రిషీ కపూర్ కుటుంబం కూడా హాజరుకాలేదు. విదేశాల్లో ఉండడం వల్ల తాము రాలేకపోయామని ఆయన చెప్పారు. అంత్యక్రియలకు రావాలనుకున్నానని అయితే కుటుంబ సభ్యులకే పరిమితం చేస్తారని తనకు సమాచారం అందడంతో వెనక్కితగ్గినట్టు వెల్లడించారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణదీర్ కపూర్, జాకీష్రాఫ్, అర్జున్ రాంపాల్, కబీర్ బేడి తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
సంబంధిత వార్తలు