అబ్బాయిలు.. అమ్మాయిలు కనెక్ట్‌ అవుతారు – రాజ్‌ తరుణ్‌

Raj Tarun Interview about Rangula Ratnam Movie - Sakshi

‘‘అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ ‘రంగులరాట్నం’. లవ్‌ స్టోరీతో పాటు చిన్న చిన్న ఎమోషన్స్‌ ఉన్నాయి. మదర్‌ సెంటిమెంట్‌ బాగా వర్కవుట్‌ అయ్యింది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అని హీరో రాజ్‌తరుణ్‌ అన్నారు. రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా జంటగా శ్రీ రంజని దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ‘రంగులరాట్నం’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్‌  పంచుకున్న విశేషాలు.
     
► అన్నపూర్ణ వంటి పెద్ద బ్యానర్‌లో ‘ఉయ్యాల జంపాల’ తర్వాత రెండో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను తప్ప ఈ చిత్రంలో నటించిన వారందరూ దాదాపు కొత్తవారే. అయినా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.

► ఈ చిత్రంలో నాది ఓ మధ్యతరగతి అబ్బాయి పాత్ర. బాధ్యతలు తక్కువగా ఉంటాయి. నా లుక్‌ ఈ సినిమాలో సహజంగా ఉంటుంది. అందరిలా సరదాగా కనిపిస్తాను. అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈ సినిమా ఎక్కడో ఒక చోట కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. ఆ పాయింట్‌ నచ్చి ఈ సినిమా చేశా.

► జీవితం రంగులరాట్నంలా తిరుగుతుంటుంది. మా సినిమాలో హీరో జీవితం కూడా అంతే. కథకు తగ్గ టైటిల్‌ అని ‘రంగులరాట్నం’ అని పెట్టాం. సినిమా చూశా. చాలా బాగుంది. చూస్తున్నంతసేపు హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. మా సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా.

► శ్రీ రంజనిగారు సెల్వరాఘవన్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. లేడీ డైరెక్టర్‌ అయినా అబ్బాయి మనస్తత్వం బాగా అర్థం చేసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. తనకు కావాల్సింది బాగా రాబట్టుకున్నారు.  

► ప్రతి ఏడాది సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. మా సినిమా వేరే చిత్రాలకు పోటీ అనుకోను. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా మాది. సెన్సార్‌ పూర్తి కాగానే విడుదల తేదీ ప్రకటిస్తాం.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top