మూలన మిగిలిపోయిన తెలుగు సినిమా మూల పురుషుడు

రఘుపతి వెంకయ్యనాయుడు


  సందర్భం  రఘుపతి వెంకయ్యనాయుడు జయంతి

 రఘుపతి వెంకయ్యనాయుడు 1869 అక్టోబరు 15న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించెను. 1941 జూలై 1న పరమపదించెను. ఏదో పాఠం చదివినట్టుగా... చరిత్ర అంటే ఇదేనా? జనన, మరణాల చిట్టాయేనా? ఆ వ్యక్తి తాలూకు దృక్కోణాన్ని, సాహసాన్ని, కాలంలోకి తొంగి చూసే ఒడుపుని, దూరదృష్టిని ఒడిసిపట్టుకోనవసరం లేదా? పాఠాలు నేర్చుకోనవసరం లేదా? కనీసం జయంతి, వర్థంతిని కూడా చిత్ర పరిశ్రమ స్మరించుకోని పరిస్థితి రఘుపతి వెంకయ్యది. తెలుగు సినిమా మూల పురుషునికి ఇదేనా మనమిచ్చే నివాళి?

   

 అసలు రఘుపతి వెంకయ్యను ఎందుకు స్మరించుకోవాలి? ఈ జనరేషన్‌కి ఎంతమందికి తెలుసు ఆయన? వాళ్లకు తెలుసుకునే ఆసక్తి ఉండొచ్చూ ఉండకపోవచ్చును. కానీ తెలియజెప్పాల్సిన అవసరం మాత్రం సినీ పరిశ్రమకు ఉంది. వెంకయ్య ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్. బందరు నుంచి వెళ్లి మద్రాసులో ఫొటో స్టూడియో పెట్టాడు. ఫొటో తీస్తే అతనే తీయాలన్నంత పేరు తెచ్చుకున్నాడు. గుర్రపు బగ్గీలో తిరిగేంత సంపాదించుకున్నాడు.ప్రయోగశీల మనస్తత్వం... వ్యాపార దక్షత... సాహసిక లక్షణం... ఈ మూడూ వెంకయ్యలో పుష్కలం. అవే వెంకయ్యను సినిమా ఫీల్డ్‌లోకి ఎంటర్ చేశాయి.

 

 ‘క్రోనో మెగాఫోన్’ గురించి పేపర్లో వార్త చదివాడు.

 దాని విలువ 40 వేలు. అంత డబ్బు తన దగ్గర లేదు. ఫొటో స్టూడియో తాకట్టు పెట్టి మరీ కొన్నాడు దాన్ని.  ఫస్ట్ ప్రదర్శన హిట్. రెండో ప్రదర్శన సూపర్‌హిట్.కాలికి క్రోనో మెగాఫోన్ కట్టుకుని దేశమంతా తిరిగాడు. సరిహద్దులు కూడా దాటాడు.అప్పట్లో డేరాలు కట్టి సినిమాలు ఆడే పద్ధతి. ఛత్... ఇది కాదు పద్ధతి అనుకున్నాడు వెంకయ్య. మద్రాసులో ఫస్ట్ పర్మినెంట్ థియేటర్ ‘గెయిటీ’ (1913) వెలిసింది. ఆ మరుసటి ఏడాదే ‘క్రౌన్’ థియేటర్... ఆ వెంటనే ‘గ్లోబ్’ థియేటర్.

 

 ఇవన్నీ కాదు. వెంకయ్య అసలు స్టెప్... కొడుకు ఆర్.ఎస్. ప్రకాశ్‌ను ఫారిన్ పంపడం. కేవలం సినిమా టెక్నిక్ నేర్చుకోవడం కోసం.     ఆ రోజుల్లో ఫారిన్ పంపడమే ఎక్కువనుకుంటే, భవిష్యత్తు ఉంటుందో, లేదో తెలియని సినిమా టెక్నిక్ నేర్చుకోవడానికంటే ఎంత రిస్కో ఓసారి ఊహించుకోండి. కొడుకు ఫారిన్ నుంచి రాగానే లక్ష రూపాయలు ఖర్చుపెట్టి ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ అంటూ గ్లాస్ స్టూడియో కట్టాడు వెంకయ్య. వరుసపెట్టి కొడుకు డెరైక్షన్‌లో మూకీలు తీశాడు.

 

 ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు. దివాళా తీసేదాకా వచ్చింది పరిస్థితి. ఆయన తగ్గాడు కానీ, ఆయన సంకల్పం మాత్రం వటవృక్షమైంది. సినిమా మీద ఆయన ప్రేమ, నమ్మకం అన్నీ ఫలించాయి. ఆ ఫలాల్నే ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్నాం. అదండీ... క్లుప్తంగా వెంకయ్య కథ.

   

 రఘుపతి వెంకయ్య... మన తొలి ఎగ్జిబిటర్! మన తొలి నిర్మాత! మన తొలి స్టూడియో అధినేత! మన తెలుగు సినిమాకు దారి చూపిన దీపస్తంభం! ఇంత ఇచ్చిన ఆయనకు మనమేం చేశాం?

 

 అబ్బో... చాలా చేశాం.

 ఫిలిమ్‌నగర్ సెంటర్లో దుమ్ము కొట్టుకుపోయిన శిలా విగ్రహం ఆయనదే కదూ! అయినా... దీని కోసం ఎన్నాళ్లు కష్టపడాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని బతిమాలుకుంటే నాలుగేళ్ల క్రితం అలా విసిరిపారేసిన వరం అది. ఇక దాంతోనే మనం సంతృప్తి పడాలి. అప్పుడెప్పుడో బంజారాహిల్స్... కేన్సర్ హాస్పటల్ చౌరస్తాలో వెంకయ్య కాంస్య విగ్రహమన్నారు. అతీగతీ లేదు.

   

 ప్రముఖ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు, ఎంతో పోరాడితే - రఘుపతి వెంకయ్య నాయుడు పేర ఓ అవార్డు వెలిసింది. 1981 నుంచి హేమాహేమీలకు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన పరిస్థితిలో, ఇకపై ఈ పురస్కారం భవిష్యత్తు ఏంటో మరి!?

   

 వెంకయ్య ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు పోయారో ఎక్కడా కరెక్ట్ డేటా లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో తరహా. పుట్టింది అక్టోబర్ 15నే కానీ, ఇయర్ మాత్రం 1869 అని, 1873 అని చెబుతుంటారు. మరణం కూడా అంతే. కొందరేమో 1941 జూలై 1 అంటారు, ఇంకొందరు 1941 మార్చి 15 అని చెబుతారు. మరికొందరు 1943 అంటారు. ఇంతకూ ఏది కరెక్టో? అసలు మన తెలుగు సినిమా పితామహుడు గురించి ఇంతవరకూ ఓ మోనోగ్రాఫ్ లేకపోవడం దారుణం. వెంకయ్య నాయుడు గురించి పరిశోధన చేయించి, చరిత్ర రాయించాలని ఆరుద్రలాంటి వాళ్లు కూడా వాపోయినా, పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా నిర్మాతల మండలో, వాణిజ్య మండలో పూనుకుని చేస్తే బాగుంటుంది.

   

 రఘుపతి వెంకయ్య నాయుడు, ఆయన కొడుకు ఆర్.ఎస్. ప్రకాశ్ తర్వాత ఆ కుటుంబం నుంచి ఇంకెవరూ సినిమా ఫీల్డ్‌కొచ్చినట్టు లేదు. ఒకవేళ వచ్చినా రాణించలేదా? అసలు వీళ్ల వారసులెక్కడున్నారు? ఎవ్వరికీ తెలీదు. కనీసం తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో కూడా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

   

 చీకట్లో చిరుదీపం లాగా... రఘుపతి వెంకయ్య నాయుడిపై ఓ సినిమా తయారైంది. సీనియర్ ‘నరేశ్’ వెంకయ్య పాత్ర చేశారు. ‘నల్లపూసలు’ ఫేమ్ బాబ్జీ డెరైక్టర్. మండవ సతీశ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ. ఇప్పుడున్న ట్రెండ్‌లో వెంకయ్యను ఎవరు పట్టించుకుంటారు చెప్మా?

 

 ల్యాబ్‌లో... సారీ... హార్డ్‌డిస్క్‌లో ఈ సినిమా ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వం రాయితీ ఇవ్వడమో, పరిశ్రమ ఏదొక రీతిలో సాయం చేయడమో చేస్తే తప్ప, ఈ సినిమా బయటకు రాదు. ఆ ప్రయత్నమైనా చేస్తే, రఘుపతి వెంకయ్యకు ఓ మంచి నివాళి అవుతుంది.

 

 ముక్తాయింపు: ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ సినిమా చూసి ఇంప్రెస్ అయిన దాసరి నారాయణరావు, ఈ సినిమాను తానే సొంతంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజంగా... గుడ్ న్యూసే!

 - పులగం

 చిన్నారాయణ
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top