పవర్‌ గర్ల్‌

priyanka chopra special story after marriage - Sakshi

ప్రేమ ముందు ఎవరెస్టు శిఖరం కూడా చిన్న రాళ్ల గుట్టలా అనిపిస్తుంది. ప్రేమ మహిమ అది. అలాగని ప్రియాంకా చోప్రా ప్రేమలో మునిగిపోయి తన కెరీర్‌లోని భవబంధాలనేమీ తెంచుకో లేదు. పెళ్లి వల్ల వచ్చిన కొత్త పవర్‌తో.. పాత విధుల్లోకి ఉత్సాహంగా పునఃప్రవేశం చేయబోతున్నారు.

పెళ్లి తప్ప జీవితంలో ఇంకేం లేనట్లు.. కాబోయే భర్త (ఇప్పుడయ్యిందిలెండి) భుజం మీద చెయ్యేసి నోరంతా తెరిచి ఇలా నవ్వుతోందేమిటీ పిచ్చిపిల్ల.. ఆరేడు నెలలుగా! న్యూయార్క్‌ వెళుతోంది. ముంబై వస్తుంది.

మళ్లీ న్యూయార్క్, మళ్లీ ముంబై. అస్సలు ఎక్కడా సింగిల్‌గా కనిపించలేదు. నిక్‌ ఆమెకు ఒక బాడీ పార్ట్‌గా ఉన్నాడే కానీ, బాయ్‌ ఫ్రెండ్‌గా లేడు. అంతలా ప్రియాంక అతడిని అంటిపెట్టుకునే ఉంది. నిక్‌ కూడా ఆమె వెంట తిరుగుతున్నాడు కానీ.. ఆ తిరగడంలో పెద్దగా ఫీల్‌ కనిపించడం లేదు. సరే, అది అతడి స్వభావం. ప్రియాంకైనా చిన్నపిల్లైపోయి నిక్‌పై అందర్లో అలా వాలిపోవాలా? పోనివ్వండి. అది పర్సనల్‌. ఇప్పుడు అభిమానుల కన్సర్న్‌ ఏంటంటే.. పెళ్లైపోయింది కదా.. లాస్ట్‌ సాటర్‌డే.. ఇకనైనా ప్రియాంక కుదురుగా ఉంటుందా? అని.

ఆమె చేయవలసిన చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయి. అసలు నిక్‌ సమక్షంలో గడపడం కోసమే ఆమె సల్మాన్‌ చిత్రం ‘భరత్‌’ సినిమా కాంట్రాక్ట్‌ను సగంలో రద్దు చేసుకుని వెళ్లిపోయింది. అలాంటివే కొన్ని చిన్నచిన్న ఒప్పందాలు క్యాన్సిల్‌ అయ్యాయి. ప్రేమ మహిమ కావచ్చు. ప్రేమ ముందు ఎవరెస్టు శిఖరం కూడా చిన్న రాళ్ల గుట్టగా కనిపిస్తుంది కదా. అయితే మనం అనుకుంటున్నట్లేమీ తన కెరీర్‌తో, సేవాకార్యక్రమాలతో భవబంధాలనేమీ తెంచుకోలేదు.

ప్రియాంక బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌. హాలీవుడ్‌లో ఇండియన్‌ సూపర్‌ స్టార్‌. అంత స్టార్‌డమ్‌ను కూడా ఆమె పక్కన పెట్టేసి కామన్‌ గర్ల్‌ అయిపోయింది. నిక్కే (నిక్‌ యే) ఆమె లోకం అయిపోయాడు. మంచి విషయమే. అయితే ప్రియాంక గురించి మనం మర్చిపోకూడనివి మంచి విషయాలు కొన్ని ఉన్నాయి. పెళ్లే జీవితంలా ఆమె ప్రస్తుతానికి కనిపించవచ్చు. మునుపటి ప్రియాంక ఆమెలోంచి ఎక్కడికీ పోలేదు. వారం క్రితం (పెళ్లయ్యాకే) ‘టైమ్స్‌’ ప్రతినిధి మొహువా దాస్‌కు ముంబై జుహు హోటల్‌లో కొంచెం టైమ్‌ ఇచ్చారు ప్రియాంక.

కొత్త పెళ్లి కూతురులోని పాత ఉద్యమ నాయికను మొహువా బయటికి తీసుకొచ్చారు. కష్టపడినందుకే గుర్తింపు ‘‘వెళ్తానని నాకు తెలియదు. వెళ్లాలని నేను అనుకోలేదు. ప్రతి పనిలోనూ కష్టపడతాను. నన్నెవరో గుర్తుంచుకోవాలని, పెద్ద పేరు తెచ్చుకోవాలనీ దేశాలను పట్టుకుని వెళ్లలేదు. అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. ఏదైనా ఊరికే వచ్చేయదు. మనం ఇక్కడ కష్టపడుతుంటామా.. ఎక్కడో గుర్తింపు వస్తుంది’’ అంటున్న ప్రియాంక.. ప్రస్తుతం తన ప్రాజెక్టులన్నిట్లో తిరిగి నిమగ్నమయ్యే పనిలో ఉన్నారు.                  

 1
ప్రియాక దశాబ్దకాలంగా ‘యునిసెఫ్‌’తో కలిసి బాలికల హక్కులు, బాలల రక్షణపై పని చేస్తున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్‌ వెళ్లి అక్కడ ఘోర పరిస్థితుల్లో బ్రతుకును ఈడుస్తున్న రొహింగ్యా పిల్లల్ని కలిశారు.

పర్సు తియ్యక్కర్లేదు
‘‘పిల్లలు పిల్లలే. భవిష్యత్తు పిల్లల్దే. పిల్లల భవిష్యత్తే ప్రపంచ భవిష్యత్తు. దేశాల మధ్య ఏమైనా ఉండనివ్వండి. పిల్లల్ని సరిగా ఉంచాలి. సరిగా పెంచాలి. మంచి చదువు. మంచి ఆహారం. శుభ్రమైన జీవితం. వాళ్లను కనుక నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యంగానే పెరిగి పెద్దవారౌతారు. కోరుకున్నది పొందలేకపోతే ప్రపంచంపై కోపం, కసి, పగ పెంచుకుంటారు. హింసావాదులుగా, ఉగ్రవాదులుగా అవుతారు. అందుకే మనం విశాలంగా ఆలోచించాలి. వివక్షను మత దురాభిమానాలను పక్కనపెట్టి పిల్లలకు ప్రేమను అందించాలి. వాళ్లకు వసతులు, సదుపాయాలు కల్పించాలి. ఇందుకోసం మన పర్సు ఖాళీ చేసుకోనక్కర్లేదు. మన జీవితంలోంచి పరోపకారం కోసం ఏడాది కాలాన్ని త్యాగం చెయ్యనక్కర్లేదు. ఎవరికి వారు ఎక్కడికక్కడ సామాజిక బాధ్యతను నెరవేర్చగలిగితే చాలు. పిల్లలు హాయిగా బతికేస్తారు. చక్కటి పౌరులుగా ఎదుగుతారు.’’ అని చెప్తారు ప్రియాంక.

2

మన దేశంలో బాలికల పరిస్థితి, బాలల హక్కులు ఎలా ఉన్నాయన్న దానిపైన కూడా యూనిసెఫ్‌ ప్రతినిధిగా నిశిత పరిశీలనే చేశారు ప్రియాంక. ఇండియాను ‘డిఫరెంట్‌ బీస్ట్‌’ అంటా రు ఆవిడ. అంటే పూర్తి భిన్నమైన దేశం అని.
పరాయి సొత్తా! ఇదేం మాట?
‘‘చూడండి ఎంత పెద్ద జనాభానో. మన ఆలోచనలు కూడా సనాతనంగా ఉంటాయి. ఐదు వేల ఏళ్ల నాగరికత. అప్పట్నుంచీ ఒకటే మాట వింటున్నాం.. ‘లడ్కీ పరాయా ధన్‌ హోతీ హై’ అని. ఆడపిల్ల పరాయి వాళ్ల సొత్తా! ఇదేం మాట? ఆమె జీవితం ఆమెది కాదా?! ఇంటిని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. మరి తనను తాను చూసుకోడానికి ఇంకా ఎన్ని యుగాలు ఆగాలి? ఇంటినీ, పిల్లల్ని చూసుకోవడం తప్పని కాదు. తనకూ కొన్ని ఆశలు, కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే అవకాశాన్ని ఈ సమాజం కల్పించాలి కదా. ప్రభుత్వాలు బాలికల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. మనం వెనక్కు లాగకుండా ఉండాలి’’.. అంటారు ప్రియాంక.

3
‘మీటూ’ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రియాంక ముక్కుసూటిగానే ఉన్నారు. ‘మీటూ’ అంటూ తనుశ్రీ దత్తా బయటికి వచ్చినప్పుడు మొదట ఆమెను సపోర్ట్‌ చేసింది ప్రియాంకే. తర్వాత ఒకరిద్దరు ఆమెను ఫాలో అయ్యారు. అక్కడితో బాలీవుడ్‌ మీటూ ఆగిపోయినట్లయింది! ఎందుకని బాలీవుడ్‌ స్టార్‌లు నోరెత్తడం లేదు?
మహిళంటే మహిళే
‘‘నిజమే. కానీ మనం బాలీవుడ్‌ దగ్గరే ఎందుకు ఆగిపోతున్నాం. ఒక్క బాలీవుడ్‌లోనే వేధింపులు ఉన్నాయా? తక్కిన ఇండస్ట్రీలలో వేధింపులకు గురవుతున్న మహిళ తరఫున అక్కడి వాళ్లూ బయటికి రావడం లేదేం? మహిⶠంటే మహిళే. బాలీవుడ్‌ మహిళ, మీడియా మహిళా, ఐటీ మహిళ అని కాదు. అన్ని రంగాల్లోని మహిళలు, మహిళలకు మద్ధతుగా పురుషులు బయటికి రావలసిన అవసరం ఉంది’’ అని ప్రియాంక ఉద్దేశం.

4
సినిమాలు చెయ్యడం, సినిమాలు తియ్యడం, టెక్‌ కంపెనీలకు, కోడింగ్‌ (టెక్నికల్‌ టీచింగ్‌) ఎడ్యుకేషన్‌కు కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్‌ చెయ్యడం, ఒక డేటింగ్‌ యాప్‌ని నడపడం.. ఇన్ని ఎలా చేస్తున్నారు. చేస్తూ కూడా టెన్షన్‌ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు!

స్వేచ్ఛగా పెంచాలి
‘‘బహుశా మా పేరెంట్స్‌ పెంపకం’’ అంటారు ప్రియాంక. ‘‘నాకు ఏం కావాలంటే అది ఇచ్చారు. ఏం చేస్తానంటే అది చెయ్యనిచ్చారు. ‘నీకేం నచ్చుతుందో అందులో ముందుకు వెళ్లేందుకు భయపడకు’ అని చెప్పారు. మన దేశంలో చాలామంది అమ్మాయిలకు ఇంత అదృష్టం ఉండదు. వాళ్లసలు బయటికి కనిపించనేకూడదు. నలుగురికీ వినిపించేలా మాట్లాడకూడదు. నిండుగా బట్టలు వేసుకోవాలి. అణకువగా, బిడియంగా ఉండాలి.. ఇలా చెప్తారు ఇంట్లోని వాళ్లు. అయితే వాళ్ల గొంతును వాళ్లు వినిపించే అమ్మాయిలు ఇప్పుడు సమాజానికి కావాలి. కనుక ఆడపిల్లల్ని ధైర్యంగా, మాటకారిగా ఉండే లా పెంచాలి’’ అని ప్రియాంక అభిప్రాయం.

5

నిక్‌ కోసం, న్యూయార్క్‌ వెళ్లడం కోసం దేశంలోని సొంత మనుషులను,  సొంత సినిమాలను వదులుకుని వెళ్లారని సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ అయ్యారు ప్రియాంక. ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుగా కాలిపై కాలు వేసుకుని కూర్చోవడంపైన కూడా నెటిజన్‌లు ఆమెను విమర్శించారు.
నాకేం కోపం ఉండదు
‘‘మనది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కుంది. అలాగని కంప్యూటర్‌ల వెనుక నక్కి దొంగచాటుగా ట్రోల్‌ చెయ్యడం ధైర్యం లేని పని. ఇలాంటి పోస్ట్‌లను కూడా నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఫ్యాన్స్‌ నుంచి నాకు అభిమానం ఎలాగైతే లభిస్తోందో.. నేనంటే ఏ కారణం చేతనో గిట్టని వాళ్ల నుంచి ద్వేషమూ అలాగే లభిస్తుంది. ఇందులో ఆలోచించవలసింది, ఆగ్రహించవలసింది, తిరుగు పోస్ట్‌లతో ప్రతీకారం తీర్చుకోవలసిందీ ఏముంటుంది?’’ అని ప్రియాంక అంటారు. ‘హాలీవుడ్‌కు అంతగా అడిక్ట్‌ అయిపోయారా?’ అని కొందరు ఆమెను ట్రోల్‌ చేశారు.
.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top