నిర్మాతలు సినిమాకి ఊపిరిలాంటోళ్లు | Sakshi
Sakshi News home page

నిర్మాతలు సినిమాకి ఊపిరిలాంటోళ్లు

Published Sun, Sep 30 2018 6:04 AM

Pandem Kodi 2 Trailer Launch - Sakshi

2005లో విడుదలైన సూపర్‌హిట్‌ చిత్రం ‘పందెం కోడి’తో అటు తమిళ్‌లోను ఇటు లె లుగులోను విశాల్‌ మాస్‌ హీరో ఇమేజ్‌ సంపాదించుకున్నారు. పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఆ హిట్‌ ఫీట్‌ని సాధించటానికి రెడీ అయ్యారు చిత్రదర్శకుడు లింగుస్వామి, హీరో విశాల్‌. ‘పందెం కోడి’కి సీక్వెల్‌గా ఈ హిట్‌ కాంబినేష్‌న్‌లో రూపొందిన ‘పందెం కోడి 2’ అక్టోబర్‌ 18న తమిళ్, తెలుగులో రిలీజ్‌ కానుంది. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్రం ట్రైలర్‌ను  హైదరాబాద్‌లో ప్రముఖ పంపిణీదారుడు నారాయణదాస్‌ నారంగ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో 25 సినిమాలు పూర్తయ్యాయి. నేనీ రోజు మీ (ప్రేక్షకులు) ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులు, మా అన్నయ్య విశాల్‌కృష్ణ. వారి ప్రోత్సాహంతోనే హీరోగా కెరీర్‌ ప్రారంభించాను. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. నా 25 సినిమాల ప్రయాణంలో ప్రతి చిత్రం మంచి విజయాన్ని సాధించాలనే కష్టపడ్డాను.

నిర్మాతలు సినిమాలకు ఊపిరిలాంటోళ్లు. ‘పందెం కోడి 2’ కథ విషయానికొస్తే... ఏడు రోజుల పాటు జరిగే జాతర నేపథ్యంలో ఈ సీక్వెల్‌ రూపొందింది. ‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయిలో నటనను ప్రదర్శించిన కీర్తీ సురేశ్‌ మా సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించింది. ‘పందెం కోడి’ పార్ట్‌ 3 చేస్తే అందులో కూడా కీర్తీనే హీరోయిన్‌. వరలక్ష్మీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. రాజ్‌కిరణ్‌గారు చాలా హుందాగా నటించారు. తెలుగులో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్న ‘ఠాగూర్‌’ మధు గారికి థ్యాంక్స్‌’’ అన్నారు.

లింగుస్వామి మాట్లాడుతూ– ‘‘విశాల్‌లోని ఎన ర్జీ లెవెల్స్‌ను ‘పందెం కోడి’లో చూపించాను. ఈ సీక్వెల్‌లో కూడా అవి కంటిన్యూ అవుతాయి. ఈ సినిమా నెక్ట్స్‌ లెవల్లో ఉంటుంది. సీక్వెల్‌కి ఇంత గ్యాప్‌ రావటానికి కారణం మీరా జాస్మిన్‌లా నటించే హీరోయిన్, లాల్‌లా విలనిజమ్‌ చూపించే నటులు కోసం వెయిట్‌ చేయడమే’’ అన్నారు. ‘‘మహానటి’ తర్వాత ఆ రేంజ్‌లో తృప్తినిచ్చిన చిత్రమిది. అక్టోబర్‌ 17 నా బర్త్‌డే, సినిమా 18న విడుదలవుతుంది.

నా బర్త్‌డేకి పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నాను’’  అన్నారు కీర్తీ సురేశ్‌. ‘‘ఇది నాకు స్పెషల్‌ మూవీ’’ అన్నారు వరలక్ష్మీ. ‘‘విశాల్‌ అసోసియేషన్‌లో చేస్తున్న తొలి సినిమా ఇది. మొదటి భాగం కంటే రెండో భాగం ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘ఠాగూర్‌’ మధు. నిర్మాతలు కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్, అనిల్‌ సుంకర, బీవీయస్‌ఎన్‌ ప్రసాద్, సుధాకర్‌ రెడ్డి, టీయంసి సుమన్, వీరినాయుడు, ముత్యాల రామదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement