ది ఐరన్‌ లేడి

Nithya Menen to play Jayalalithaa in 'The Iron Lady' - Sakshi

మాజీ నటి, రాజకీయ నాయకురాలు, తమిళ ప్రజల ‘పురిట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు) జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో నాలుగు బయోపిక్స్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కించబోయే ‘ఐరన్‌ లేడీ’ ఒకటి. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ను నిత్యా మీనన్‌ పోషించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ– ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకురాలు ప్రియదర్శని పంచుకున్నారు.  ‘‘జయలలితగారి పాత్ర పోషించడానికి చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించాం.

ఫైనల్‌గా నిత్యా మీనన్‌ అయితే బావుంటుందని భావించాం. నిత్యా కూడా క్యారెక్టర్‌కు బాగా సూట్‌ అవుతున్నారు. జయలలితగారి ఆప్త మిత్రురాలు శశికళ పాత్రకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని అనుకుంటున్నాం. మిగతా నటీనటుల పేర్లను చిత్రం ప్రారంభోత్సవం రోజు చెబుతాం’’ అన్నారు. సినిమా కథ గురించి చెబుతూ – ‘‘జయలలితగారి జీవితం మొత్తం మా సినిమాలో చూపించదలిచాం. ఆమె పుట్టినప్పటి నుంచి చివరి వరకూ (1948 నుంచి 2016 వరకూ) చిత్రకథ ఉంటుంది.

సినిమాలకు, రాజకీయాలకు సమానమైన ప్రాముఖ్యతని ఇచ్చాం. ఏ ఘట్టాన్నీ పక్కన పెట్టుకోదలచుకోలేదు. జయలలితగారి అంత్యక్రియల సన్నివేశాలను కూడా చూపించనున్నాం. కానీ ఆసుపత్రిలో ఉన్న భాగాన్ని మాత్రం చూపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆ విషయం మీద కోర్ట్‌లో కేసు నడుస్తోంది. ఇన్వెస్టిగేషన్‌ జరిగే సమయంలో ఏది కరెక్టో సరిగ్గా చెప్పలేం. అందుకే దాన్ని చూపించదలచుకోలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత జన్మదినం రోజున ఈ చిత్రం ప్రారంభిస్తాం’’ అని ప్రియదర్శిని చెప్పుకొచ్చారు. దర్శకుడు భారతీరాజా, ఏయల్‌ విజయ్, లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్స్‌ అనౌన్స్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top