ప్రజలతోనూ మమేకం అవుతాం

Naresh Honored to Krishnam Raju in MAA - Sakshi

‘‘ఐక్యత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ముందుకు సాగుతుంది.  కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జనరల్‌ బాడీ మీటింగ్‌ విజయవంతంగా సాగింది’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ అన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఇటీవల కొత్త కమిటీ ఏన్నికైన విషయం విదితమే. ఆదివారం తొలిసారి జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ– ‘‘మా’ అసోసియేషన్‌కి గతంలో ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవిగార్లు ముఖ్య సలహాదారులుగా ఉండేవాళ్లు. ఈ సారి కృష్ణంరాజుగారిని ఎన్నుకున్నాం. కొత్త కమిటీ వచ్చిన వారం రోజుల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. 30కాల్స్‌ వచ్చాయి. సలహాల బాక్స్‌కి మంచి స్పందన వచ్చింది. 33 మందికి ప్రస్తుతం ఇచ్చే పెన్షన్‌ను ఆరు వేలకు పెంచాం.

‘మా’ మెంబర్‌ షిప్‌ని కొత్తవాళ్లకి రూ.25వేలకు ఇవ్వాలని, రెండేండ్లు 25వేల చొప్పున చెల్లిస్తే పూర్తి స్థాయి మెంబర్‌ షిప్‌ వస్తుంది. అలాగే 90రోజుల్లో పూర్తి పేమెంట్‌ కడితే పదిశాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని నిర్ణయించాం. ‘మా’ బిల్డింగ్‌ కోసం చిరంజీవిగారు సపోర్ట్‌ చేస్తానన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో హీరోలతోపాటు ప్రజలతో మమేకమై రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మా’లో చిన్న చిన్న మనస్పర్థలు ఉండేవి. దీంతో ఎలా జరుగుతుందో అన్న భయం ఉండేది. కానీ బాగా జరిగింది’’ అని ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ అన్నారు. రచయితలు పరుచూరి బ్రదర్స్, నటులు దేవదాస్‌ కనకాల, కృష్ణంరాజు దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షురాలు హేమ, ట్రెజరర్‌ రాజీవ్‌ కనకాల, శివబాలాజీ, సురేష్‌ కొండేటి, సుదర్శన్, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top