నా సిగ్గును పొగరు అనుకుంటున్నారు

Naga Shourya Talk About Oh Baby Actor Laxmi - Sakshi

‘‘ఓ బేబీ’ చిత్రంలో నాది అతిథి పాత్ర అని చెప్పినా నందినీ రెడ్డిగారికి ఓకే చెప్పేశా. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన లక్ష్మీగారు ఉన్నారు. ‘మురారి’ సినిమా చూసినప్పటి నుంచి ఆమెతో పని చేయాలనుకుంటున్నా. ఇంతకు ముందు ఒకసారి అనుకున్నా కుదరలేదు. ‘ఓ బేబీ’ తో కుదిరింది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. సమంత, లక్ష్మీ,  రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేష్‌ ముఖ్య పాత్రల్లో బి.వి. నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్‌ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్‌ హు, థామస్‌ కిమ్‌ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నాగశౌర్య  చెప్పిన విశేషాలు.

♦ హీరోగా చేస్తూ అతిథి పాత్రలు చేయడం ఇబ్బందిగా లేదు. నాకు నచ్చిన వారితో సినిమా చేయడం చాలా ఇష్టం. నందినీరెడ్డిగారు నాకు అక్కలాంటివారు. ఈ సినిమా గురించి ఆమె నాకు చెప్పడానికి సందేహిస్తుంటే మా అమ్మ ఒత్తిడి చేసి నాకు చెప్పించింది. కథ వినగానే తప్పకుండా హిట్‌ అయ్యే సినిమా అనిపించి, ఇందులో నేనూ భాగం కావాలనుకున్నా. 

♦ తొలుత నాది అతిథి పాత్రే అనుకున్నా. సెట్లోకి వెళ్లాక ఫుల్‌ లెంగ్త్‌ అయింది. లక్ష్మీగారు సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మొత్తం నేను, సమంతగారు అక్కడే ఉన్నాం. నేను ఒక్కసారి ఆమెను పలకరించాను. ఆ తర్వాత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. ఎందుకంటే నాకు సిగ్గెక్కువ. అందరూ దాన్ని పొగరు అనుకుంటారు. నా సిగ్గు వల్ల రొమాంటిక్‌ సీన్స్‌కి దూరంగా ఉంటున్నా. కానీ, తప్పదంటే మాత్రం చేస్తా.

♦ ఈ సినిమాలో నా లుక్‌ బాగుందని అంటున్నారు. అంటే ఇన్నాళ్లు నేను బాగా లేనా? అనిపించింది (నవ్వుతూ). సమంత గారితో పని చేస్తున్నప్పుడు నేను పెద్ద హీరోయిన్‌తో పని చేస్తున్నానని ఏ రోజూ అనిపించలేదు. ఈ సినిమాలో ఆమె ముఖం మీద ఉమ్మివేసే సీన్‌ ఉంటుంది. నేను ఆ పని చేస్తే బయట అందరూ నా మీద ఉమ్మేస్తారనుకున్నా. కానీ ఆమె డెడికేటెడ్‌ వ్యక్తి. సినిమా కోసమే కదా అని సహకరించడంతో ఆ సీన్‌ చేశా. 

♦ ప్రస్తుతం మా ఐరా క్రియేషన్స్‌లో ‘అశ్వత్థామ’ సినిమా చేస్తున్నాం. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ చేస్తున్నా. అదే విధంగా ‘పార్థు’ అని మరో సినిమా జరుగుతోంది.  రిస్క్‌ చేయడం వల్ల ఇటీవల గాయపడ్డానని అంటున్నారు. అంత రిస్క్‌ అవసరమే. అది 14 నిమిషాల సీను. డూప్‌ని పెడితే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. హీరో పడే టెన్షన్‌ వాళ్లూ పడాలంటే నేనే కష్టపడాలని అర్థమైంది.. అందుకే రిస్క్‌ చేసి నేనే చేస్తున్నా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top