వీరిలో వారు.. వారే వీరు!

Movie Stars Photographs Compared With Great Leaders - Sakshi

మన నటుల్లో మహానేతలు

సరదా సరదాగా చిత్రం..విచిత్రం

ఫొటోగ్రఫీ కొంత పుంతలు తొక్కడం ప్రారంభమై ఎంతోకాలమైంది. ఫొటోమేజిక్‌ కూడాఏమాత్రం తగ్గకుండా ఫొటోగ్రఫీతో పోటీపడుతోంది. ఇక మార్ఫింగ్‌ ఫొటోలు పక్కదోవపట్టి పలువురిని బజారుకీడుస్తున్న సంగతి చెప్పనక్కరలేదు. అయితే ఈ మూడింటివరుసలో నాలుగో రకం సామాజిక మాధ్యమాల్లో సరదా సరదాగా సందడి చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: బ్రిటీషు పాలకుల కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించిన మహానేతలు మనకెందరో ఉన్నారు. తెల్లదొరలను దేశం నుంచి తరిమికొట్టి  స్వాతంత్య్రాన్ని సముపార్జించిపెట్టిన సమరయోధులు నేటికీ ఏనాటికీ చిరస్మరణీయులే. జయంతి, వర్ధంతి రోజుల్లో వారిని స్మరించుకుంటూనే ఉన్నాం. ఆయా మహానేతల పేరు చెబితే చాలు ప్రతి పౌరునిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. దేశభక్తులుగా భారతీయులపై మహానేతల ప్రభావం అంతా ఇంతా కాదు.ఇక వెండితెర రారాజుల విషయానికి వస్తే వీరంతా వినోద ప్రపంచాన్ని ఏలడం కూడా ఏనాడో ప్రారంభమైంది. అభిమాన జనాన్ని నటీనటులు ఆకట్టుకుంటే, నటీనటులను ఆకట్టుకునే స్థాయిలో తమ హీరో తెరపైకి వస్తే తన్మయులై పోతారు. భారీ కటౌట్లు, వాటికి గజమాలలు, పాలాభిషేకాలు చేసేస్తుంటారు. ఈ భూలోకంలో సినిమారంగం మరో లోకమనే స్థాయిలో సమాజంపై ప్రభావం చూపుతోంది.

వారిలో వీరు.. వీరిలో వారు
మహానేతలది దేశసేవ, నటీ నటులది కళామతల్లి సేవ. దేశానికి అంకితమైన వారిని కళామతల్లి ముద్దుబిడ్డల్లో చూసుకుంటే ఎలా ఉంటుంది. అలాగే కళామతల్లి ముద్దుబిడ్డలను దేశభక్తుల ముఖ కవళికలతో పోల్చుకుంటే మరెంత గమ్మత్తుగా ఉంటుందనే ప్రయత్నం జరిగింది. సృజనాత్మకశీలి అయిన ఓ ఔత్సాహిక కళాకారుడు వారిలో వీరిని చూపించి మురిపించాడు. వీరిలో వారిని మిళితం చేసి మెప్పించాడు. ఎందరో మహానుభావులు.. మరెందరో మంచినటులు.. అందరికీ వందనాలు అని స్మరిస్తూ సరదా సరదాగా ఈ ఫొటోలను ఎంజాయ్‌ చేద్దాం.

అజిత్‌లో అన్నాదురై
ఈ ఫొటో చూడగానే చప్పున స్పురించేది అన్నాదురై. తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ఆద్యుడు, స్ఫూర్తిదాత. అయితే గట్టిగా పరిశీలిస్తే ఆ వేషంలో మనల్ని ఔరా అనిపించేది తమిళులచేత ‘తల’ అంటూ ముద్దుగా పిలిపించుకునే హీరో అజిత్‌.

విజయ్‌లో వివో చిదంబరనాథ్‌  
వివో చిందరనాథ్‌ పేరు చెప్పగానే ప్రముఖ దేశభక్తుడు, కప్పలోట్టి తమిళన్‌ (బ్రిటీష్‌ దొరల కాలంలోనే నౌకను నడిపిన తమిళుడు) అని గర్వంతో ఉప్పొంగిపోతారు. మరి ఆ మహానేతను మన ముందుకు తెచ్చిన నటుడు మరెవరో కాదు ‘ఇళయ దళపతి’ విజయ్‌.

రజనీలో రవీంద్రనాథ్‌  ఠాగూర్‌
పశ్చిమ బెంగాల్‌ జన్మించి తన రచనలతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న మహాకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. కర్ణాటకలో జన్మించి తమిళనాడులో నటుడిగా మారి సూపర్‌స్టార్‌గా ఎదిగిన వ్యక్తి రజనీకాంత్‌. వారివారి రంగాల్లో ఇద్దరూ లబ్దప్రతిష్టులే. ఈ ఫొటోమేజిక్‌తో ఇద్దరూ ఒకటై ముచ్చటగొలిపారు.

కమల్‌హాసన్‌లో సుభాష్‌ చంద్రబోస్‌
దేశభక్తి అంటే ఇదీ అని లోకానికి చాటిన నేతల్లో సుభాష్‌ చంద్రబోస్‌ స్థానం మరువలేనిది. ఆయన మరణం నేటికీ నిర్ధారణ కాకున్నా చరిత్ర పుటల్లో ఆయన సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక కమల్‌హాసన్‌లో కళాపిపాసి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అందుకే వీరిద్దరినీ ఒకే బొమ్మలో చూసుకుందాం.

శింబులో వివేకానందుడు
రామకృష్ణ పరమహంస శిష్యునిగా స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్న విశిష్టమైన వ్యక్తి స్వామి వివేకానందుడు. దేశ కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయాడు. మరి తమిళ సినీరంగంలో లవర్‌బాయ్‌గా పేరు గడించిన శింబు క్రమశిక్షణకు మారుపేరైన వివేకానందుడుగా ఇట్టే ఇమిడిపోయాడు.

తాత రూపంలో మనుమడు
తమిళ రాజకీయాల్లో అపరచాణుక్యుడు ఎవరంటే సంకోచించకుండా కరుణానిధి పేరు చెబుతారు. సభావేదికపై ఆయన వాగ్ధా్దటిని వింటే నాగస్వరం ఊదినపుడు నాగుపాములా నాట్యమాడాల్సిందే. ఆ మహారాజకీయవేత్తను తన ముఖంలో ఇముడ్చుకుని తాతకు వారసుడు మనుమడేగా అనిపించుకున్నాడు స్టాలిన్‌ కుమారుడైన వర్దమాన హీరో ఉదయనిధి స్టాలిన్‌.

నెహ్రూగా మారిన శివకార్తికేయన్‌
చాచా నెహ్రూకు చిన్నారులంటే ప్రీతి. పిల్లలకు సైతం చాచా అంటే అభిమానం. తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్ర గులాబీ ఆయన హాబీ. నేటి తరం బాలబాలికల అభిమానాన్ని చూరగొన్న నటుడు శివకార్తియేన్‌ సృజనశీలైన చిత్రకారుని చేతిలో చాచా నెహ్రూగా మారిపోయాడు.

కామరాజనాడార్‌ కాదు మన విజయ్‌సేతుపతే
తమిళనాడు రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా జేజేలు కొట్టించుకునే నేత ఎవరంటే కామరాజనాడార్‌ అని చెప్పకతప్పదు. కాంగ్రెస్‌ నేతైనా మానవతావాదిగా అందరి మన్నలను అందుకున్న మహనీయుడు. అన్ని పార్టీల వారికి ఆదర్శనీయుడైనాడు. మరి అంతటి గొప్పనేత రూపంలో లీనమై పోయాడు మన తాజా క్రేజీస్టార్‌ విజయ్‌సేతుపతి.

ఉక్కు మహిళగా త్రిష
భారతదేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జాతి మరచిపోలేని చరిత్ర సృష్టించారు. పురుషాధిక్య సమాజాన్ని సమర్థవంతంగా ఢీకొని తొలి మహిళా ప్రధానిగా నిలిచారు. సంస్కరణలతో దేశాన్ని పరుగులు పెట్టించారు. మరి ఇందిర రూపంలో ఇమిడిపోయిన నటి త్రిష కూడా తక్కువేమీ కాదు. ఏళ్లు గడిచిపోతున్నా చెక్కుచెదరని క్రేజుతో ముందుకు సాగుతున్నారు.

‘సూర్య’ కాంతిపుంజంలో భగత్‌సింగ్‌
దేశభక్తి చిరునామాగా నిలిచి స్వాతంత్య్ర సమరపోరాటంలో మెరుపులు మెరిపించినవారు భగత్‌సింగ్‌. వీరోచిత నైజానికి భగత్‌సింగ్‌ పెట్టిందిపేరు. అలాగే వెండితెరపై ప్రతినాయకుడిని మట్టికరిపించేందుకు వీరోచిత పోరాటాలతో ఆకట్టుకోవడం నటుడు సూర్య ప్రత్యేకత. అందుకే అంతలా భగత్‌సింగ్‌ రూపంలా ఐక్యమైపోయాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top