‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ

Mathu Vadalara Telugu Movie Review And Rating - Sakshi

చిత్రం: మత్తు వదలరా
జానర్‌: సస్పెన్స్‌ కామెడీ థ్రిల్లర్‌
నటీనటులు: శ్రీసింహా, వెన్నెల కిశోర్‌, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ
సంగీతం: కాలభైరవ
దర్శకత్వం: రితేష్‌ రానా
బ్యానర్స్‌: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత 

డైరెక్టర్‌, సంగీత దర్శకుడు, సింగర్‌, రచయిత, నిర్మాత, లైన్‌ ప్రొడ్యూసర్‌, కాస్టూమ్‌ డిజైనర్‌ ఇలా ఆ కుటుంబంలో ఓ సినిమాకు ప్రధానమైన టెక్నీషియన్స్‌ అందరూ ఉన్నారు. కానీ ఒక్క హీరో తప్ప. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీర‌బోతుంది. హీరో లేడ‌నే లోటును భ‌ర్తీ చేయ‌డానికి ఆకాశమంత ఆ కుటుంబం నుంచి కూడా ఓ వార‌సుడు వచ్చేశాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ రానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా బుధవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లతో చిత్రంపై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఇక దాదాపు అందరు కొత్తవాళ్లతో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంది? అందరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? రాజ‌మౌళి కుటుంబం నుంచి వచ్చిన నయా హీరో, మ్యూజిక్‌ డైరెక్టర్‌ను ప్రేక్షకులు ఆదరించారా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
బాబు మోహన్‌ (శ్రీసింహా), ఏసుదాస్‌ (సత్య), అభి (అగస్త్య)లు రూమ్‌మేట్స్‌. బాబు, ఏసుదాస్‌లు డెలీవరీ బాయ్స్‌గా పనిచేస్తూ చాలిచాలని జీతంతో కాలం వెల్లదీస్తుంటారు. అయితే జీతం, జీవితంపై అసహనం చెందిన బాబుకు ఏసుదాస్‌ ఓ ఉచిత సలహా ఇస్తాడు. ఆ సలహా పాటించిన బాబు అనుకోని చిక్కుల్లో పడతాడు. ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి బయటపడటానికి, హత్యచేసింది ఎవరో తెలుసుకోవడానికి బాబు చేసిన ప్రయత్నమే సినిమా కథ. అయితే ఈ కథలో రాజు (వెన్నెల కిశోర్‌), కానిస్టేబుల్‌ బెనర్జీ (బ్రహ్మాజీ), మైరా, తేజస్వి (అజయ్‌)లు ఎందుకు ఎంటర్‌ అవుతారు? అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఏసుదాస్‌ ఇచ్చిన ఆ ఉచిత సలహా ఏంటి? మూవీ టైటిల్‌తో కథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: 
రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భయం, కోపం, ప్రస్టేషన్స్‌, ఆనందం ఇలా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలో హీరో పలికించాల్సిన అన్ని భావాలను అవలీలగా పలకించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌కు నటనపరంగా మరో హీరో దొరికినట్లే. ఇక సత్య కామెడీ టైమింగ్‌ థియేటర్‌లో నవ్వులు పూయిస్తుంది. ఏ సమయంలో కూడా సత్య కామెడీ చికాకు తెప్పించదు. సినిమాకు సత్య కామెడీ మరింత బూస్టప్‌గా నిలిచింది. వెన్నెల కిశోర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఎవరూ ఊహించని వినూత్న పాత్ర పోషించిన వెన్నెల కిశోర్‌ తన అనుభవంతో అవలీలగా నటించాడు. అగస్త్య, తదితర నటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

 


విశ్లేషణ: 
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు కలుగదు జనులా
పుత్రుని కనుగొని పొగడగ 
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

ప్రస్తుతం ఈ పద్య భావాన్ని మ్యూజిక్‌డైరెక్టర్‌ ఎమ్‌ఎమ్‌ కీరవాణి పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకే చిత్రంతో తన ఇద్దరు కుమారులు టాలీవుడ్‌ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. మెప్పించారు. ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో కీరవాణి కుటుంబం డబుల్‌ హ్యాపీ అని చెప్పవచ్చు. నటుడిగా శ్రీసింహా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కాల భైరవలు తమ తొలి సినిమాతో రాజమౌళి కుటుంబానికి ఎలాంటి మచ్చ తీసుకరాలేదు. వీరిద్దరితో ఆ కుటంబం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కథనం. ఈ రెండు విషయాల్లో చిత్ర యూనిట్‌ ముఖ్యంగా దర్శకుడు ఎక్కడా తడబడలేదు. తెర మీద ఆట ప్రారంభమైన 15 నిమిషాల్లోనే సినిమా నేరుగా అసలు కథలోకి ప్రవేశిస్తుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌, కామెడీ ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని కథ ఎక్కడా డీవియేట్‌ కాకుండా డైరెక్టర్‌ జాగ్రత్తలు తీసుకున్నాడు. నెక్ట్స్‌ ఏం జరుగుతుంది అనే ఉత్సాహం, ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన కామెడీ అందించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కమర్షియల్‌ హంగుల జోలికి పోకుండా కథానుగుణంగా సినిమాను ముందుకు నడింపించాడుదర్శకుడు రితేష్‌ రానా. క్లైమాక్స్‌ వరకు కూడా సస్పెన్స్‌ను రివీల్‌ కాదు. అంతేకాకుండా ఎవరి ఊహకందని కామెడీ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. 
  
సంగీతదర్శకుడిగా మరో అవతారం ఎత్తిన సింగర్‌ కాల భైరవ తన తొలి సినిమాలోనే తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. ఈ మూవీకి మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌. సినిమాలో వచ్చే ప్రతీ సిచ్యూవేషన్‌కు తగ్గట్టు వినూత్న రీతిలో కొత్త బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించాడు ఈ యువ సంగీత దర్శకుడు. ముఖ్యంగా కామెడీగా వచ్చే కొన్ని సౌండ్స్‌ కేక అని చెప్పాలి. ఇక దర్శకుడు ఆలోచనలను తెరమీద దృశ్యరూపంలో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా చక్కగా ప్రజెంట్‌ చేశాడు సినిమాటోగ్రఫర్‌. విజువలైషన్స్‌ కూడా చాలా కొత్తగా వండర్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్‌, నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. 

ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా సూపర్బ్‌గా నచ్చుతుంది. వినూత్న కథలను, కొత్త కాన్సెప్ట్‌లను ఎల్లప్పుడూ ఎంకరేజ్‌ చేసే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో వేచి చూడాలి. ఫైనల్‌గా కొత్త వాళ్లు.. కొత్త ప్రయత్నం.. కొత్తగా, గ‘మ్మత్తు’గా ఉంది.     

ప్లస్‌ పాయింట్స్‌: 
శ్రీసింహా నటన
సత్య కామెడీ
కాల భైరవ మ్యూజిక్‌
కథనం
సినిమాలో కొత్తదనం

మైనస్‌ పాయింట్స్‌:
కమర్షియల్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3.5/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top