‘మణికర్ణిక’ మూవీ రివ్యూ

Manikarnika Movie Review - Sakshi

టైటిల్ : మణికర్ణిక
జానర్ : హిస్టారికల్‌ మూవీ
తారాగణం : కంగానా రనౌత్‌, అతుల్‌ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్‌గుప్తా, రిచర్డ్‌ కీప్‌
సంగీతం : శంకర్‌ ఇషాన్‌ లాయ్‌
దర్శకత్వం : క్రిష్‌, కంగనా రనౌత్‌
నిర్మాత : కమల్‌ జైన్‌, నిశాంత్‌ పిట్టి, జీ స్టూడియోస్‌

ప్రస్తుతం అన్ని భాషల్లో బయోగ్రాఫికల్ సినిమాల సీజన్‌ నడుస్తోంది. కొందరు సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడా కారుల జీవితాలను తెరకెక్కిస్తుంటే మరికొందరు దర్శక నిర్మాతలు చారిత్రక పాత్రలను తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ హిస్టారికల్‌ మూవీ మణికర్ణిక. ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాకు చాలా భాగం క్రిష్‌ దర్శకత్వం వహించటం, తరువాత దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న కంగనా రనౌత్‌ కథా కథనాలతో పాటు నటీనటులను కూడా మార్చటం వివాదాస్పదంగా మారింది. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిటంతో టాలీవుడ్‌లోనూ మణికర్ణికపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. మరి ఆ అంచనాలు మణికర్ణిక అందుకుందా..? చారిత్రక పాత్రలో కంగనా ఏ మేరకు మెప్పించింది..? దర్శకురాలిగానూ కంగనా విజయం సాధించిందా..?

కథ‌ :
భారతీయులకు చాలా బాగా తెలిసిన కథే ఝాన్సీ లక్ష్మీబాయి. అదే కథను సినిమాటిక్‌ ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం చేశారు మణికర్ణిక యూనిట్. బితూర్‌లో పుట్టిన మణికర్ణిక (కంగనా రనౌత్‌) ఝాన్సీ రాజు గంగాధర్‌ రావు(జిషు సేన్‌గుప్తా) ను వివాహం చేసుకుంటుంది. పెళ్లి తరువాత మణికర్ణిక పేరును లక్ష్మీబాయిగా మారుస్తారు. లక్ష్మీ బాయి మహారాణిగా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఈస్ట్‌ఇండియా కం‍పెనీ తన పరిధిని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అదే సమయంలో లక్ష్మీబాయి జీవితంలోనూ కల్లోలం మొదలువుతుంది. భర్త మరణించటంతో కొంతమంది నమ్మకస్తుల సాయంతో రాజ్యాధికారాన్ని లక్ష్మీబాయి తీసుకుంటుంది. ఝాన్సీ రాణిగా మారిన లక్ష్మీబాయి ఆంగ్లేయులను ఎలా ఎదిరించింది..? ఎలాంటి ధైర్య సాహసాలను ప్రదర్శించింది..? చివరకు ఏమయ్యింది..? అన్నదే మిగత కథ.

న‌టీన‌టులు :
సినిమా అంతా లక్ష్మీబాయి చుట్టూనే తిరిగటంతో ఇతర పాత్రలకు పెద్దగా గుర్తింపు వచ్చే అవకాశమే లేదు. కంగనా కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకుడిని చూపు తిప్పుకోకుండా చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. మణికర్ణికగా ఆనందంగా కాలం గడిపే అమ్మాయి నుంచి రాజ్య భారం మోసే రాణిగా హుందాగా కనిపించే వరకు ఎన్నో కోణాలను తెర మీద ఆవిష్కరించింది. రణరంగంలో వీరనారిగా కత్తి దూసే సన్నివేశాల్లో కంగనా నటవిశ్వరూపం చూపించింది. కీలక పాత్రల్లో నటించిన అతుల్‌ కులకర్ణి, జిషు సేన్‌గుప్తా, డానీ డెంజొప్ప, అంకితా లోఖండే బ్రిటీష్ పాలకుడిగా రిచర్డ్‌ కీప్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ‌ :
సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు అసలు కథను మొదలు పెట్టడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడు. దాదాపు ఫస్ట్‌ అంతా మణికర్ణిక పాత్రను ఎలివేట్ చేసేందుకు, ఆమెను స్వతంత్రభావాలు ఉన్న.. భయం లేని మహిళగా చూపించేందుకు కేటాయించారు. లక్ష్మీ బాయి ఝాన్సీ బాధ్యతలు తీసుకున్న తరువాత కథనం కాస్త స్పీడందుకున్న భావన కలిగినా.. భారీ డైలాగులు, పాటలు కథనానికి అడ్డుపడుతుంటాయి. గ్రాఫిక్స్‌ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు. కొన్ని సీన్స్‌ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్‌ హాఫ్లో ఎమోషనల్‌ సీన్స్‌ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. పోరాట సన్నివేశాలు సహజంగా ఉన్నాయి. క్లైమాక్స్‌ సూపర్బ్‌ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. అప్పటి పరిస్థితులను వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. సంగీత త్రయం శంకర్‌ ఇసాన్ లాయ్‌లు నిరాశపరిచారనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో కూడా మెప్పించలేకపోయారు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కంగనా రనౌత్‌
పోరాట సన్నివేశాలు

మైనస్‌ పాయింట్స్‌ :
ఫస్ట్‌ హాఫ్‌
సంగీతం

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top