
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి విమర్శలు గుప్పించాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్‌పై ప్రశ్నల వర్షానికి స్వల్ప విరామం ప్రకటించి.. అంతా అభిమానుల చేతుల్లోని ఉందని హెచ్చరించిన మహేశ్ కత్తి.. తన విమర్శల పర్వాన్ని మళ్లీ ప్రారంభించాడు.
సోమవారం ‘ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో... హతవిధి! ఏమిటీ మీమాంస?, అజ్ఞాతవాసికి అగ్న్యాతవాసికి తేడా ఉంది త్రివిక్రమ్ గారూ!’అంటూ ‘అజ్ఞాతవాసి’ సినిమాపై వ్యంగ్యాస్త్రాలు విడిచిన ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన అటు చంద్రబాబుకు, ఇటు పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు కలిసొచ్చిందన్నాడు.
‘స్వామికార్యం స్వకార్యం అంటే జనాలు ఫీల్ అయ్యారుగాని, టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ పాస్‌ల కోసం కొట్టుకుంటున్న విధానం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ పర్యటన అటు చంద్రబాబుకు ఇటు కళ్యాణ్ బాబుకు ఇద్దరికీ వర్కౌట్ అయినట్లేగా! ఒకే దెబ్బకి రెండు పిట్టలు. రాజకీయానికి రాజకీయం. సినిమాకి సినిమా. కొన్ని కోట్ల ప్రమోషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతేను!’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కొద్దిరోజులుగా పవన్ అభిమానులకు మహేశ్ కత్తికి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేశ్ కత్తి మరోసారి ఫైర్ అవ్వడానికి పవన్ అభిమానులే కారణమణని ఆయన ఫాలోవర్స్ భావిస్తున్నారు.