‘మహానటి’ మూవీ రివ్యూ

Mahanati Movie Review In Telugu - Sakshi

టైటిల్ : మహానటి
జానర్ : బయోపిక్‌
తారాగణం : కీర్తీ సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్
సంగీతం : మిక్కీ జే మేయర్‌
దర్శకత్వం : నాగ్‌ అశ్విన్‌
నిర్మాత : అశ్వనీదత్‌, ప్రియాంక దత్‌, స్వప్నాదత్‌

హీరోయిన్‌కు సూపర్‌ స్టార్‌ స్టేటస్‌ అందించిన తొలితరం హీరోయిన్‌ సావిత్రి. ఎన్నో అద్భుత పాత్రలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న సావిత్రి, నిజ జీవితం కూడా సినిమా కథలాగే సాగింది. అ‍త్యున్నత శిఖరాలను చూసిన ఆ మహానటి, చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.(సాక్షి రివ్యూస్‌) ఆ మహానటి జీవితం పై ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ఏది నిజం..? ఏది అబద్ధం..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కించిన సినిమా మహానటి. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంది..? అలనాటి అందాల నటిని ఈ తరానికి పరిచయం చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా..?

కథ ;
మహానటి పూర్తిగా సావిత్రి కథ. ఆమె జీవితంపై ఎంతో పరిశోదన చేసి ఈ కథను తయారు చేశారు. సినీ అభిమానులకు సావిత్రి తెర మీదకు వచ్చిన దగ్గరనుంచే తెలుసు కానీ ఆమె గతాన్ని కూడా ఈ సినిమాతో పరిచయం చేశారు. నిశంకర సావిత్రి (కీర్తి సురేష్‌).. తనకు ఆర‍్నేళ్లు ఉన్నప్పుడే తండ్రి చనిపోవటంతో పెదనాన్న కే వెంకట రామయ్య చౌదరి(రాజేంద్ర ప్రసాద్‌) సంరక్షణలో పెరుగుతుంది. (సాక్షి రివ్యూస్‌)చిన్నతనం నుంచి ఈ పని నీ వల్ల కాదు అంటే ఎలాగైనా పట్టు పట్టి ఆ పని చేసి చూపించటం సావిత్రికి అలవాటు. అందుకే తనకు రాదు అన్న నాట్యం దూరం నుంచి చూసి నేర్చుకుంటుంది.

సావిత్రి లోని ప్రతిభను గుర్తించి నాటకాలు వేసేందుకు అరుణోదయ నాట్యమండలిలో బాలనటిగా అవకాశం ఇస్తారు. నాటకాలకు ఆదరణ తగ్గిపోవటంతో సావిత్రిని సినిమాల్లో నటింప చేయాలని నిర్ణయించుకుంటాడు ఆమె పెదనాన్న. ఆ ప్రయత్నాల్లో భాగంగా 14 ఏళ్ల వయసులో సావిత్రి చెన్నై చేరుకుంటారు. తమిళ్‌ రాకపోవటంతో అక్కడ ఇబ్బంది పడుతుంటే.. జెమినీ గణేషణ్‌ (దుల్కర్‌ సల్మాన్‌).. సావిత్రి అందం చూసి ఎప్పటికైన పెద్ద నటి అవుతుందని చెప్పి ఆ ఫోటోలు తీసి పత్రికల వారికి ఇస్తారు.

అలా పత్రికల్లో వచ్చిన సావిత్రి ఫోటోలు చూసిన ఎల్‌వి ప్రసాద్‌ తన సినిమాలో నాగేశ్వరరావు సరసన హీరోయిన్‌గా తొలి అవకాశం ఇస్తారు. కానీ ఆ అవకాశం సావిత్రి చేజారిపోతుంది. తరువాత అదే ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కి పెళ్లి చేసి చూడు సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటారు సావిత్రి. అలా వెండితెర మీదకు అడుగుపెట్టిన సావిత్రి ఎలా మహానటిగా ఎదిగారు. జెమినీ గణేషణ్ ఆమె జీవితంలోకి ఎలా ప్రవేశించారు. పెళ్లి తరువాత సావిత్రి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. కోట్ల ఆస్తులు సంపాదించిన సావిత్రి చివరకు అన్ని పోగొట్టుకోవడానికి కారణమేంటి..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
సినిమాకు ప్రధాన బలం కీర్తీ సురేష్‌. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ పరకాయ ప్రవేశం చేసిందా అన్నంతగా జీవించారు. 14 ఏళ్ల వయస్సులో సావిత్రిలోని అల్లరి, చిలిపి తనం. నటిగా ఎదుగుతున్న సమయంలో తనలో హుందాతనం. ప్రేమ, కరుణ, భయం, కోపం ఇలా ప్రతీ రసాన్ని అద్భుతంగా పలికించారు.(సాక్షి రివ్యూస్‌) తెర మీద సావిత్రినే చూస్తున్నామ అన్నంతగా మెప్పించారు కీర్తి సురేష్‌. సావిత్రి భర్త జెమినీ గణేష్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ ఒదిగిపోయారు.

తొలినాళ్లలో సావిత్రికి సాయం చేసే ప్రేమికుడిగా తరువాత తనను దాటి సావిత్రి ఎదిగిపోతుందన్న ఈర్ష్యతో కోపం పెంచుకున్న వ్యక్తిగా రెండు వేరియేషన్స్‌ ను చాలా బాగా చూపించారు. సావిత్రి కథను నడిపించే కీలక పాత్రలో సమంత ఆకట్టుకున్నారు. జర్నలిస్ట్‌ మధురవాణిగా సావిత్రి జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించే పాత్రలో సమంత జీవించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్స్‌లో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది.

విజయ్‌ దేవరకొండ ఫోటోగ్రాఫర్‌గా మెప్పించారు. కథలో పెద్దగా కీలకమైన పాత్ర కాకపోయినా.. సమంత, విజయ్‌ల మధ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.(సాక్షి రివ్యూస్‌) ఇతర పాత్రల్లో హేమాహేమీల్లాంటి నటులు కనిపించారు. అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య, కేవీ చౌదరిగా రాజేంద్ర ప్రసాద్‌, ఎస్వీఆర్‌గా మోహన్‌ బాబు, చక్రపాణి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌, కేవీరెడ్డిగా క్రిష్‌, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్‌ భాస్కర్‌, ఎల్‌వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్‌ ఇలా ప్రతీఒక్కరు అలనాటి మహానుభావులను తెర మీద చూపించేందుకు తమవంతు సాయం చేశారు.

విశ్లేషణ ;
మహానటి సావిత్రి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలన్న నిర్ణయమే సాహసం. అలాంటి ప్రయత్నాన్ని ఏ మాత్రం వివాదాస్పదం కాకుండా అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ప్రతీ ఫ్రేమ్‌లో సావిత్రి కథను ఈ తరానికి పరిచయం చేయాలన్న తపన స్పష్టంగా కనిపించింది. రెగ్యులర్‌ కమర్షియల్ సినిమాలా కాకుండా ఓ క్లాసిక్‌లా సినిమాను రూపొందించారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడుకి సావిత్రి కాలంలోకి వెళ్లి ఆమె జీవితాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలిగించారు.

అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు చిత్రయూనిట్‌ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. అయితే తెర మీద సావిత్రి అందరికి తెలుసు కనుక ఎక్కువగా తెర వెనుక సావిత్రి జీవితాన్నే సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. సాయి మాధవ్‌ బుర్రా రాసిన సంభాషణలు మనసును తాకుతాయి. డానీ సినిమాటోగ్రఫి ప్రేక్షకుడిని 60 నాటి కాలంలోకి తీసుకెళుతుంది. ముఖ్యంగా అప్పటి సినిమాల్లోని సన్నివేశాలను మరోసారి తెర మీద ఆవిష్కరించిన తీరు అద్భుతం.

సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్ మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం. ప‍్రతీ పాట కథలో భాగంగా వస్తూ ప్రేక్షకుణ్ని మరింతగా కథలో లీనమయ్యేలా చేస్తుంది. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ప్రతీ ఒక్క టెక‍్నిషియన్‌ ఎంత మనసు పెట్టి చేశారో సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మహానటి జీవితాన్ని నేటి తరానికి పరిచయం చేసేందుకు నిర్మాతలు చేసిన ప్రయత్నం అభినందనీయం.

మహానటి ఈ తరంలో తెరకెక్కిన క్లాసిక్‌.

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top