కథే కథకుడిని ఎన్నుకుంటుంది

krish interview about ntr biopic movie - Sakshi

యన్టీ రామారావు జీవితం ఆధారంగా క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘యన్‌టీఆర్‌ : కథానాయకుడు’. యన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించి, నిర్మించారు. ఈ చిత్రం 9న రిలీజైంది. ఈ సందర్భంగా పలు విశేషాలను పంచుకున్నారు క్రిష్‌.

► ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చేస్తున్న సమయంలోనే విబ్రీ మీడియా విష్ణుగారు రామారావుగారి మీద సినిమా చేస్తారా? అని అడిగారు. అప్పుడే ఓ బయోపిక్‌ తీస్తున్నాం మళ్లీ కుదురుతుందో లేదో అనుకున్నాం. కథ తన కథకుడిని వెతుక్కుంటుంది అన్నట్టు ‘యన్‌టీఆర్‌’గారి కథ నన్ను ఎంచుకుంది. ఎన్టీఆర్‌ అంటే నందమూరి తారక రామారావు. తిప్పి చదివితే రామ తారకం. వీళ్లిద్దరి కథ చెబుదాం అని అనిపించింది. ఆ దారం పట్టుకుని వెళ్లిపోయాను.

► ఈ బయోపిక్‌ రెండో భాగం ‘మహానాయకుడు’ నా పదో సినిమా అవుతుంది. చాలా సినిమాలకు సేమ్‌ టీమ్‌తో వర్క్‌ చేశాను. రెండు భాగాలు కలిపి ఎనభై రోజుల్లో  షూటింగ్‌ పూర్తి చేశాం. సినిమాలో ఒక డైలాగ్‌ కూడా ఉంటుంది.  ‘ఏ పనికైనా పట్టుదల, ప్రణాళిక ముఖ్యం’. ఇదివరకు సినిమాలు ఇలానే తీసేవారు. నా బలం నా టీమే.

► రెస్పాన్స్‌ చాలా బావుంది. ఎవరు మాట్లాడినా సరే కళ్లలో తడితోనో లేదా గుండెల్లో చెమ్మతోనే మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్‌ని అని ఫిక్స్‌ అయ్యాక అప్పటి వరకూ రెడీ అయిన కథ రఫ్‌గా విన్నాను. కానీ వాళ్లు చేసిన వెర్షన్‌ చూడలేదు. మొత్తం నా సొంత స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. కథ ఆలోచించడం కష్టం. స్క్రీన్‌ ప్లే రాయడం అంత కాదేమో. రామారావుగారి గురించి చాలా ఆర్టికల్స్‌ చదివాను, బయోగ్రఫీలు చదివాను. కేవలం ఈ సినిమా కోసమనే కాదు. సాధారణంగా చరిత్రంటేనే ఇంట్రెస్ట్‌ ఎక్కువ. ఆ పరిశోధన ఇప్పుడు ఉపయోగపడింది. సంక్రాంతి రిలీజ్‌ అని అనౌన్స్‌ చేయకపోయినా ఇదే స్పీడ్‌తో సినిమా పూర్తి చేసేవాణ్ని.

► నేను రచయితను. బుర్రా సాయిమాధవ్‌గారు గొప్ప రచయిత. గొప్ప రచయిత ఉన్నప్పుడు వాళ్లు చెప్పిందే ఫైనల్‌ అవుతుంది. ఆయన డైలాగ్స్‌ గొప్పతనమేంటంటే అవి కథను ముందుకు నడిపిస్తుంటాయి. మ్యూజిక్‌ విషయానికి వస్తే ‘మంచి సినిమా తీశావు. దాన్ని గొప్ప సినిమా చేస్తాను’ అన్నారు కీరవాణిగారు. అలానే చేశారు. కెమెరామేన్‌ జ్ఙానశేఖర్‌వి, నావి వేరు వేరు కళ్లయినా ఇద్దరం ఒకటే చూస్తాం. ఆయనో గొప్ప పెయింటర్‌. మాకిది ఎనిమిదో సినిమా.

► ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో రామారావుగారికి, బాలకృష్ణగారికి మధ్య నేను గమనించిన లక్షణాలు క్రమశిక్షణ, వృతి పట్ల అంకిత భావం. తెగువ. మంచి సినిమా చేయడానికి వెనుకాడరు.  బాలకృష్ణగారి ఆహార్యం చక్కగా కుదిరింది. విద్యా బాలన్‌ లేకుంటే తారకమ్మగారి పాత్రే లేదు. తారకమ్మగారి గురించి చదవడానికి మెటీరియల్‌ లేదు. కుటుంబ సభ్యుల ద్వారా విని బాగా పాత్రను పోషించారు. ఎల్వీ ప్రసాద్‌ పాత్రను బెంగాళీ నటుడు జిష్షుసేన్‌ గుప్తా చేశారు. మణికర్ణికలో కంగనా భర్తగా నటించారు. బెంగాలీలో ఆయనో సూపర్‌స్టార్‌. ఎల్వీ ప్రసాద్‌ బాడీ లాంగ్వేజ్‌ను ఆయన అన్వయించుకున్న తీరు బావుంది. 2,3 నెలలు బ్రేక్‌ తీసుకోవాలి. లాస్ట్‌ 215 రోజులు పని చేస్తూనే ఉన్నాను.

► వరుసగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలు చేయడం అనుకోకుండా జరిగింది.  ‘శాతకర్ణి’ కథ చెప్పాలని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేశాను. ‘మణికర్ణిక, యన్‌టీఆర్‌’ సినిమాలు అనుకోకుండా వరించిన అదృష్టాలు. ఏదైనా సినిమా చేయాలనుకున్నప్పుడు మూడు విషయాలు ముఖ్యంగా పాటిస్తాను. ఆ కథ వినూత్నంగా, అర్థవంతంగా, వినోదాత్మకంగా ఉందా? మామూలు కథలు చెప్పుకెళ్లడం నాకు నచ్చదు. మహా అయితే 30–40 సినిమాలు చేస్తాం. అందులో అర్థం లేని సినిమాలు ఉండటం నాకిష్టంలేదు.

► ‘మణికర్ణిక’ నుంచి సోనూ సూద్‌ తప్పుకోవడం వల్ల మళ్లీ షూటింగ్‌ ఏర్పడింది. నా పాత్ర వరకూ నేను సరిగ్గానే నిర్వహించాను. 10 సినిమాల వయసొచ్చింది. ఇంకా డైరెక్షన్‌ క్రెడిట్‌ కంగనాకి వెళుతుందా? నాకా? అని ఆలోచించను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top