బాలు రికార్డు బ్రేక్‌ చేసిన యేసుదాస్‌

KJ Yesudas Creates History - Sakshi

మధుర గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడించి.. ‘గానగంధర్వుడి’గా పేరుగాంచిన కేజే యేసుదాస్‌ కొత్త రికార్డు తన పేర లిఖించుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ప్రకటించిన 65వ జాతీయ సినిమా అవార్డుల్లో ఆయన ఉత్తమ గాయకుడి అవార్డుకు ఎంపియ్యారు. మలయాళ చిత్రం ‘విశ్వాసపూర్వం మన్సూర్‌’లోని ‘పోయి మరాంజకాలం’ అనే పాటకుగానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఎనిమిదోసారి అవార్డు పొందడం ద్వారా యేసుదాస్‌ సరికొత్త రికార్డు సృష్టించారు.

1940లో ఎర్నాకులంలో జన్మించిన యేసుదాస్‌.. కుంజన్‌ వేలు ఆసన్‌, రామన్‌కుట్టి భాగవతార్‌ ప్రముఖ సంగీత విద్వాంసుల వద్ద సంగీతం నేర్చుకున్నారు. అనతికాలంలోనే గొప్ప గాయకుడిగా పేరు పొందారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నింటిలోనూ ప్రదర్శనలు ఇచ్చిన యేసుదాస్‌ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

1961లో గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన యేసుదాస్‌.. వివిధ భాషల్లో ఎన్నో మధుర గీతాలు ఆలపించారు. తన సుమధుర గాత్రంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ గానగాంధర్వుడు 1972లో మొదటిసారిగా జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు పొందారు. తర్వాత 1973, 76, 82, 87, 91, 93 సంవత్సరాల్లో కూడా అవార్డులు పొందారు. దీంతో ఆరు జాతీయ అవార్డులు పొందిన మరో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికార్డును యేసుదాస్‌ బ్రేక్‌ చేసినట్లయింది.

అవార్డు వద్దన్నారు..
23 సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ గాయకుడిగా ఎంపికైన యేసుదాస్‌.. 1987 నుంచి తన పేరును పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా కొత్త గాయకులకు ఈ అవకాశం లభిస్తుందని ఆయన ఉద్దేశం. సంగీత రంగంలో ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1977లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌, 2017లో పద్మవిభూషణ్‌ అవార్డులతో సత్కరించింది.
   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top