breaking news
Best Singer
-
Nanjiyamma: ప్రకృతి తల్లి పాటకు పట్టాభిషేకం
‘‘ఉన్నపళంగా నా కొడుకు ఫోన్ చేశాడు. అమ్మా.. ఒక్కసారి టీవీ చూడే అన్నాడు. నాకు దేశం నుంచి ఏదో అవార్డు వచ్చిందని చెప్పాడు. ఈ అవార్డు ఏంటో నాకు తెల్వదు. దాని గొప్పతనం ఏంటో కూడా తెల్వదు. కానీ, నా కొడుకు మాటలే నాకు సంతోషాన్ని ఇచ్చాయి. అసలు ఈ వయసులో సినిమా పాటలు పాడతానని, నటిస్తానని ఎవరైనా అనుకుంటారా?’’ అని అమాయకపు నవ్వులతో చెప్తోంది అరవై ఏళ్ల వయసున్న నాంజియమ్మ. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రంలో ‘కళకాత్తా సందనమేరే’.. పాటకు 2020-నేషనల్ బెస్ట్ సింగర్ అవార్డుకు ఎంపికైంది ఈ తల్లి. పుట్టింది ఎక్కడో మామూలు గిరిజన పల్లెలో. కాకపోతే.. జానపద కళాకారిణి. సినిమా అంటే ఏంటో తెలుసు. కానీ, అందులో నటించే వాళ్లు ఎవరు? వాళ్ల పేర్లేంటి? వాళ్ల గురించి ఆమెకు ఎంత మాత్రం అవగాహన లేదు. కేవలం ప్రకృతిని.. దాని నుంచి పుట్టిన పాటల్ని నమ్ముకుని పెరిగింది నాంజియమ్మ. అలాంటిది ఒక్క సినిమాతోనే ఇవాళ దేశం ఆమె గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. అన్నట్లు.. ఆ పాటకు సాహిత్యం కూడా ఆమెదే. అందుకే పాట రచయిత కూడా సంతోషంగా ఉన్నారా? అంటే.. ‘అవును..’ అంటూ ముసిముసి నవ్వులతో బదులు ఇచ్చింది. పలక్కడ్ జిల్లా అట్టపడి.. కేరళలో ఉన్న ఏకైక గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం షూటింగ్ చేసుకుంది. 2020లో వచ్చిన ఈ చిత్రం మాలీవుడ్‌లో ఓ చెరగని ముద్ర వేసుకుంది. ఈ చిత్ర దర్శకుడు, రచయిత సాచీకి ఇది రెండో చిత్రం.. దురదృష్టవశాత్తూ ఆఖరి చిత్రం కూడా. అయితే ఆ ప్రాంతంతోనే ముడిపడిన సినిమా కావడంతో.. అక్కడి కల్చర్‌నే సినిమాలో ఎక్కువ భాగం చేశాడు ఆయన. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. నాంజియమ్మ గురించే. అట్టపడిలో నుక్కుపథి పిరివు అనే గిరిజన పల్లె నాంజియమ్మ స్వగ్రామం. ఇరుల గిరిజన తెగకు చెందిన ఈమె.. జానపద కళాకారిని. ప్రకృతిని నమ్ముకున్న నాంజియమ్మ.. చెట్టు, గట్టు, పుట్ట, పశువులను చూస్తూనే అలవోకగా పాటలు పాడుతుంది. గిరిజన కళాకారుల సంఘం ఆట కళాసంఘం, ఆజాద్ కళా సమితిలో ఆమె సభ్యురాలు కూడా. పళని స్వామి ఆజాద్ కళా సమితి వ్యవస్థాపకుడు. ఈయన ద్వారానే నాంజియమ్మ గురించి తెలుసుకున్న సాచీ.. పాడేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇరుల భాషకు ఒక లిపి అంటూ లేదు. అందుకే అదే భాషలో ఆశువుగా మాట్లాడడం, పాడడం నేర్చుకుంది నాంజియమ్మ. పదిహేనేళ్ల వయసులో వివాహం చేసుకున్న ఆమెకి.. భర్త ప్రోత్సహం కొండంత బలాన్ని ఇచ్చింది. ఆమెకు ఒక కొడుకు.. ఒక కూతురు. కొడుకు అగలిలోని ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఉద్యోగి. ఇక దశాబ్దాలుగా వ్యవసాయం, పశువులను మేపుతూనే ఆమె జీవనం కొనసాగిస్తోంది. ఆ సమయంలోనే పాటల్ని సృష్టించుకుని.. పాడుతుంటుంది. అదే జీవనశైలిలోనే ఇంకా బతుకుతోంది. అన్నట్లు సినిమాలో టైటిల్ ట్రాక్ తో సహా మూడు పాటలు ఆమె పాడారు. అంతేకాదు.. చిత్రంలో ప్రధాన పాత్రధారి అయ్యప్పన్ క్యారెక్టర్‌కి అత్త క్యారెక్టర్లోనూ మెరిశారు ఆమె. పళని(ఎడమ), జేక్స్ బిజోయ్‌తో.. కళకాత్తా సందనమేరే.. ఈ పాట నంజియమ్మ జీవితానికి ముడిపడిన పాట. అందుకే సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్.. రికార్డింగ్ సమయంలో నాంజియమ్మకు ఎంతో సహకారం అందించాడు. పరాయి, దావిల్, కోకల్, జల్త్రా వంటి సాంప్రదాయ గిరిజన వాయిద్యాలను పాటలో ఉపయోగించాడు. ఆమె ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని.. అందుకు తగ్గట్లుగానే సాంగ్స్ రీ-రికార్డ్ చేయించాడు.ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ అయిన నెల రోజులకే 10 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. మలయాళీలకు మాత్రమే కాదు.. సౌత్ చిత్రాలకు ఆదరించే ఎందరికో ఇదొక ఫేవరెట్ సాంగ్. అటవీ భూముల్లోని గంధపుచెట్లు, పువ్వులు, వృక్షజాలాన్ని వివరిస్తుంది ఈ పాట. మనవళ్లకు గోరు ముద్దులు తినిపించే అవ్వల తాలుకా భావోద్వేగాలను పంచుతుంది కూడా. (క్లిక్: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది) - సాక్షి, వెబ్ స్పెషల్ -
కేజే యేసుదాస్ కొత్త రికార్డు
-
బాలు రికార్డు బ్రేక్ చేసిన యేసుదాస్
మధుర గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడించి.. ‘గానగంధర్వుడి’గా పేరుగాంచిన కేజే యేసుదాస్ కొత్త రికార్డు తన పేర లిఖించుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ప్రకటించిన 65వ జాతీయ సినిమా అవార్డుల్లో ఆయన ఉత్తమ గాయకుడి అవార్డుకు ఎంపియ్యారు. మలయాళ చిత్రం ‘విశ్వాసపూర్వం మన్సూర్’లోని ‘పోయి మరాంజకాలం’ అనే పాటకుగానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఎనిమిదోసారి అవార్డు పొందడం ద్వారా యేసుదాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. 1940లో ఎర్నాకులంలో జన్మించిన యేసుదాస్.. కుంజన్ వేలు ఆసన్, రామన్‌కుట్టి భాగవతార్ ప్రముఖ సంగీత విద్వాంసుల వద్ద సంగీతం నేర్చుకున్నారు. అనతికాలంలోనే గొప్ప గాయకుడిగా పేరు పొందారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నింటిలోనూ ప్రదర్శనలు ఇచ్చిన యేసుదాస్ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1961లో గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన యేసుదాస్.. వివిధ భాషల్లో ఎన్నో మధుర గీతాలు ఆలపించారు. తన సుమధుర గాత్రంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ గానగాంధర్వుడు 1972లో మొదటిసారిగా జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు పొందారు. తర్వాత 1973, 76, 82, 87, 91, 93 సంవత్సరాల్లో కూడా అవార్డులు పొందారు. దీంతో ఆరు జాతీయ అవార్డులు పొందిన మరో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికార్డును యేసుదాస్ బ్రేక్ చేసినట్లయింది. అవార్డు వద్దన్నారు.. 23 సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ గాయకుడిగా ఎంపికైన యేసుదాస్.. 1987 నుంచి తన పేరును పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా కొత్త గాయకులకు ఈ అవకాశం లభిస్తుందని ఆయన ఉద్దేశం. సంగీత రంగంలో ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1977లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. -
‘బెంగాల్ టైగర్’ బంపర్ ఆఫర్
రవితేజ ‘బెంగాల్‌టైగర్’గా డిసెంబరు 10న సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. నిర్మాత కేకే రాధా మోహన్ మాట్లాడుతూ-‘‘ మా చిత్రంలోని ఐదు పాటల్లో ఏదో ఒక పాటను పాడి HTTPS://SOUNDCLOUD.COMలో అప్లోడ్ చేసి srisatyasaiarts@gmail.comకు పంపించాలి. వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఈ నెల 30న జరగనున్న ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో బహుమతులను నటీనటులతో అందజేయిస్తాం’’ అని తెలిపారు. ‘‘ఈ ముగ్గురిలో బెస్ట్ సింగర్‌ను ఎంపిక చేసి భీమ్స్‌తో నేను చేయబోయే మరో చిత్రంలో పాట పాడే ఛాన్సిస్తా. ఈ నెల 28 వరకు ఎంట్రీలను స్వీకరిస్తాం’’ అని ‘బెంగాల్ టైగర్’ దర్శకుడు సంపత్‌నంది చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు బీమ్స్ కూడా మాట్లాడారు.