రాంగ్‌ టైమింగ్‌..!

రాంగ్‌ టైమింగ్‌..!


కదనరంగంలో శత్రువును జయించాలనే తపనే కాదు, ఆత్మరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలక్ష్యంగా ఆదమరచామా అదును చూసుకుని క్షణాల్లో పదునైన వేటు వేస్తారు ప్రత్యర్థులు. అందుకే రణరంగంలో కత్తితో పోరాటం చేసే వ్యక్తి కాలి కదలికలతోపాటు, టైమింగ్‌ కూడా కీలకం అంటారు యుద్ధనిపుణులు. అయితే ఈ విషయంలో కంగనా రనౌత్‌ కాస్త తొందరపడ్డారు. ఫలితంగా ఆమె లీడ్‌ రోల్లో యాక్ట్‌ చేస్తున్న ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’లో ఆమె గాయపడ్డారు. కంగనాకు 15 కుట్లు పడ్డట్లు సమాచారం. ఈ విషయం గురించి  నిర్మాత కమల్‌జైన్‌ మాట్లాడుతూ–‘‘ కంగనా, నిహార్‌ పాండ్యా సెట్‌లో కత్తి సీన్‌లో యాక్ట్‌ చేస్తున్నారు. నిహార్‌ కంగానాను ఎటాక్‌ చేసినప్పుడు కంగనా తల కిందకి వంచింది.



అయితే అది రాంగ్‌ టైమింగ్‌లో జరిగింది. దీంతో కంగనా నుదుటి దగ్గర నిహార్‌ కత్తి తగలడం వల్ల గాయమైంది. ఆ టైమ్‌లో కంగనా ఎంతో ధైర్యంగా ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన పట్ల నిహార్‌ వినయ పూర్వకమైన క్షమాపణలను కంగనా ఫీలవ్వడంతో సెట్‌లో అంతా బాగానే ఉంది’’ అని పేర్కొన్నారు.  జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) దర్శకత్వంలో కంగనా లీడ్‌ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. జీ స్టూడియో సమర్పణలో కైరోస్‌ కంటెంట్‌ ప్రొడక్షన్స్‌పై కమల్‌జైన్‌ నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్‌ కథ సిద్ధం చేసిన ఈ సినిమాకు  శంకర్‌ ఇషాన్‌ లాయ్‌ త్రయం సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top