సుందర తెలుంగు

kamal haasan Vishwaroopam -2 updates - Sakshi

అమ్మ పాట..
ప్రేమ పాట..
హీరోయిజమ్‌ పాట (టైటిల్‌ సాంగ్‌)
మొత్తం మూడు పాటలు కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం 2’ కోసం రామజోగయ్య శాస్త్రి రాశారు. వీటిలో ‘అమ్మ..’ పాటను స్వయంగా కమల్‌హాసన్‌ పాడటం విశేషం. పాడిన తర్వాత ఆయన ఏమన్నారో తెలుసా? ‘సుందర తెలుంగు’ అన్నారు. అంటే ‘అందమైన తెలుగు’ అని అర్థం. ‘‘అమ్మ మీద వచ్చే పాట పాడిన తర్వాత కమల్‌గారు ‘తెలుగు సౌండింగ్‌ బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అందుకే భారతియార్‌ తను రాసిన పాటలో ‘సుందర తెలుంగు’ అని రాశారు’’ అంటూ కమల్‌ మన భాషను కొనియాడారు అని రామజోగయ్య శాస్త్రి అన్నారు. ‘‘మన మాతృభాష మీద మనకు చాలా అభిమానం ఉంటుంది. వేరే భాషవాళ్లు మన భాష గొప్పతనం గురించి చెబుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది’’ అని కూడా రామజోగయ్య అన్నారు.

ఇక, భారతియార్‌ గురించి చెప్పాలంటే.. ప్రముఖ తమిళ కవి ఆయన. పూర్తి పేరు సుబ్రమణ్య భారతియార్‌. 1882లో పుట్టిన ఆయన 1921లో చనిపోయారు. ఆయన బతికున్నప్పుడు రాసిన ‘సింధు నదియిన్‌ మీసై నిలవినిలే’.. అనే పాటలో ‘సుందర తెలుంగిల్‌ పాట్టిసైత్తు...’ అనే వాక్యం రాశారు. అంటే.. ‘సుందర తెలుగులో పాట రాసి’ అని అర్థం. దాదాపు వందేళ్ల క్రితమే తెలుగు భాష గొప్పదనం చెబుతూ పాట వచ్చిందన్న మాట. ‘అమ్మ’ పాట పాడాక కమల్‌ ఆ పాటను గుర్తు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం కమల్‌ యూఎస్‌లో ఉన్నారు. ‘విశ్వరూపం 2’ ఫైనల్‌ మిక్సింగ్‌ పనులు అక్కడ చేయిస్తున్నారు. కమల్‌ నటించి, స్వీయదర్శకత్వంలో ‘విశ్వరూపం’కి సీక్వెల్‌గా చేసిన ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top