మీటూ ఉద్యమంపై కమల్‌ ఏమన్నారంటే..

Kamal Haasan Comments On MeToo, Says Only The Accused Should Speak - Sakshi

చెన్నై : గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మీడియా, సినిమా ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు తమల్ని ఎలా లైంగికంగా వేధించారో చెబుతూ మహిళలు మందుకు వస్తున్నారు. దక్షిణాది సింగర్‌గా ఎక్కువగా ఫేమస్‌ అయినన చిన్మయి శ్రీపాద, ప్రముఖ తమిళ సాహిత్య రచయిత వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. స్విట్జర్లాండ్‌‌లో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత వైరాముత్తు తనని హోటల్ గదికి వచ్చి కోపరేట్ చేయమన్నాడని, ఆయన తన స్నేహితురాలిని సైతం వేదించాడని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిన్మయి వెలుగులోకి తీసుకొచ్చిన వైరాముత్తు చీకటి కోణంపై చాలా మంది కోల్‌వుడ్‌ స్టార్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

తాజాగా మీడియా సమావేశంలో, కమల్‌ హాసన్‌ కూడా చిన్మయి-వైరాముత్తు వివాదం, మీటూ ఉద్యమంపై స్పందించారు. మహిళలు తమకు జరిగిన అ‍న్యాయాన్ని నిజాయితీగా, న్యాయంగా చెప్పాలని కమల్ అన్నారు. మహిళలు నిజాయితీగా జరిగిన ఇబ్బందులు చెబితే, అర్థవంతమైన న్యాయం దొరుకుతుందని చెప్పారు. మీటూపై దానికి సంబందించిన బాధితులు మాత్రమే అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉందని, ఇందులో సంబంధం లేని వ్యక్తులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేయటం వల్ల ఇది వివాదానికి దారి తీస్తుందని అన్నారు. 

మీటూ ఉద్యమాన్ని తాను స్వాగతిస్తున్నానని, దీనిని స్వాగతించే మార్పుగా చూస్తున్నానని పేర్కొన్నారు. కాగా, నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేయడంతో భారత్‌లో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత మహిళా జర్నలిస్ట్‌లు పని ప్రదేశాల్లో, తమ ఉన్నతస్థాయి అధికారులతో ఎదుర్కొన్న లైంగిక ఆరోపణలను ట్విటర్‌ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. గాయని చిన్మయి సైతం తనపై వేధింపులకు పాల్పడ్డ వారి పేర్లను ట్విటర్‌ ద్వారా బహిర్గతం చేస్తూ బాంబు పేల్చారు.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top