ఆయన మాత్రమే బాకీ.. | Kajal Aggarwal Special Interview | Sakshi
Sakshi News home page

అలాంటి వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా!

Oct 17 2019 7:32 AM | Updated on Oct 17 2019 7:32 AM

Kajal Aggarwal Special Interview - Sakshi

సినిమా: పుష్కరానుభవాల నటి కాజల్‌అగర్వాల్‌. అందులో హింది, తెలుగు, తమిళం భాషలకు చెందినవెన్నో. నేటికీ నాటౌట్‌ హీరోయిన్‌గా, ఇంకా చెప్పాలంటే క్రేజ్‌ ఏమాత్రం తగ్గని నాయకిగా రాణిస్తున్న నటి కాజల్‌అగర్వాల్‌. ఈ సందర్భంగా కాజల్‌ ఇటీవల మీడియాతో తన అనుభవాలను పంచుకుంది.

ప్ర: నటిగా 12 ఏళ్లు పూర్తి చేశారు. ఎలా ఉందీ పయనం?
జ:ఏడాదికేడాది వేగంగా జరిగిపోతోంది. ముఖ్యంగా సినిమావాళ్లు బిజీగా ఉండడంతో రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియని అర్థం కాని పిరిస్థితి. ఇక సినిమాలో తన అనుభవం చాలా అందమైనదే. నిత్యం కొత్త కొత్తవారిని కలుస్తుంటాను. కొత్త కొత్త అనుభవాలు లభిస్తున్నాయి. పర్శనల్‌గానూ,కేరీర్‌ పరంగానూ చాలా నేర్చుకున్నాను.  ఇంకా చాలా నేర్చుకోవాలి.

ప్ర:భాషా సమస్య సమసిపోయినట్లేనే?
జ: నేను హిందీ అమ్మాయిని. హిందీ భాషే తెలుసు. కాబట్టి తమిళ్, తెలుగు వంటి భాషా చిత్రాల్లో సన్నివేశాలను అర్థం చేసుకుని నటించడం శ్రమగానే అనిపించింది. అయితే అందుకు సిద్ధం అయ్యాను. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ఛాలెంజ్‌తో కూడినదే. అలాంటి సవాళ్లను అధిగమిస్తేనే మనం ఇతరులకంటే ప్రత్యేకంగా ఉండగలం. నేను ముంబై వాసినైనా తమిళనాడు, హైదరాబాద్‌లలోనే అధికంగా నివసిస్తుండడంతో నాకు తెలియకుండానే నేను దక్షిణాది అమ్మాయిగా మారిపోయాను.

ప్ర: చిరంజీవి, విజయ్,అజిత్‌ వంటి స్టార్‌ హీరోలతో నటిస్తూనే వర్ధమాన హీరోలతోనూ నటిస్తున్నారు. అలా నటిం చడం వల్ల మీ సినిమా జీవితం బాధింపునకు గురవుతోందని భావించడం లేదా?
జ:నాకు సంబంధించినంత వరకూ కథే హీరో. అందులో పాత్ర నచ్చితేనే నేను నటించడానికి అంగీకరిస్తాను. అంతే కానీ పెద్ద హీరో, చిన్న హీరో అన్న తారతమ్యం చూపడం నాకిష్టం ఉండదు. చిరంజీవి లాంటి హీరోలతో నటించేటప్పుడు వారి అనుభవంతో చాలా నేర్చుకోవచ్చు.  ఇకపోతే కాజల్‌ మంచి నటి అన్న ఇమేజ్‌ మినహా వేరే ఇమేజ్‌ను నేను కోరుకోవడం లేదు.

ప్ర: మీ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫిట్‌నెస్‌ వీడియోలు చాలా పోస్ట్‌ చేస్తుంటారు. మీ ఫిట్‌నెస్‌ రహస్యం?
జ:ఫిట్‌నెస్‌ రహస్యం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. పళ్లు, కాయకూరలు ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాను. మాంసాహారాల జోలికి పోను. ప్రొటీన్ల కోసం ఫిష్‌ కర్రీ తింటాను. వీటన్నింటికంటే కంటికి మంచి నిద్ర ఉండాలి.అదే మనకు నూతనోత్సాహాన్నిస్తుంది. ఫిట్‌నెస్‌ అనేది బాడీని శరీర ధారుడ్యం మాత్రమే కాదు అందులో మనసుకు సంబంధించిన విషయాలు ఉంటాయి.

ప్ర: సినిమారంగంలో మీ స్నేహితులెవరు?
జ:నాకు సమంత, నయనతార, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా నేను నటించే హీరోలందరితోనూ సన్నిహితంగా మాట్లాడతాను. అయితే నాకు స్నేహితులంటే పాఠశాలలో నాతో చదివిన వారే. వారే నా సంతోషం, దుఖం, కోపం అంతా.

ప్ర:బయోపిక్‌ చిత్రాల గురించి మీ అభిప్రాయం? ఎవరి బయోపిక్‌లోనైనా నటించాలని కోరుకుంటున్నారా?
జ:బయోపిక్‌ చిత్రాలు మనకు అవసరమే. నా వరకూ రాజకీయనాయకులు, క్రీడాకారుల బయోపిక్‌ల్లో నటించాలన్న ఆశ ఉంది. కారణం నాకు రాజకీయాలు తెలియవు. స్పోర్ట్స్‌ ప్లేయర్‌నూ కాను. అందువల్ల ఇలాంటి బయోపిక్‌ల్లో నటించడం నాకు నేనే చేసుకునే సవాల్‌ అవుతుంది.

ప్ర:కాజల్‌అగర్వాల్‌ గురించి ఇంత వరకూ వదంతులు రాకపోవడంలో రహస్యం?
జ:రహస్యం అంటూ ఏమీ లేదు. షూటింగ్‌ ముగియగానే నేరుగా  రూమ్‌కు వెళ్లి భోజనం చేసి నిద్రకుపక్రమిస్తాను. నాకు ఫ్రెండ్స్‌ చాలా తక్కువే. అదీ సినిమాకు చెందిన వారితో డిన్నర్, పార్టీలకు వెళ్లను. పార్టీలకు వెళ్లితే అది ముంబైలోని తన స్కూల్, కాలేజ్‌ ఫ్రెండ్స్‌తోనే.

ప్ర:తమిళంలో విజయ్,అజిత్, జయంరవి నటులందరితోనూ నటించారు. ఇప్పుడు కమలహాసన్‌తో నటిస్తున్నారు. నెక్టŠస్‌ ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు?
జ: సూపర్‌స్టార్‌తో నటించాలి.ఆయన  మాత్రమే బాకీ.

ప్ర:పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జ: ఈయన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనిపించేలా ఇప్పటి వరకూ ఎవరినీ కలుసుకోలేదు. అలాంటి వ్యక్తి తారసపడితే వెంటనే పెళ్లి చేసుకుంటా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement