ఉద్యోగులకు దసరా లాగే.. కబాలి బోనస్!

ఉద్యోగులకు దసరా లాగే.. కబాలి బోనస్!


సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక విషయం జోరుగా చక్కర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్ తన సినిమా సుల్తాన్ను ఈద్ రోజున విడుదల చేయించారు. అది సెలవు కాబట్టి, కలెక్షన్లు బాగుంటాయని అలా చేశారట. రజనీకాంత్ మాత్రం తన కబాలి సినిమాను యథాతథంగా శుక్రవారమే.. అంటే ఈనెల 22న విడుదల చేస్తున్నారు. అయితే.. తాను ఎప్పుడు సినిమా విడుదల చేయిస్తే అదే సెలవు అయిపోతుందని రజనీ అంటున్నట్లుగా ఈ ఇద్దరు హీరోల ఫొటోలతో కూడిన మెసేజి ఇప్పుడు వాట్సప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలలో వైరల్ అయ్యింది.ఇదేదో సరదాగా అన్న విషయం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. తలైవా సినిమా విడుదల అవుతోందని ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించేశాయి. కొన్ని కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ సినిమా విడుదల అవుతున్న 22వ తేదీన ఉన్నట్టుండి సిక్ లీవు పెట్టాలని అనుకోవడంతో ఆ విషయం సదరు యాజమాన్యాలకు తెలిసిపోయింది. ఎందుకొచ్చిందని.. కంపెనీలు ముందుగానే సెలవు ప్రకటించేశాయి. దాంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది లాంగ్ వీకెండ్ అయింది. చెన్నై, బెంగళూరులలోని చాలా కంపెనీలు కబాలి విడుదల సందర్భంగా సెలవు ఇచ్చాయి. ఒక కంపెనీ అయితే.. ఏకంగా నోటీసులోనే తమ ఉద్యోగుల విషయాన్ని ప్రస్తావించింది. తలైవా రజనీ సినిమా కబాలి విడుదల సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నామని, ఆరోజు ఉద్యోగులు సిక్ లీవు పెట్టకుండా, మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేయకుండా ఉండేందుకు సెలవు ఇస్తున్నామని చెప్పారు.అంతేకాక.. ఉద్యోగులకు, వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా కబాలి సినిమా టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ఓపస్ వాటర్ ప్రూఫింగ్ కంపెనీ, చెన్నైకి చెందిన ఫిండస్ ఇండియా లాంటి వాళ్లు ఇలాంటి ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు. దీపావళికి, దసరాకు బోనస్ ఇచ్చినట్లే తాము తమ ఉద్యోగులకు కబాలి బోనస్ ఇస్తున్నామని చెబుతున్నారు. దాంతో మిగిలిన కంపెనీలవాళ్లు కూడా తమకు సెలవు ఇవ్వాలని అడుగుతున్నారు.Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top