తెరపైకి అమ్మ జీవితం

Jayalalitha biopic to go on the floors on February 24 - Sakshi

సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తొలిసారి ఓ హీరోయిన్‌ బయోపిక్‌తో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సినిమాలు చూడటం మానేసినవాళ్లను సైతం థియేటర్స్‌కి రప్పించింది. ఇప్పుడు తమిళ ప్రజల గుండెల్లో  ‘అమ్మ’గా ముద్ర వేసుకున్న జయలలిత జీవితం సిల్వర్‌ స్క్రీన్‌కి రానుంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న విబ్రి మీడియా బ్యానర్‌ జయలలిత బయోపిక్‌ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనుంది. ‘మదరాసు పట్టణం’ చిత్రంతో దర్శకుడిగా పలు అవార్డులు అందుకున్న విజయ్‌ ఈ సినిమాకి దర్శకుడు.

విబ్రి మీడియా డైరెక్టర్, ‘సైమా’ అవార్డ్స్‌ చైర్మన్‌ బృందాప్రసాద్‌ అడుసుమిల్లి మాట్లాడుతూ– ‘‘ఒక సాధారణ రాజకీయ నేత నుంచి రాజకీయ శక్తిగా మారిన మహిళల్లో జయలలిత ఒకరు. భారత రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ఒక చెరగని సంతకం. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజుని పురస్కరించుకుని సినిమా ప్రారంభించనున్నాం. అదే రోజు ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘జయలలితగారి బయోపిక్‌కి విజయ్‌ ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ చూసుకుంటున్నాడు. బాలీవుడ్, సౌత్‌కు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించనున్నారు. 2019లోనే ఈ సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత విష్ణు ఇందూరి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top